కలం గళం
కలం గళ మెత్తితే
నిజాలు నిర్భయంగా రాగాలు తీయాల్సిందే
అధికారం, ప్రజలకు వంత పాడాల్సిందే
వెలిగిపోతున్న సుందర భారతం ఒకవైపు
నలిగిపోతున్న దీనజన భారతం మరోవైపు
అన్యాయాలు, ఆక్రోషాలు
అవమానాలు, అర్ధాకలులు
అరాచకాల మారణహోమంలో
అబలల,సామాన్యుల బతుకులు,
సమిధలు అవుతున్నాయి.
మానవత్వం మసకబారి,
మనీ తత్త్వం వెర్రి తలలు వేస్తున్న
నవీనపోకడలపై,మనసున్న
మనుషుల కలం గళం ఎత్తాల్సిందే
అక్షర యాగం చేయాల్సిందే
అమానుషాన్ని, దుర్మార్గాన్ని
ఖండించే కరవాలంలా నా కలం,
యే కొంతమంది ఆర్తుల గళంగా మారనప్పుడు
అసహాయులకు ఆసరాగా మారనప్పుడు,
అక్షరాలకు అర్థం ఏముంది?
విభేదాలు విస్మరిద్దాం
కులం, మతం, ప్రాంతం
అనే అడ్డుగోడలు ను అధిగమిద్దాం
అసమానతలను రూపుమాపి
అంతరంగాలలో అంతరాలను అంతమొందిద్దాం
మషులంతా ఒక్కటేనని చాటి చెపుతు,
మానవతకు అండగా నిలబడదాం
అరాచకవాదులను నిలదీద్దాం
దుర్నీతులను దునుమాడదాం
కలం,గళం వినిపిద్దాం
సిరాసాక్షిగా చరితను తిరగ రాద్దాం
Also Read : శ్రీకారం