Well of peace : నేను సైతం

నేను సైతం

 

నేను సైతం

నేను సైతం దేశ ప్రగతికి
విశ్రమించక విసుగుజెందక
శక్తియుక్తులధారపోసెద
సర్వజనుల సుఖంబుగోరెద
శాంతి బావుట నెగుర వేసెద.
దేశకీర్తిని దేశ దీప్తిని
దిగంతమంతను వ్యాప్తిజేసెద.

ఘనమగు హిమవన్నగములు
పవిత్ర గంగా జలములు
సస్య శ్యామల నేలలు
హితమును గూర్చెడు వనములు
అపరిమితపు ఖనిజమ్ములు
వనచరములు,జలచరములు

సుందరమౌ కట్టడములు
స్ఫూర్తి నిచ్చు దేవళములు
తేనెలూరు పలు భాషలు
వేద మంత్రములఘోషలు
మహామహుల పదముద్రల
తడియారని చరిత్రగల

ఘన భారత ధరియిత్రిన
పరిమళభరితమ్ములైన
ప్రగతిపూలు పూయించగ
నేను సైతం ఉడుత భక్తిన
శాయశక్తుల పాటుపడెదను.

నేను సైతం, నేను సైతం
సంపద పెంచగజూతును
సాటిజనుల ప్రేమింతును
సత్యమునే వచియింతును
ధర్మపథమ్మున నడుతును.

నేను సైతం నేను సైతం
వంచనచేయగ నెంచను
ద్వేషాలను రగిలించను
భూతదయను కలిగుందును
పర్యావరణ మ్మెప్పుడు
పరిరక్షించగ జూతును.

నేను సైతం నేను సైతం
ప్రగల్భాలను పలుకబోను
పరుల సొమ్మును దోచుకోను
మతాల మధ్యన చిచ్చుబెట్టను
కులాలనెప్పుడు గేలిచేయను.

నేను సైతం నీవు సైతం
భుజము భుజమును కలుపుదాం
సంకుచిత తెరలను చింపుదాం
బడుగుజనులకుసాయపడదాం
భవ్య భవితకు బాట వేద్దాం

Also Read :  వెలుగు బాటై నిలుస్తాను

 

 

 

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!