నిలదీసే నిరసన గళమవుతా
ఆసహాయుల కడగండ్లను చూసి
అణుమాత్రం జాలి చూపకుండా,
స్వార్ధపు పొరల కింద మానవత్వం
మసకబారిపోతోంది
మనీ తత్త్వపు మాయా మోహంలో,
ఆత్మీయతలు, అనుబంధాలు ఆవిరవుతున్నాయి
నా బతుకు నే బతికేస్తున్నానని, నాకేంటి,
ఎవరేమయి పోతే నాకెందుకులే అని
బతికేద్దాం అనుకుంటే నేను మనిషి అని
చెప్పుకొనే నైతికత మిగులుతుందా?
మనం నిత్యం చూసే సమాజము లో
దురాగతాలను,దుర్నీతులను, దుర్మార్గాలను
చూస్తూ, ఏమీ పట్టనట్టు మౌనం దాల్చితే
మనిషి జన్మకు అర్ధమెక్కడుంది
అందుకే నేనుసైతం, జరిగే అన్యాయాలను,దోపిడీలను
నిలదీసే గొంతుకనవుతా దహించే నిప్పు కణమవుతా
మార్పు తెచ్చే పోరు బాటలో, నేను సైతం అడుగులేస్తా
నా వంతు పాత్రను, న్యాయంగా బాధ్యతగా మోస్తా
సమాజ వింత పోకడను ప్రశ్నించే అక్షరమవుతా
నా అక్షర వెలుగులతో, నిర్లిప్త నీశీధులను రూపు మాపుతా
అసహయుల కన్నీళ్ళ ను తుడిచే ఆపన్న హస్తమవుతా
మమతను పంచే, పెంచే మంచి మనసునవుతా
అమానుషాలను, అరాచకాలను నిలదీసే నిరసన గళమవుతా
మారని సమాజంలో,మనల్ని మనం మార్చుకుంటూ,
నేను సైతం మార్పుకోసం పోరు చేసాననే ఆత్మ తృప్తిని పొందుదాం
Also Read : నినాదమవుతాను