అవును నా బలం నా తెలుగు
ఎందుకంటే యాభై ఆరు అక్షరాల బలం నా తెలుగు
నే బలంగా వుండాలని అమ్మచను పాలలో
తెలుగుపాళ్ళు కలిపి తెలుగు ‘వాడి’గ పెంచింది
అందుకే నా బలం నా తెలుగు
ఉగ్గుపాలతో అమ్మ కలిపిన తెలుగు వసపాలు
నాకు బలం అవును నా బలం నా తెలుగు
తెలుగు పదాల వాగుపైన అమ్మ పాడిన జోలపాట
పలుకు పలుకులో తేనెలొలుకు తెలుగు పాట
నా బలం అవును నా బలం నా తెలుగు
తెలుగు భాష చిన్నదంటు
చులకచేయు మాటలొద్దు
తెలుగు పలుకు పలుకు
పలుకు పలుకు తేనెలొలుకు
పలుకులమ్మ మెచ్చిన భాష తెలుగు
జిలుగు పదాల జరీకోక
మాయమ్మ తెలుగు కుంకుమరేఖ
ముక్కున మెరిసిన బొక్కెర
నన్నయ్య పదాల నడకలకు
కులుకులు నేర్పిన తెలుగు
తిక్కన చమత్కారాలకు నెలవు
ఎర్రన్న పాలమీగడ పెరుగు తెలుగు
పోతన పొగిడిన వేల్పు
శ్రీనాథుడు పితికిన కామధేనువు పొదుగు
ఈతాడిన ఆవుపాలు జున్ను
అందుకే నా బలం నా తెలుగు
దేశ భాషలందేకాదు తెలుగు లెస్స
లోక భాషలెన్నున్న తెలుగు లెస్స
సరిసమ సరిగసమ మ గరిమ తెలుగు
నా బలం నా తెలుగు నా గర్వం నా తెలుగు
Also Read : నా బలం
