నాకు నచ్చిన జానపద గేయం
వీది చివర సందుకాడ
సందె పొద్దు కాడ సన్న జాజులిస్తా
వస్తవా వస్తవా ఓ పిల్లా వస్తవా వస్తవా
గాజుల పల్లె సంతలోన
బూజమ్మ అంగడిలోన గాజులు తొడిగిస్తా
వస్తవా వస్తవా ఓ పిల్లా వస్తవా వస్తవా
కొండ పొలం గట్టు మీద
మిట్ట మీద ఏటి కాడ కొండ మల్లెలు కోసిస్తా
వస్తవా వస్తవా ఓ పిల్లా వస్తవా వస్తవా
మాధవరం గేటు కాడ
మాణిక్యం నేస్తున్న పట్టుచీర కొనిపెడతా
వస్తవా వస్తవా ఓ పిల్లా వస్తవా వస్తవా
మా ఇంటి ముందు
పచ్చాని పందిరీ వేస్తా భాజాలు మోగిస్తా
వస్తవా వస్తవా ఓ పిల్లా వస్తవా వస్తవా
పెళ్లి పందిరి వేయించూ
భాజాలు మోగించూ తాలిబొట్టు తెప్పించూ
వస్తానంటే వస్తనూ ఓ బావా వస్తనూ నే వస్తనూ
సమీక్ష
ఈ జానపద గేయం అంటే నాకు చాలా ఇష్టం పల్లెటూరి వాతావరణంలో ఈ పాటను సరదాగా బావా మరదల మధ్య రసరమ్యంగా సాగే ఓ ప్రేమగీతం.
ఇటువంటి పాటలను పల్లె ప్రాంతాలలో కలసి మెలిసి పనులు చేసే సమయంలో ఈ పాటను సరదాగా ఆలపిస్తూ వుంటారు. ఎందుకంటే ఆడుతూ పాడుతూ పని చేస్తూ వుంటే అలుపూ సొలుపూ ఉండదనీ వారి గట్టి నమ్మకం.
రచయిత బావా మరదల మధ్య ప్రేమ భావనలను ఎంతో హృద్యంగా రాశారు ఒక్కొక్క వాక్యంలో బావ మరదలు మనసును ఆకట్టు
కోవడానికీ, ఆ అమ్మాయికున్న చిన్న చిన్న కోరికలు తీర్చడానికి హామీ ఇస్తున్నట్లుగా చాలా పొందికగా పదాల భావనలను స్ఫురింపజేశారు.
అతను హామీ ఇచ్చిన ప్రతీ వస్తువు కూడా మరదలు మనసు గెలిచే విధంగా ఉన్నాయి.
మొదటి వరుస వాక్యంలో ”వీది చివర సందు కాడ సందె పొద్దు కాడ సన్న జాజులిస్తా వస్తవా ”ఎందుకు అంత రహస్యంగా బావ మరదలకు పువ్వులు ఇవ్వవలసి వచ్చిందీ అంటే రచయిత పల్లె కట్టు బాట్లను దృష్టిలో వుంచుకొని రాశాడు .
ఎందుకంటే వారికి పెళ్లి కాలేదు. పెద్దలు చూస్తే బావుండదు కదా పూవులు చాటుగా ఇచ్చేటట్లుగా రాశాడు .
రెండో వరుస వాక్యంలో పెళ్లి కాని అమ్మాయిలకు సంతలో అలంకరణ సామగ్రి కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే
ముఖ్యంగా చేతినిండుగా గాజులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని రచయిత ఈ వరుస పదాలను రాశారు.
”గాజుల పల్లె సంతలో గాజులు తొడిగిస్తానని “మూడో వరుస వాక్యంలో అమ్మాయిలకు ఏ పూవులంటే ఇష్టమో దానిని కూడా ఎంతో అందంగా రాశారు. అమ్మాయిలకు మల్లె పూవులంటే ఇష్టమని, అడవిమల్లెలలంటే ఇంకా ఇష్టం అనీ ,అందులో అడవి మల్లెలు తీసుక రావడం కష్టమని మరదలు దగ్గర బావ సాహసాన్ని చూపించడానికి, ఈ వాక్యం రాశారని పిస్తోంది. ఆ వాక్యాలను చాలా హుందాగ రాశారు రచయిత
నాల్గవ వరుస వాక్యాలలో మరదలు దగ్గర బావ ఆర్థిక పరిస్థితి గొప్పగానే వుందనీ తెలియ జేయుటానికి మాధవరం పట్టు చీర కథను చెప్పించారు రచయిత అంటే రచయిత ఈ పాటలో బావా మరదల మధ్య బంధం గురించి అన్ని కోణాలలో ఆలోచించారు .
ఇకపోతే చివరి రెండు వరుస వాక్యాలలో ఇరువైపులా ఇటు పిల్లల అటు పెద్దల గౌరవానికి భంగం కలుగకుండా ,పెళ్లి తర్వాతనే అన్నీ అని నమ్మకం కలిగించడానికీ చివరి రెండు వరుస వాక్యాలను సృజియించారు రచయిత.
మొత్తానికి ఈ జానపద గేయంలో బావ మరదల మధ్య బంధం, పల్లెటూరి కట్టు బాట్లు పెళ్లి అనే సంప్రదాయం ఇలా అన్ని కోణాలలో ఎంతో హృద్యంగా రాశారు.
Also Read : నా కల