Small Funny Story : రావు గారి ఉపవాసం

చిన్న హాస్య కథ

 

ఏడాదికో ఏకాదశి, జన్మకో శివరాత్రి”సామెత ఆధారంగా చిన్న హాస్య కథ

 

తెల్లారేసరికల్లా రావు గారు దిగ్గున లేచి కూర్చున్నారు.
శివరాత్రి ఉపవాసం గుర్తొచ్చేసరికి సగం నీరసించి పోయారు.
కళ్ళు తెరిచి దక్షిణ హస్తాన్ని తదేకంగా చూసుకున్నారు.
మసక మసకగా కనిపించి
ఉపవాస ప్రభావం వల్లనేమో అనుకున్నాడు.
లేచి కాలకృత్యాలు తీర్చుకుని గంగాస్నానానికని బయల్దేరాడు. జనసమ్మర్థం చాలా ఉంది. రావు గారు ఎలాగో అలా గంగాస్నానం చేసేశారు. నీల్లంటే భయం వల్ల, మొదలే నీరసంగా ఉండటం వల్ల నీళ్లు నిలిచిన చిన్న మడుగు లోనే స్నానం కానిచ్చేశారు.
వస్తూ వస్తూ పండ్ల మార్కెట్ దగ్గర  ఓ కిలో అంగూర్లు,
ఓ కిలో సంత్రాలు, డజను అరటి పళ్ళు, ఏడాదికో శివరాత్రి తిని తీరాలి అంటూ ఓ కిలో కంద గడ్డలు కొనుక్కున్నారు.
సమయం ఉదయం
తొమ్మిది దాటింది.
కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి రావు గారికి.
“చాయ్ పెట్టవే!”
కసురుకుంటూ వచ్చారు
భార్యాదేవి పైకి.
ఆమె చిన్న గ్లాసు కు కొంచెం ఎక్కువ, పెద్ద గ్లాసు కు కొంచెం తక్కువ చిక్కని చక్కెర కలిపిన చాయ్ ని అందించింది.
ఊదుతూ గ్లాసు వెనక్కీ, ముందుకీ కదుపుతూ తాగేశాడు.
కాసేపు సెల్ఫోన్లో వాట్సప్ చూస్తూ కూర్చున్నారు.
కొంతసేపటికి బోర్ కొట్టడమూ, తాగిన ఛాయ ఆహారనాళం నుండి చిన్న ప్రేగులో మాయమవడమూ తటస్థించాక
చుట్టూ చూసి తెచ్చిన పళ్ళని కడగమని భార్యని పురమాయించాడు.
భార్య పళ్ళన్నీ కడిగి పళ్లెంలో ఉంచింది.
కందగడ్డల్ని స్టవ్ పై ఉడికించింది.
రావు గారికి ఏమీ తోచడం లేదు విపరీతమైన ఆకలి అందులోనూ సెలవు దినం.
పూజ చేద్దామని దేవుడి ముందు కూర్చొని ఏవో రెండు స్తోత్రాలు ఆవేశంగా వల్లించాక, మళ్లీ నీరసం ఆవరించినట్టు అనిపించింది.
లేచి కుర్చీలో కూర్చుని, ముఖాన సన్నగా పట్టిన చెమటని తుడుచుకుని,
ఓ అరడజను అరటిపళ్ళు తినేశారు.
సమయం సరిగ్గా పదకొండు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లేచి, నిన్న కడిగిన తుంగ చాపను నేలపై పరిచి, టీవీకి ఎదురుగా నడుం వాల్చారు.
చానళ్లన్నీ ఒకసారి మార్చి మార్చి ఈ రోజు సింక్ అయ్యే
కార్యక్రమాన్ని వోదాన్ని చూస్తూ విశ్రమించసాగారు.
సమయం ఒకటిన్నర.
భోజనం చేసే సమయం దాటిపోయింది. శరీరమంతా భారం గా అనిపించసాగింది రావు గారికి.
కుడిచెయ్యి లాగుతున్నట్లు, కుడి కాలు తిమ్మిరి ఎక్కినట్లు, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపించి, ఉడికించిన కందగడ్డల్లోంచి
ముప్పావు భాగాన్ని చెక్కర అద్దుకొని లాగించేశారు.
ఓ చెంబుడు నీళ్ళు గటగటా తాగేసి, బయట వరండాలో పచార్లు చేశారు.
కాలి నొప్పి కొంత తగ్గినట్లు అనిపించింది. కానీ మంద్రంగా తలనొప్పి ప్రారంభమైంది.
ఓ గ్లాసుడు కాఫీ తాగి కుర్చీలో జారగిలపడ్డారు రావు గారు.
మధ్యాహ్నం మూడు గంటలకు తెచ్చిన అంగూర్లు సంత్రాలు ఖాళీ చేశాక కూడా,
ఇంకా నీరసంగానే ఉంది.
ఒక్క రోజు అన్నం తినకపోతే
ఇంత నీరసం వచ్చేస్తుందని సంవత్సరానికొకసారే గుర్తిస్తాడతడు.
అయిదింటికల్లా మక్క గారెలు, పూరీలు, బజ్జీలు వాసన వచ్చేస్తుంది.
భార్యాదేవి సాయంత్రానికి ఫలహార ఏర్పాట్లు చేసింది.
రావు గారు ముఖం కాళ్ళు కడుక్కొని పీట మీద కూర్చున్నారు.
భార్య ప్రేమతో కొసరికొసరి వడ్డించింది పిండి వంటల్ని.
పొద్దున్నుంచి ఏమీ తినక పోవడం వల్ల రావు గారు ఆబగా మిరపకాయ బజ్జీ ని ఒక బుక్కలో, పూరీని మడిచి ఒకేసారి నోట్లో నమలసాగాడు.
ఫలహార భక్షణం అయిన పిదప
రాత్రి పదింటి వరకు ఏవో పిచ్చి ప్రోగ్రాములు చూసీ, చూసీ,
పొద్దుటి నుండి అన్నం తినకపోవడం వల్ల కునుకు రాసాగింది.
భార్యాదేవి మందలింపులూ, దేవుడి మీద భయం వల్ల ఎలాగోలా పన్నెండు
గంటల వరకు నిద్రను ఆపుకొని
జాగారం చేశారు రావు గారు.
పన్నెండు గంటల ఒక నిమిషానికి అలసి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు.
మొత్తానికి దిగ్విజయంగా శివరాత్రి ఉపవాస దీక్ష చేసిన రావు గారు మళ్లీ సంవత్సరం దాకా ఉపవాసం నుండి ఉపశమనం పొందారు.

 

Also Read : సినిమా పాటను వివరిస్తూ నీతి కథ

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!