Sri Rama Navami : శ్రీ రామనవమి పండుగ విశిష్టత

శ్రీ రామనవమి పండుగ విశిష్టత

 

శ్రీ రామనవమి పండుగ విశిష్టత

ఆంధ్రుల అభిమాన పండుగ.ఆరాధ్య దేవుడు కోదండ రాముడు.జీవితాన్ని ఎలా గడపాలో రెండు బోట్లు దిగివచ్చి మానవ రూపంలో మనకు చూపించిన మహనీయుడు.
ఎన్నో కష్టాలకు ఓర్చుకొని చిరునవ్వుతో పితృవాక్య పరిపాలకుడిగా ఆలిని రక్షించుకుని రాజ్యాన్ని సుభిక్షం చేసిన రాజాధిరాజు.
ఇది అందరి పండుగ, శ్రీరామనవమి రెండు రోజులు శ్రీరాముడు పుట్టిన రోజు, కల్యాణం ,మరునాడు పట్టాభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది .

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు.

పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము.

హిందువులలో రామాయణం తెలియని వారు ఎవరు ఉండరు. హిందువులకు ఇది అత్యంత పవిత్రమైన పురాణం. శ్రీ రాముడు మానవుడు ఎలా నడుచుకోవాలో ఈ అవతారం లో నడిచి చూపించాడు. రాక్షసులను సంహరించడం, వనవాసం, సీతను వివాహం చేసుకోవడం, ఆమెను రావణుడు

అపహరించడం, ఆమెను వెతకడానికి శ్రీరాముడు ఆంజనేయుడు, సుగ్రీవుల సాయం తీసుకోవడం, సీతమ్మ తల్లి తిరిగి అయోధ్యకు రావడం, ఆ తరువాత మరోసారి సీత అడవుల పాలు కావడం, లవకుశల జననం ఇలా సాగిపోతుంది రామాయణం.

అయితే శ్రీరాముని జననం గురించి కూడా ప్రత్యేక కథనం ఉంది. దశరధ మహారాజుకు పిల్లలు లేకపోతే పుత్ర కామేష్టి యాగం చేస్తారు. ఆ యాగం జరుగుతుండగా యాగ పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరధుని ముగ్గురి భార్యలు సేవిస్తారు. ఆ తరువాత గర్భవతులు అవుతారు.
అలా కౌసల్య గర్భవతియై నవమి తిధి రోజున శ్రీరామునికి జన్మనిస్తుంది.

సాధారణంగా హిందూ సంప్రదాయంలో నవమి తిధిని మంచిది కాదు అని భావిస్తారు. కానీ, శ్రీ రాముడు జన్మించిన నవమి తిధి రోజున మాత్రం శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించారు. ఈ యుగాన్ని వర్ణిస్తూ రాసిన కావ్యాన్ని రామాయణం అంటారు.

ఈ రామాయణం అన్న పదానికి చివరలో ఆయనం అని ఉంటుంది. ఒక్క రామాయణానికి తప్ప ఇతర కాలాల్లో రచించబడ్డ ఏ గ్రంధానికి ఇలా ఉండదు. కారణం ఏంటంటే రాముడు పరిపూర్ణ మానవుడు. మానవుడు ఎలా నడుచుకోవాలి అన్న విషయాన్నీ జీవించి చూపించాడు.

ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధర్మాన్ని వీడలేదు. ఎక్కడ తాను దేవుడనని కానీ, దైవత్వాన్ని గాని ప్రకటించలేదు. అందుకే రామస్య ఆయనం రామాయణం అని పేర్కొన్నారు. ఇక రాముడు జన్మించిన నవమి విషయానికి వస్తే ఈ తిధికి ఓ ప్రత్యేకత ఉంది.

నవమి అంటే 9 వ సంఖ్య కదా! ఈ సంఖ్య పరమేశ్వర తత్వాన్ని చూపిస్తుంది. అంటే ఏ సంఖ్యతో హెచ్చరించినా వచ్చిన ఆ నంబర్స్ ను కలిపితే మళ్ళీ తొమ్మిదే వస్తుంది.

