కొత్త గీతం
ఎందుకోయ్ రోజు
ఎదో చేయాలనుకుంటావ్
విచిత్రంగా పగటి కలలు కంటూ
కొత్తగా ఎదో చేయాలనుకుంటావ్
ఆకాశానికి నిచ్చెనలు వేయాలని
మేఘాలను గొడుగులా చేసుకోవాలని
తూర్పు వాకిట్లో పూసిన ఎర్రగులాబీ పువ్వును
కోసి ప్రేయసి తలలో పెట్టాలని
నక్షత్రాలన్నీ ఏరుకొచ్చి మాలగా కట్టి మేడలో వేయాలని
వింతగా ఆలోచనలు అల్లుకుంటూ
ఎందుకలా అనుకుంటూ ఉంటావ్ ?
ఆ వెన్నెలతో ఆడిపాడాలని
ప్రకృతితో కలిసి ఊయల ఊగాలని
సముద్రపు నీళ్ళన్నీ కలంలో వొంపుకొని
కవితలు రాయాలని,కమ్మని కావ్యం చేయాలని.
అలా ఎప్పుడూ ఏదో చేయాలనుకుంటావ్
మిత్రమా ఎందుకని?
అప్పుడప్పుడు
పడమరై వెలుతున్న
నీ ఆలోచనలను ఆపాలని అనుకోవా?
తూర్పై ఎదురు పడుతున్న
సమస్యలక్షరాలను మార్చాలనుకోవడం లేదా?
ఎప్పటికీ మిగిలిపోయె ఎర్రని పాటని
చేగువేరా చుట్టపొగల వరుసలతో పద్యాన్ని
చైతన్యపు గీతాన్ని
కలం గళమెత్తి మానవత్వపు
పాటని పాడాలని అనుకోవడం లేదా?
అందరూ సమంగా పంచుకునే ఆహారపు కవితను
గుండె తడిని తెలిపే కన్నీటి గేయాన్ని
ఎందుకు రాయకూడదు.
Also Read : పద్యం