అన్వేషణ
నేనో పద్యాన్ని నిదురలో నింపుకొని పడుకుంటాను
తొలకరి చినుకుల్లో వొణుకుతున్న పెదాలతో నిదురలోనే పద్యం పాడుకుంటాను.
కొత్తగా కనుక్కున్న పదాల్ని
విస్తృత మానవ సమూహాల హృదయగాయాల మీద
మలాములా పూస్తాను.
మేఘాల్ని కప్పుకొని నిలబడ్డ అద్భుతమైన ఆకాశం గురించి,
రంగులై తిరుగుతున్న ఆలోచనల సీతాకోకచిలుకల గురించి కలలు కంటాను.
ఏ ప్రార్థన లోనూ విడిపోవని సమస్యల చిక్కుముడుల గురించి కలవర పడతాను.
కొన్ని బంధాల్ని చుట్టూ బంధనాలుగా చుట్టుకుని
కొన్ని గేయాలుగా మారిన దుఃఖాల్ని పాడుతూ
శ్రమ దేహపు నాడుల్ని మీటుతాను
పెనవేసుకున్న చలిని నిమురుతూ జాగ్రత్తగా
కొత్త వెన్నెల చల్లదనం నుంచి గుండెల్ని,
గుండెల నిండా నింపుకున్న ప్రేమల్ని దాటి
కొంచెం కొంచెం అస్పష్టమై అదృశ్యంగా తిరుగుతుంటాను.
వెరసి,
నేను సైతం
నిద్దురకూ, మెలుకువకూ మధ్య మిగిలిన అగాధంలో వెలుతురుకై అన్వేషిస్తుంటాను.
Also Read : నేను సైతం
