అడుగులో అడుగు
ఇప్పుడేగా నువ్వు
నడవడికను నేర్చుకుంది
మొదటి అడుగు తడబడితే ఏంటి?
అందుకునే లోపే
నీ ఆలోచనల్ని నీటి బుడగల్లా
పగిలిపోతున్నాయని నిరాశ పడితే ఎలా?
పిడికిలి నుంచి క్షణాలు
నిమిషాలు, గంటలు ఇసుకలా
వేళ్ళ సందులోంచి జారిపోతున్నాయని
నిర్వేదపడుతావు ఎందుకు?
అప్పుడే అలసటను గంపలకొద్ది
అరువు తెచ్చుకుని కదలకుండా
ఒకే చోట శిలా ప్రతిమైపోతావు
అవధులు లేని నిస్సహాయతను
దేహం లోకి వొంపుకుని
అప్పగింతలు చేసుకుంటున్నావు.
బాధ, కోపం, దుఃఖం
అన్నీటిని ఆకలింపు చేసుకోవాలి అప్పుడప్పుడు
చెరువునో, చెట్టునో వెతుక్కుంటానంటే ఎట్లా
ఎత్తు పల్లాలు లేని నేల ఉంటుందా
చివరి మజిలీ చేరేవరకు
అడుగులో అడుగు స్థిరంగా వెయ్యాలి
పడిపోయిన లేచి పరిగెత్తాలి
అడవిలో తిరిగే పులిలా తడబడకుండా.
Also Read : విజయానికి అభయం