బతుకు భ్రమణం
ప్రతీ గెలుపు, ఓటములన్నింటిని సమాధి
ప్రతీ ఓటమి గెలుపులన్నిటికీ పునాది
గెలుపోటములు దైవాధీనాలు, విధి వశాలు
కదిలే కాలపు మాయా జాలపు నీడలు!
గెలుపు ఆనందంతో బాటు, ఆత్మవిశ్వాసాన్ని
పెంపొందించేలా ఉండాలి,
ఓటమి విషాదాన్ని మిగిల్చినా, ఆత్మ పరిశీలనకు
అవకాశమిచ్చి, తప్పులు తెలుసుకొనే
మనోధైర్యాన్ని ఇవ్వాలి
గెలుపోటములు కావు శాశ్వతాలు
వాటిని పొందే దిశలో
నీ పట్టుదల, కృషి ప్రామాణికాలు
గెలిచిన ప్రతీ వ్యక్తి గాధలో,ఎన్నో ఉంటాయి
ఓడిన క్షణాలు, కోల్పోయిన గతాలు
పోగొట్టుకున్న ఆనందాలు, ఆహ్లాదాలు
అనుభవించిన ప్రతికూల పరిస్థితులు
ఓటమి విసిరిన చీకట్ల కు వెరవక , మొక్కవోని ధైర్యంతో
గెలుపు వెలుగుల కాంతులు చేరు ప్రయాణమే జీవితం
పగలు, రాత్రుల వెంట అలుపెరగక తిరిగేది కాల గమనం
ఓటమి,గెలుపుల మధ్య అలసిపోయేది బతుకు భ్రమణం
Also Read : చదరంగం