మన తెలుగు
భాషలందున వెలుగు
తేనెలొలుకెడు తెలుగు,
అచ్చులును హల్లులును
ఆత్మీయ మైత్రితో అర్థవైచిత్రితో
వెలకట్టలేనట్టి తలకట్టు ఠీవితో
గుడులతో,ముడులతో,గుండ్రనౌ రూపుతో,
ఏత్వాలు,ఓత్వాలు ఐత్వాలు,ఔత్వాలు
ఒత్తులతొ,పొత్తులతొ ఒంపుసొంపుల తోడ
పెనవేసుకొని కలిసి కొనసాగుచున్నట్టి
బిందు యుక్తమ్మైన సింధువంతటి భాష,
సొగసైన భాషరా మనదైన తెలుగురా
వాగర్థముల తోడ రాగాల సడితోడ
రసములూ రెడుభాష,పసయున్న పదకోశ,
కనులకు పసందైన,వీనులకు విందైన
పిలుచుటకు, పలుకుటకు,
వలచుటకు, వగయుటకు,
వినతులకు, ప్రణతులకు,
పాటలకు, ఆటలకు,
పద్య గద్యములకు,పదునైన కవితలకు,
ఇందుకందులకను సందియమ్మే లేక
ఎందెందులకునైన పొందికగు భాషరా
ఘనమైన భాషరా,
మన తెలుగు భాషరా
Also Read : కస్తూరీ తిలకం