9*1=9
9*2=18 — 8+1 =9
9*3=27 — 2+7=9
9*4=36 — 3+6=9
9*5=45 — 4+5=9

పరమేశ్వరుడు ఎన్ని రూపాలలో ఉన్నా,ఎన్ని అవతారాలు ఎత్తినా ఆయన అసలు తత్త్వం ఒక్కటే అని చెప్పడమే ఈ తిధి ప్రత్యేకత. అందుకే శ్రీ రామ చంద్రుడు ఈ తిధి రోజున జన్మించాడు. ఆయన జన్మించిన నవమి నాడు హిందువులంతా వేడుకగా జరుపుకుంటున్నారు.

ఒక తండ్రికి తనకు కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో తెలిపేది రామాయణం.తండ్రి మాటకు ఎంత విలువ ఇవ్వాలో గౌరవాన్నివ్వాలో తెలిపేది రామాయణం .భర్త ఎక్కడ వుంటే అక్కడే స్వర్గం అని తలిచిన ఇల్లాలు.భర్తపై అపారమైన విశ్వాసం.

ఒక అన్నపై తమ్ముడుకి ఉండే ప్రగాఢమైన నమ్మకం ,భక్తి . యజమాని పై బంటుకి ఉండే విశ్వాసం నమ్మకం భయం భక్తి అన్నీ తెలుస్తాయి రామాయణం ద్వారా.ఈ లక్షణాలతో మన కుటుంబ సభ్యులతో మన మిత్రులతో కలిసి జీవించాలని తెలిపి ఒక మనిషిని మనిషిగా ఎలా బ్రతకాలో బోధించిన నిఘంటువే రామాయణం.

చిన్నతనంలో మా నాన్నమ్మ తో కలిసి రామకల్యాణo చూడటం అక్కడ అందరికి పానకము, వడపప్పు పంచడము ,ఆ వేడికి విసనకర్రలు ఇచ్చేవారు. విసనకర్రలతో విసురుకుoటూ రామ కళ్యాణం అంతా చూసి భోజనాలు చేసి ఇంటికి రావడం మధురమైన జ్ఞాపకం.మరునాడు పట్టాభిషేకానికి

వెళ్లేవాళ్లం. రాత్రి డాబా మీద పడుకుని మళ్లీ నానమ్మ చెప్పిన రామాయణం వింటూ నిద్రపోయేవాళ్ళం .చిన్నతనంలోనే రాముడు ఒక హీరో.అలా మదిలో నిండిపోయాడు రాముడు.రామ కళ్యాణం జగత్కల్యాణం.

ఇప్పుడు భద్రాచలం చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఎక్కడ అయోధ్య? ఎక్కడ మిథిలానగరం? అక్కడినుంచి వనవాసం చేయడానికి ఇన్ని అడవులు కొండలు ఎక్కుతూ దిగుతూ వచ్చారా !?

మనం ఇప్పుడు కారులో వెళితేనే అలసిపోతామేమో అలాంటిదే సుకుమారమైన సీతారామ లక్ష్మణ్ లు ఇవన్నీ ఎలా నడిచివచ్చారో?ఎన్ని బాధలు అనుభవించారో ? రాజాoతపురములో రాజభోగాలు అనుభవించవల్సిన చిన్న చిన్న పిల్లలు లోకకల్యాణం కోసం ఎన్ని బాధలు అనుభవించారని

మనసు ఆర్ధ్రతతో నిండిపోతుంది. అందుకే రాముడు జగదభిరాముడు .అందుకే రామ కళ్యాణం మన అందరి ఇళ్లల్లో జరిగే కల్యాణం.రాముడు మనవాడు మన ఇంటివాడు.

 

Also Read : ఉగాది పండుగ – విశిష్టత

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!