Women Tradition : ఆ ఫంక్షన్ హాల్ అంతా కోలాహలంగా ఉంది. పట్టు చీరల రెపరెపలతో గాజుల సవ్వడిలతో కనులకు విందు చేసే అందమైన ఆభరణాలతో అలంకరించుకున్న స్త్రీలు, హుందాగా మరెంతో దర్జాగా అలంకరణ చేసుకున్నామా లేదా అన్నట్టుగా తయారైన యువకులు,
బాధ్యతగా వ్యవహరించే పురుషులు నిండి ఉన్న ఆ సభా ప్రాంగణం చాలా హృద్యంగా గోచరిస్తోంది.
అది ఒక కళా సాంస్కృతిక రంగానికి చెందిన బహుమతి ప్రధాన సభ. అక్కడ ఉన్న వారందరూ ప్రముఖ రచయితారచయిత్రులు. మహాకవి కవయిత్రులు.
వారి అందరి నడుమ అన్నప్రాసన చేయించుకుంటున్న చిన్నపిల్లవాడులాగా, రచనల్లో ఓనమాలు నేర్చుకుంటున్న నేను బహుమతి
అందుకోవడానికి రావడం నాకు నమ్మశక్యం కాలేదు.
ఏదో కలలా జరిగిపోతోంది. ఇక్కడ చూస్తే నాకు వాతావరణమంతా కొత్తగా అనిపిస్తోంది. ఆలోచిస్తూ ఒక పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని పరిసరాలను గమనించసాగాను.
చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరి మాటల్లో వాళ్ళు ఉన్నారు. కొందరు పుస్తకాలకు సంబంధించిన విషయాలు, మరికొందరు వారు రాసిన రచనల
గురించి, ఇంకొందరు వారి వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటున్నారు.
అంతా గమనిస్తుండగా, ఒక పెద్దావిడ మరో నడివయసు కలిగిన ఇంకో స్త్రీ వద్ద కనులు నిలిచిపోయాయి. ఎందుకో అందరిలో ఆ పెద్దావిడ
చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు. ఆమె చిరునవ్వు, ఆమె హుందాతనం నన్ను ఆకట్టుకున్నాయి.
చూడడానికి చాలా నెమ్మదిగా, కట్టుబొట్టు చాలా అందంగా, ప్రశాంతమైన వదనంతో చెరగని చిరునవ్వుతో చాలా అందంగా ఉన్నారు.
పక్కనే ఉన్న ఆ స్త్రీ చెప్పే మాటలు ఆలకిస్తూ ఉన్నట్లు తల ఆడిస్తున్నారు ఆవిడ. నాకు తెలియకుండానే వాళ్ళ వైపు అలా చూస్తూ చాలా సేపు ఉండి పోయాను.
సభ మొదలుపెట్టారు. ముఖ్య అతిధి వేదికను అలంకరించమని కోరారు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. నేను గమనించిన ఆ వ్యక్తి ఒక ప్రముఖ రచయిత్రి.
ఆవిడే ఈ సభకి ప్రముఖ వ్యక్తి. నాకు బహుమతి ప్రధానం కూడా ఆవిడ చేతుల మీదగానే జరిగింది. నా ఆనందానికి అవధులు లేవు.
చిన్న ఫంక్షన్ ఉంది అని అతిథిగా ఎవరినైనా పిలిస్తేనే, పావుగంట, అరగంట అంటూ లేటుగా వచ్చి, వారి ప్రత్యేకతకు అదే నిదర్శనం అనుకునే ప్రముఖులు ఉన్న ఈ రోజుల్లో, నిజమైన గౌరవ మర్యాదలు కలిగిన ఉండి, ఒక ప్రత్యేక స్థానంలో నిలబడిన ఈమె సాధారణ వ్యక్తి లాగా
ఆ సభలో కూర్చుని ఉండడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది.
అందుకే అంటారేమో అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని.
Also Read : రావు గారి ఉపవాసం