పద్యం
తలుపులన్నీ బిగించి
తలపులన్నీ ఒక చోట చేర్చి కలంతో
లిఖిద్దామనుకున్నాను
ఓ పద్యాన్ని.
ఏమో!
వొచ్చినట్టే వొచ్చి మాయమయ్యింది
మెత్తని పరుపు పై దొర్లి దొర్లి
చివరికి
నలిపేసిన కాగితాల ఉండయ్యింది
పదాల్ని వెదికి
అలంకారపు గాఢత లో ముంచి
వాక్యపు మాలలో పొందికగా కూర్చాను
ప్రాణం లేని వెర్రి నవ్వొక్కటి నవ్వింది పద్యం
కిటికీని తెరిచి ఉదయపు మసక వెలుతురు మంచు పొరల్లోంచి
అప్పుడే బయలుదేరిన పక్షిని చూశాను
పక్షి అరుపు లోంచి ఆకలి పుట్టుకొచ్చింది
చిత్రం!
పద్యం ఆకలితో గళం కలిపింది.
వాకిళ్ళ కసువు చిమ్మే చీపుర్ల చప్పుడు వినబడింది
పద్యం పారుకుంటూ వెళ్లి దానితో కలిసి వంత పాడింది
బర్లన్నీ ఓ చోట మూగి మాట్లాడుకుంటున్నాయి
కాపరి కూని రాగం పేడ వెగటును కలుపుకొంది
పద్యం ఆ పాట తో జత కట్టింది
మూసి వుంచితే
ఎలా ఉద్భవిస్తుంది కవిత్వం
పంచేంద్రియాల్ని.
తెరిచి,
కర్మేంద్రియాలు అలసినప్పుడు
వస్తుంది చెమటో, కన్నీరో, కలగలిసిన ఆర్థ్రపు పద్యం
Also Read : విజయ పరిమళం