ఎటువైపు
నా వ్యక్తిత్వపు పాదాలపై
ఇప్పుడొక కొత్తపాటనెత్తుకొని
సాగాలని ఉంది
నెత్తుటిపొత్తిళ్లను ముద్దాడిన నేలమ్మను
కత్తుల చెరనుండి విడిపించాలని ఉంది
బడుగుల కన్నీటికి సాక్ష్యమైన పవనపు చెలిని
కలతల్లేని తరంగంగా తరలమని
ఉరితాడును వేలాడేసిన ఎండినకొమ్మను
పచ్చగా పల్లవించమని
కరువును మింగిన పైరమ్మను
పసిడిపంటై నవ్వమని
అకృత్యాలను దాచుకున్న చీకటితెరను
న్యాయపువెలుగును కాయమని
మోసపు సంతోషాన్ని మోస్తున్న
కసాయి హృదయాన్ని
మానవత్వపు మలయమారుతాన్ని వీచమని
అడగాలని ఉంది
ఆందోళన దారులు విడిచి
ఆనందపూదోటంటి
నవలోకం వైపు కొత్త అడుగులు వేయాలని ఉంది
ఏ నీడలు పడని స్వంతమై విరియాలని ఉంది
Also Read : వెయ్యి తొలి అడుగు