Ugadi Festival : ఉగాది పండుగ – విశిష్టత

ఉగాది పండుగ - విశిష్టత

    

 ఉపోద్ఘాతం:

         “భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక గొప్ప నైతికతను ఈ ప్రపంచానికి నేర్పింది మన భారతదేశం. ఈ దేశమే కాదు, ఈ దేశంలో జరిగే ప్రతి విషయం కూడా ఒక గొప్ప విషయంగానే చెప్పాలి. ఆ కోవలో చెప్పాలంటే మన పండుగలుకూడా.

భారతీయ తత్వంలో ఉన్న గొప్పదనాన్ని ఒక్కసారి కూలంకషంగా పరిశీలిస్తే ఈ దేశంలో జరిగే పండుగ మానవ జీవితాలతో ముడిపడి ఉంటాయి.

నిజానికి పండుగలు మతాల ఉనికిని చాటటానికి ఉంటే, భారతదేశంలో తెలుగు వారు, తెలుగు భాష అభిమానులు, తెలుగుని ప్రేమించే ప్రతి ఒక్కరూ జరుపుకొనే ఈ పండగ మాత్రం మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే ఒక సంభాషణల ఉత్సవంగా  అభివర్ణించవచ్చు.

చరిత్ర మూలాలు:

భారతీయ సంప్రదాయం ప్రకారం “చైత్ర శుక్ల పాడ్యమి” నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాల వర్ణన. ఉగాది “ఉగస్య ఆది” అనే పదాల నుండి ఆవిర్భవించింది.

“ఉగ” అనగా నక్షత్ర గమనం.  నక్షత్రానికి మరో అర్ధమే జన్మ, ఆయుష్షు. “ఆది” అనగా మొదలు . “ఉగాది” అనగా ప్రపంచం జన్మ, ఆయుష్షులకు మొదటిరోజు కనుక కాల క్రమేణా అది ఉగాదిగా మారింది.

“యుగం” అనగా రెండు లేక జంట అని అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయన అనబడే ద్వయ సంయుతం “యుగం” (సంవత్సరం). ఈ ఉగాదిలోనే వసంతకాలం కూడా వస్తుంది. సూర్యునికి, సకల ఋతువులకు, ప్రాతః సాయంకాలాలకు, మరియి త్రికాలముల (3 కాలాలు)కు  “ఉషాదేవతదే మాతృస్వరూపం అనేది చరిత్ర ఆదారం.

ఉగాదిని, ప్రకృతుని వేరు చేసి చూడటం అసాద్యం. ఈ రెండు ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న దృగ్విషయాలు. ప్రకృతి ఉంటేనే, ఉగాది ఉంటుంది. ఉగాది ఉంటేనే ప్రకృతి యొక్క విలువ తెలుస్తుంది. ఉగాది పండగని ( Ugadi Festival)  మత పరంగా కంటే సామాజిక, మరియు వ్యక్తి పరంగా చూపించాలన్నదే నా ఈ ప్రయత్నం.

 జీవన సంబందాల దృక్పధంలో ఉగాది

 పునరఃనిర్మాణంలో ఉగాది :                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                    ఉగాది కుటుంబాలని ఐక్యం చేసే ఒక మహత్తరమైన కార్యం. ఈ పండగకి ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, కుటుంబంగా ఒక దగ్గరకి చేయడమే ఉగాదికి ( Ugadi Festival) ఉన్న గొప్ప గుణం. దీని ద్వారా ప్రస్తుతం కనుమరుగయ్యే ఉమ్మడి కుటుంబ వ్యవస్త, కుటుంబ బంధాలు, చుట్టరికాలు, కాలగర్భంలో కలుస్తున్న రాకపోకలు, ఉగాది ఒక మంచి మేలుకొలుపు.

ప్రకృతి ఎలా అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి ఒక జీవాన్ని ఇచ్చి, తనతో పాటు అభివృద్ది చేస్తుంది. అలాగే మానవ సంబందాలు కూడా అవి పెరుగుతూ, మానవులు , ఇతర జీవరాశి అభివృద్ది చెందుతూ ఈ ప్రకృతిలో భా గం కావడమే ఉగాది ఉద్దేశం.

స్త్రీ వాదంలో ఉగాది :

ఈ ప్రపంచంలో మరో దానిని సృష్టించాలి అంటే,దానికి మూలం స్త్రీ. ఆది చెట్టు అయినా, చివరికి మానవుడు అయినా. స్త్రీకి ఉన్న గొప్ప లక్షణం దేనినైనా భరిస్తూ, తనతో ఉన్న వాళ్ళకి ఇవ్వడం. స్త్రీ యొక్క ప్రసవ వేదన , ప్రకృతి ఇచ్చే ప్రతి పదార్ధానికి పెద్దగా ఏమి తేడా లేదు. ప్రసవ వేదన భరించిన తర్వాత బిడ్డకి జన్మనిస్తుంది స్త్రీ. అన్నీ కాలాలను భరించి మంచి ఫలాలని ఇస్తుంది ప్రకృతి. అలా ఇచ్చిన వాటికి అభివృద్దిలో తోడుగా ఉంటాయి ఈ ప్రకృతి, స్త్రీ.

