జానపద గేయం – మోక్షం
కొండొoడోరి సెరువుల కాడా
సేసిరి ముగ్గురు ఎగసాయం
ఒక్కడికికాడీ లేదు రెండూ దూడా లేదు!
కాడిదూడ లేనెగసాయo
పoడెను మూడు పంటాలొకటి
వడ్లు లేవు, గడ్డిలేదూ
వడ్లూ గడ్డీలేని పంటా
ఇశాఖపట్నం సంతలో పెడితే
ఒట్టి సంతేకానీ సంతలో జనం లేరూ
జనం లేని సంతలోకి వచ్చిరి
ముగ్గురు షరాబులు ఒకరికి కాళ్ళూలేవూ
రెండు సేతుల్లేవూ!
కాళ్లు సేతులు లేని షరాబులు,తెచ్చిరి మూడు కాసులు
ఒకటి వొల్లాల్లొల్లాదు ,రెండు సెల్లాసెల్లాదూ, ఒల్ల సెల్ల కాసులు తీసుకు ,
ఇజయనగరం ఊరికిబోతే ,ఒట్టి ఊరేగానీ,ఊళ్లో జనం లేరూ
జనం లేని ఊళ్ళోనూ ,ఉండిరి ముగ్గురు కుమ్మరులు
ఒకడికి తలాలేదు, రెండుకి మొలా లేదూ
తల మొలాలేని కుమ్మర్లు చేసిరి మూడు భాండాలు
ఒకటికి అంచూ లేదూ, రెంటికీ అడుగు లేదూ
అంటూ అడుగులేని భాండాల్లో ఉoచిరి మూడు గింజాలు
ఒకటి ఉడక ఉడకాదు ,రెండు మిడకమిడ కాదు
ఉడకని మిడకనీ మెతుకులు తినుటకు
వచ్చిరి ముగ్గురూ సుట్టాలు
ఒకరికి అంగుళ్ళేదూ, రెండు మింగుళ్ళేదూ
అoగుడుమిoగుడూలేని సుట్టాలు
తెచ్చిరి మూడు సెల్లాలు
ఒకటి సుట్టూ లేదూ రెండు మద్దెలేదూ
దీని భావము తెలియురా
సమీక్ష
త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి చేస్తున్నారు. ఒక్కడికీ కాడీ లేదు,దూడా లేదు. కాడి బరువు దూడా అంటే మమకారం ముగ్గురికి అవి లేవని అర్థం.అంటే వారు సృష్టించే వేటి మీద వారికి మమకారం లేదు.
సృష్టించబడిన జీవము సత్వ రజో తమో గుణములతో నిండిపోయింది . వరి పంట వేసిన రైతు పంట పండాక పంటకోసే వడ్లను గడ్డి వేరుచేసి ధాన్యాన్ని తీసుకుంటాడు కానీ సృష్టికార్యం ఏళ్లతరబడి పండ్లను ఇచ్చే చెట్టులాగా యుగాల తరబడి జరిగే నిరంతర ప్రక్రియ.కింది చరణాలను మానవజన్మకు అన్వయించుకుందాము .
వడ్లు గడ్డీలేని పంట విశాఖపట్నం సంతలో పెడితే ఇక్కడ విశాఖపట్నం అంటే విశాఖ కొమ్మలూ రెమ్మలూ విస్తరించి ఉన్నదని అర్థం.
సత్వ రజో తమో గుణాలు ఉన్న మనిషిని కొమ్మలు రెమ్మలు గా విస్తరించే సంసారమనే సంతలో పడేస్తే ఈ మాయదారి సంతలోపడి మానవజన్మ పరమార్థాన్ని మర్చిపోయిన వారేగాని గుర్తుతెలిసిన వారు లేరు అర్థం .
సంసారమనే సoతలోనే మనిషికి మూడు తాపత్రయాలు వచ్చాయి.అవి ఆధి భౌతిక ,ఆధి దైవిక ఆధ్యాత్మికమూ అనే మూడు తాపత్రయాలు. ఈ తాపత్రయానికి కాళ్ళూ చేతులూ లేవు. ఈ తాపాలు మనిషినే పరుగెత్తిస్తాయి ,నడిపిస్తాయి ,మంకుపట్టు పట్టిస్తాయి.
కాళ్లు చేతులు లేని షరాబులు ముగ్గురూ మూడు కాసులు తెచ్చారు. మూడు కాసులంటే దారి. ఆ దారి ఏమిటంటే భక్తి జ్ఞాన వైరాగ్య ఈ మూడూ కూడా మనిషికి చెల్లవు.
ఈ చెల్లని కాసులు తీసుకొని విజయనగరం వెళ్లారట. విజయనగరం అంటే ఇక్కడ స్వర్గం అని అర్థం. అది తీసుకుని వెళితే వారు పుణ్యాత్ములు. పుణ్యాత్ములకు స్వర్గంలో చోటుంటుంది కాని మోక్షం పొందిన వారు స్వర్గంలో ఉండరు .
ఈ విజయనగరంలో ముగ్గురు కుమ్మర్లు ఉన్నారట వాళ్ళు యముడు ఇంద్రుడు కాలుడు. వీళ్ళ కి తల మొల లేవు. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఆలోచన లేదు, జీవుడు ప్రాధేయపడడానికి వాళ్లకి కాళ్లు లేవు.
ఈ కుమ్మర్లు ముగ్గురూ మూడు కుండలు తయారు చేసి అందులో మూడు గింజలు వేశారు. అవే పాపపుణ్యాలు వాళ్ళ పాప పుణ్యాల గతజన్మ లెక్కబెట్టి సoచితం ,ప్రారబ్ధం ,ఆగామి అనే మూడు గింజలు వేస్తారన్నమాట .పూర్వజన్మ లాలూ సంకేతమని ఈ జన్మ ఫలితం ప్రారబ్ధం అని అంటారు ఈ రెండింటినీ టాలీ చేయగా వచ్చేదే కర్మఫలo .
ఈ కర్మఫలాన్ని సున్నా చేసుకునే జన్మరాహిత్యం పొందడానికి జీవుడు స్థూల, సూక్ష్మ కారణశరీరాలనే మూడు చుట్టాల మళ్లీ పుట్టి ఈ మానవజన్మ గుణాలకు లొంగుతూ ఉంటారు. కానీ గత జన్మ వాసనల వల్ల నా కక్కలేక మింగలేక చిత్రవధ అనుభవిస్తూ ఉంటారు ఈ జీవి.
మోక్షానికి మధనపడుతున్న జీవికోసం యోగం ధ్యానం సమాధి అని మూడు సెల్లలు మహర్షులు ఇచ్చారు.ఈ యోగం ధ్యానంలో ప్రతి దేవుడూ కర్మఫలాన్ని అనుసరించే తనకు తానుగా కలుసుకుంటూ సాధన ద్వారా సమాధి స్థితికి చేరుకోవాలి, అదే మోక్షం .
ఈ జానపద తత్త్వ గేయాన్ని అడవిబాపిరాజు గారు రచించారు .
Also Read : మంజరి’ నవల’ కనిపించని సూర్యుడు’ పై నా సమీక్ష