జ్వాల
కదులుతున్న అక్షరపు జ్వాలలు
కదులుతున్నాయి అక్షరపు జ్వాలలు
మస్తిష్కపు వేడికి కరిగి ప్రబలుతున్నాయి
మండే గుండెలో సూర్యుని నీడల్లా కదులుతూ
జాతికి ఉషోదయ కిరణాల ప్రభావం చూపుతాయి
పిడికిలి బిగించిన కలం పిండుతుంది మనసును
తెల్ల కాగితంపై రగులుతుంది ఆశల కుంపటి
వ్యాపిస్తున్నాయి మరుగున పడ్డ జ్ఞాపకాలు ఎన్నో
సృజిస్తున్నాయి కాల ప్రవాహంలో వింతలు
సామాన్యుడి సాహసం బూడిదలో పన్నీరులా
ఖడ్గ కలం తిప్పిన విన్యాసం చరిత్ర అడుగు నిక్షిప్తం
రాయబడ్డ కావ్యాలు వెలుగు చూడని నైజం
అడుగున ఉన్న అక్షరపు నిధుల కేటాయింపు
ఆవేశం కప్పుకొని తిరిగే అక్షర దుప్పటికి రూపాన్ని
బరువైన వాక్యాలు నిత్యం మోస్తున్న సాహసాన్ని
అక్షరపు విందు భోజన రుచులు స్వీకరిస్తూ
అమృత వాక్యాలు సృష్టించేందుకు నా ప్రయత్నం
రాజరికం పోకడల్లో కనిపించని మానవుణ్ణి
కాయ కష్టం రుచి మాత్రమే తెలిసిన మనిషిని
నిజాయితీగా కష్టించే దేశ సంపదను నేను
నన్ను దోచుకునేందుకు ఎగబడ్డ దేశపు దళారులు ఎందరో
అక్షరము ఆసరాగా చేసుకుని కదులుతున్న స్వప్నాన్ని
సమానత్వపు గొడుగులు వేరు చేస్తున్న అభాగ్యుడ్ని
కలము గళం మానవత్వం కోసం విప్పేందుకు వచ్చినా
నిరాడంబరంగా ముందుకు నడుస్తూ సాగుతున్నా
Also Read : అక్షర సమరం
