సగటు మనిషి జీవితం
రాత్రి ఆకాశం ఏదో కోల్పోయినట్లు ఉంది
పేదవాడి బతుకులో వెన్నెలలాగా
పిడికెడు బియ్యంలో నక్షత్రాల్లా రాళ్లు
సగం కడుపే ఆక్రమించి భాధపెడుతున్నాయి
నెల చివర్లో మాయమయ్యావు నేస్తమా
కళలన్నీ తరిగి పోయిన అమవాస్య చంద్రుడిలా
బడుగు జీవుల నెల జీతం నెలంతా లాగలేక
సంసారపు బండి చీకటి ఆకాశములో వదిలేసి వెళ్ళావా
ఒకటో తారీకు కొత్త వెలుగు వస్తుందా?
శరీరము చిందిన చెమటలు తుడిచేందుకు
రక్తాన్ని మరిగించి యంత్రములో వేసి తిప్పితే
ఒక్క పూట పరమాన్నం తినేందుకు పండుగలా
నిజంగా అదేనేమో పండుగ పరమార్థం
ఉన్నవాడికి లేనివాడికి వ్యత్యాసాలు చూపేందుకు
సగం కాలిన శరీరాన్ని నింపేందుకు
పొయ్యిమీద చారెడు మెతుకులు వండాలి
వెలుగు నింపే సంక్రాంతి బహుశా శివరాత్రేమో
ఉపవాసం పేరుతో రోజూ పండుగే కటిక దరిద్రుడికి
పంచభక్ష్యాలు పేరు వినడమే తప్ప
ఆకాశ పల్లెములో ఏరోజు చూడలేదు
ఎండిన చేనులో సూర్యుడి నిప్పులే కనిపించే
తడి ఆరిన మనసులో ఎడారి గోచరించే
పచ్చని అడుగులో కారుచిచ్చు వెలిగే
నెల జీతం పౌర్ణమి తరువాత చంద్రుడిలా తయారయ్యే
Also Read : అణగారిన బ్రతుకులు
