స్వర్గసీమ
పంచభూతాలతో, పచ్చని పొలాలతో,
పసిడి రాశులతో పదహారణాల పల్లె పడుచువోలె
పరిఢవిల్లునట్టి పుణ్యభూమి నా మాతృభూమి
సంస్కృతాంధ్రముల సమతూకముల తూచు
భాషలందు మేటి కవులను గన్న ఘనచరిత గలిగిన
సాటిలేని మేటి నా సాహితీ ధరిత్రి
చిత్రకారుల కుంచెలతో, శిల్పకళా చాతుర్యములతో
చరిత్రలో మరువలేని చిత్ర, కట్టడ రూపాలు గల
అద్వితీయ కళాఖండము నా జన్మభూమి
పట్టువదలని పలనాటి పౌరుషాలు
అలుపు ఎరుగని పోరాటపటిమలు
ఉగ్గుతోడ వచ్చిన వీరుల కన్న వీరభూమి
తెల్లదొరలు వచ్చి తనువంత దోచినా
తల్లడిల్లక త్యాగధనులకు జన్మనిచ్చి
శృంఖలాల ఛేదించుకున్న స్వేచ్ఛాజీవి
సప్తసముద్రాలు దాటి ఎగిరిపోయినా
గగనతలాన కెగసి గ్రహాల వసియించినా
మరువబోకుమెపుడు పుట్టినగడ్డను
కన్నతల్లి ఋణము తీర్చగలదు తలకొరివి
కన్నభూమిని కాచు సైనికుడవై నీవు
కదలినప్పుడె ధన్యమగును నీదు జన్మ
మనకు ఉనికినిచ్చు మాతృభూమి కన్న
స్వర్గసీమ లేదు ఎంతయు వెదకి చూడ
అక్కడ విడచినంత ఆఖరిశ్వాస
ఆత్మశాంతి కలుగు నదియె నిజము
Also Read : అమ్మ నీ రూపము