Naa Bhasha : నా భాష
నా భాష
నా అమ్మే తెలుగు భాష
కన్నతల్లి కడుపులో ఉమ్మనీరు తాగుతూ
కమ్మనైన అమ్మ మాటలు వింటిని
నేల మీద చేరి కెవ్వున కేక వేసి
వచ్చీరాని మాటలతో సందడే చేసిన
ముద్దు ముద్దు మాటలతో ఇల్లంతా తిరిగిన
అమ్మ నేర్పిన మాటలతో అల్లరే చేసినా
బుడిబుడి నడకలతో తీయ్యటి మాటలే పలికినా
బుల్లి బుల్లి పదాలతో అత్తా అమ్మ అని పిలిచినా
అమ్మ జోల పాటలో కమ్మగా నిద్రపోయిన
మధుర గానముతో మై మరిచిపోయిన
ఉయ్యాల ఊగుతూ చక్కనైన పాటలు విన్నా
అమ్మ పెదవుల సప్పిడి తెలుగు భాష ఔన్నత్యమే
వెన్నెల ముంగిట్లో గోరుముద్దలు తిన్నా
రాని చందమామను తెలుగు పాటల్లో విన్నా
శ్రావ్యమైన గొంతులో మాధుర్యం రుచి చూచినా
తేనెలాంటి పలుకులతో నిండుగా ఆరగించినా
గాఢనిద్రలో ఉలిక్కిపడి నేను లేచినా
అమ్మ గుండెను హత్తుకొని శబ్దం విన్నా
ఆ స్పర్శ ఆ గుండె మాటే నన్ను ఓదార్చే
కన్నతల్లి పేగుబంధపు మాటలెన్నో విన్నాను..
అందరికీ అమ్మ ప్రేమ పంచెను మాతృభాష
మమతానురాగాలు కలిగెను మాతృభూమి
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెప్పే నాతెలుగు
నా జీవితానికి తెలుగే నా వసంతాల వెలుగు
Also Read : కలం – గళం