నిరంతర కర్షక క్షేత్రం – ఉగాది :

ప్రకృతి, జీవరాసులు రెండు కలిసి చేసే ఉత్సవంమే ఉగాది ( Ugadi Festival) , ఇక్కడ చేసేది భూమి మీద చేసే వ్యవసాయం అనడం కంటే మానవ సంబంధాలతో చేసే వ్యవసాయంగా చెప్పవచ్చు.

వ్యవసాయంలో కావలసిన ప్రతిదీ సమయానికి అందకపోతే వ్యవసాయం ఎలా కుంటుపడుతుందో, మానవులు కూడా ప్రకృతికి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూసుకుంటే ప్రకృతి తన ఫలాలను తగిన సమయంలో ఇస్తూ, మానవులతో, జీవారాసులతో కలిసి రోజు పంట కోస్తూ ఆనందిస్తుంది.

రైతు – రాశుల , రాజు ఉగాది :

ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా బేరీజు వేస్తూ, తమ భవిష్యత్ కొరకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ నాడు ఇష్టత చూపుతారు. ప్రతి ఉగాదికి రైతు ఒక రాజులాగా తన పొలానికి నడుస్తూ తన పొలంలో పనిని

మొదలుపెడతాడు. అందుకే రైతులను గౌరవించే ఒక వేడుకగా ఉగాది నిలుస్తుంది

మానసిక దృక్పధంలో ఉగాది :

పునరఃనిర్మాణంలో ఉగాది :

ప్రస్తుతం మన అనుభవిస్తున్న ఈ కరోనా ప్రళయం మానవ నిర్మితం, స్వీయ ఖర్మ ఫలితం. ప్రకృతి యెడల మానవుని ధోరణి రోజు రోజుకి శృతి మించి పోతున్న తరుణంలో, ఉగాది ప్రకృతి హంతకులకి ఇస్తున్న హెచ్చరిక. ఇప్పటికే కరోనా కారణంగా ప్రకృతి కొంత వరకు మానవులకు బుద్ది చెప్పి, తనని తాను తిరిగి నిర్మించుకుంది.

ఈ తాత్కాలిక లాక్ డౌన్ లో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇక మొత్తం నిర్మించుకొనే అవకాశం తీసుకొనే పరిస్థితి తీసుకొని రావొద్దని, అలా జరిగితే మానవ జాతి అంతరిచిపోతుంది అని ఈ ఉగాది ఈ మానవాళికి ఇస్తున్న ఒక హెచ్చరిక

స్వీయ ఆత్మ పరిశీలనా సమయం ఉగాది :

ఈ పర్వదినం ప్రకృతి ఎడలా మానవుని వైఖరి ఎలా ఉందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. నిజంగా ప్రకృతి ఇచ్చే ఫలాలతోనే ఉగాదిని ( Ugadi Festival) జరుపుతున్నమా? లేక కృత్రిమమైన ఫలాలతో ఉగాదిని జరుపుతున్నమా? అనే విషయ పరిశీలనకు ఉగాది ఒక వేదిక, ఘట్టం.  

 నిజ జీవనసారం ఉగాది :

జీవితం మంచి చెడుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఓర్పుతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. షడ్రుచుల (6 రుచుల) సమ్మేళనం తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది ( Ugadi Festival) పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ముగింపు :

అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాకుండా, మరాఠీలు “గుడిపడ్వా” అని, తమిళులు “పుత్తాండు” అని, మలయాళీలు “విషు” అని, సిక్కులు “వైశాఖీ” అని, బెంగాలీలు “పొయ్‌లా బైశాఖ్” అని రకరకాల పేర్లతో వాడుకలో ఉంది. అయితే తెలుగు వారితో పోలిస్తే ఈ పండుగను నిర్వహించడంలో వారికి మనకి పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును.

చివరిగా, ఉగాది ఒక పండుగ – పంటల పండుగ, ప్రకృతి పండుగ, రైతుల పండుగ

ఉగాది ( Ugadi Festival) ఒక గీతం,మానవులు, ప్రకృతి పాడే ఒక యుగళ గీతం

ఉగాది ఒక స్త్రీ పోలిక,నిరంతరం కష్టం భరించి ఆధారపడ్డ వారిని పోషించే గుణం.

 

Also Read  : డా సి నారాయణ రెడ్డి – మందార మకరందాలు 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!