Poem : అలౌకిక మహా విభూతి
అలౌకిక మహా విభూతి
అలౌకిక మహా విభూతి
ధాతవు నీవు గా కవితా మకరందం అందజేయగా
ద్యోతము నీవుగా సంతోష పరంపరలు పొందగా
వ్రాతలు నావిగా భవద్విభవ భారతిని లిఖింపగా
చేతల యందు నీ చిత్కళలను వర్ణింప గా!
ఉపనిషత్తు కాలంలో ఉద్భవించిన
సత్యం, శివం, సుందర మనే ప్రేమ పవనాలు
ఒకే ఒక్క మహితాత్మునిలో కేంద్రీకృతమైన ఆధ్యాత్మిక చిహ్నాలు
మానవత్వం లో దివ్యత్వాన్ని ప్రకాశింప చేసేందుకు అవతరించిన తత్త్వవేత్తవు నీవు
బంధములెపుడు మదిని బంధనజేయునని బోధించిన జగద్గురువు నీవు!
గీతాయోగ సంద్రమైన నీ రసమహా గంభీర సద్భావములు..
అతిసౌందర్య మనోజ్ఞ సంధ్యయైన నీ జగన్నాటక విన్యాసములు..
యతులే కవ్వములై నీ మహిమలు చిల్కగా..
తత్సద్భావ సౌరభ్య భాసితమౌ నవ్య వేదాంత సారమందగా!
విశ్వజనీనమైన గీతామృతం
మానవజీవన అంతర్గర్భితమైయున్న దివ్యత్వ తత్త్వం
స్థితప్రజ్ఞత ను పెంపొందించే సందేశాత్మక ఆంతర్యం
భ్రాంతిధ్వాంత నివృత్త భక్త హృదయ ప్రాంతాధినాధ
వృత్తాంతాంత నితాంత శాంత,
మత్చిత్తావాసిత సంస్కృతామృతచిత్సౌందర్య సరోజం !
Also Read : సత్యం శివం సుందరం