Telugu Revolutionist : నచ్చిన విప్లవకారుడు – పుచ్చలపల్లి సుందరయ్య

నచ్చిన విప్లవకారుడు - పుచ్చలపల్లి సుందరయ్య

పుచ్చలపల్లి సుందరయ్య

నేను మెచ్చిన మచ్చలేని విప్లవకారుడు సుందరయ్య గారు. విలువల్లో అగ్రగామి,సత్యాన్ని మాత్రమే నమ్ముతు సత్యాన్ని మాత్రమే మాట్లాడేవాడు.సమస్యల పరిష్కారం కోసం నిలదీసి అడిగే వారు అవతల ఉన్నది ఎంత వారు గాని.

సుందరయ్య గారి జీవితం ఎంతో మంది యువతకు ఆదర్శం. డబ్బులు వెదజల్లి డబ్బు కోసం దారి తప్పిన రాజకీయం ఎప్పుడు ప్రజలకు సేవ చేయడం నేర్చుకుంటుందో చూడాలి మరి.

ఎందుకంటే నేడు కార్యకర్తలు కూడా కారులో తిరుగుతూ తమ నాయకులు వెదజల్లిన డబ్బు తీసుకుని డాబు దర్పంవెలగబెడతు జెండాలు పట్టుకుని ఎవరికి జై కొడుతున్నారో కూడా తెలియకుండా విచక్షణ మరచి ప్రవర్తిస్తున్నారు..

మారుమూల ప్రాంతం నుండి ఢిల్లీ పార్లమెంటుకు తన స్వశక్తితో ఎదిగిన నాయకుడు సుందరయ్య గారు. అందరూ కార్లు వాడుతున్న కాలంలో పార్లమెంట్ కి అసెంబ్లీ కి సైకిల్ మీద వెళ్ళిన అతి సామాన్యుడు సుందరయ్య గారు.

నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో భూస్వామి అయినా తండ్రి వెంకట రామ రెడ్డి తల్లి శేషమ్మ దంపతులకు ఆరవ సంతానంగా ‌‌1913 మే ఒకటిన జన్మించారు సుందరయ్య గారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందర రామిరెడ్డి. కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించి తన పేరులోని కులాన్ని సూచించే పదాన్ని తొలగించిన ఆదర్శవాది.

గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితులై స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు కారాగార శిక్ష విధించారు. పిన్న వయసులోనే ఏదో సాధించాలనే  పట్టుదలతో ఉండేవారు. అరెస్టయిన నాటికి సుందరయ్య గారి కి 17 ఏళ్లు కావడంతో బోర్స్టల్ స్కూల్ లో ఉంచారు.

అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం తన జీవితాన్ని ఎటువైపు తీసుకువెళ్లాలి ఎటువైపు ముందు అడుగు వేస్తే తాను అనుకున్నది సాధించగలరో ఈ విషయంపై స్పష్టత వచ్చింది.

బోర్స్టల్ నుంచి విడుదల కాగానే ఆలస్యం చేయకుండా తన స్వగ్రామం చేరుకుని వ్యవసాయ కార్మికులను ఏకం చేసి భూస్వాములపై తిరుగుబాటు చేశారు సుందరయ్య గారు. తనను కమ్యూనిస్టు గా తీర్చిదిద్దిన హైదర్ ఖాన్ ను స్పూర్తిగా తీసుకుంటారు.హైదర్ ఖాన్ అరెస్టయ్యాక ఆయన బాధ్యతను సుందరయ్య గారు తీసుకున్నారు.

రాష్ట్ర అభివృద్ధికి సుందరయ్య గారి చేసిన సూచనలు సలహాలు వాదనలు ఇప్పటికీ విలువైనవి. అనేక విలువైన పుస్తకాలను రచించారు. పనిలో నిబద్ధత,తెలంగాణ సాయుధ పోరాట వీరుడు సమసమాజం కోసం పోరాడిన విప్లవకారుడు.

ప్రజల కోసం అహరహం శ్రమించి, పేదరికం, దోపిడీ నుంచి పేదల విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన మచ్చలేని మహా మనిషి. ఆకలి దారిద్రం లేని సమసమాజం కోసం అహర్నిశలు పోరాడిన విప్లవకారుడు.

పెళ్లి చేసుకున్నప్పటికీ తన సమయం అంతా ప్రజాసేవకే వినియోగించాలనే ఉద్దేశంతో పిల్లలను వద్దనుకుని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న గొప్ప త్యాగశీలి. ” పి యస్ ” అని కమ్యూనిస్టు గాంధీ అని,కమ్యూనిస్టు యోధుడు అని పిలిచేవారు.

తన యావదాస్తిని ప్రజా పోరాటానికి ఖర్చు చేసిన,మార్గదర్శి. నిబద్ధతకు ప్రతిరూపం,కార్మికుల కోసం కార్మికుల దినోత్సవం రోజున పుట్టిన పోరాటయోధుడు నేను మెచ్చిన విప్లవకారుడు మచ్చలేని సూరీడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు.

Also Read : నచ్చిన తెలుగు రచయిత – గుర్రం జాషువా

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!