My Favorite Telugu Book Review : డా. సి నారాయణ రెడ్డి – “మందార మకరందాలు”

నాకు నచ్చిన తెలుగు పుస్తకపు సమీక్ష

నాకు నచ్చిన పుస్తకం (My Favorite Telugu Book Review ) – డా. సి నారాయణ రెడ్డి గారి “మందార మకరందాలు.”

పోతన గారి పద్యాలంటే,వారి భాగవతం ఇష్టం. ఆ భాగవతంలోని కొన్ని పద్యాలకు కమనీయమైన వ్యాఖ్యానాన్ని అందించిన ఈ పుస్తకం భాగవతం పై నా ఇష్టాన్ని మరింతగా పెంచింది.

భాగవతం పూర్వపరాలు

భాగవతము భక్త జ్ఞానవైరాగ్యములను వెల్లడించు ఉత్తమ గ్రంథములలో తలమానికమైనది. దీనిని మొట్ట మొదట శ్రీ మన్నారాయణుడు జలశాయిగనున్నతరి తన నాభి పంకజమందు జనించిన బ్రహ్మకు, బ్రహ్మ దానిని కొంత విస్తృత పరచి తన మానస పుత్రుడగు నారదునికి ఉపదేశించెను.

నారదుడు వ్యాసునకు వినిపించుట

సరస్వతీ తరంగిణీ సమీపన కూర్చుండి వేదములు అందరకూ గ్రాహ్యంబు కావు గనక,ప్రపంచోపయోగము కొరకు భారతమును వేదార్థభావమునంతయును సంగ్రయించి వ్రాసినను,పురాణాలు విరచించిననూ,బ్రహ్మ సూత్రాలను ప్రవచించిననూ హరిభక్తులకు అభిలషితార్థముగల భాగవతాన్ని రచింపనైతిని గదా అని నా మనస్సు సంతసింపకున్నదను తలంపుతో వ్వాకులత పడుతున్న వ్వాసుని మనోగతాన్ని గ్రహించి, నారదుడు,సమస్త ధర్మాలను వివరిస్తూ భారతము వ్రాసినను భగవద్గుణ విశేషములను పేర్కొనవైతివి.హరిస్తుతి లేని గ్రంథము సర్వగుణసంపన్నమయ్యు అది ఫలమునీయదు.అని తాను బ్రహవలన వినిన భాగవత కథాదికమును వ్వాసునికి నివేదించెను.

భాగవత విశిష్టత

సంస్కృత భాగవతము తత్వరహస్య గర్భితము,ప్రౌఢభాషాబంధురము అన్వయకాఠిన్యము అగుటచే సంస్కృత విద్వాంసులకే గాని సామాన్యులకు,అందునా సంస్కృత భాషాజ్ఞానం లేని వారికి అవగతం కాదు.

తెలుగువారి అదృష్టమో,వారిపూర్వజన్మ సుకృతమో గాని లోకోత్తరమగు శ్రీమమద్భాగతమును సహజపాండిత్యశోభితుడు,మృదు మధుర కవితావిరాజితుడు,శ్రీ రామభక్తుడునగు శ్రీ బమ్మెర పోతనామాత్యుడు సలలితముగ,భక్తి రసాత్మకంగా తెలిగించి తెలుగుప్రజల ఆదరాభిమానాలకు పాత్రుడైనాడు.

పోతన గురించి క్లుప్తంగా తెలిసి కొందాం.

పోతనామాత్యుడు

ఇతను ఇంచుమించు 15 శతాబ్దానికి చెందిన వాడుగా పెద్దలు అభిప్రాయంగా కనబడుతుంది.ఇతనిది నేటి జనగామ జిల్లా లోని బమ్మెర గ్రామం.ఈయన నియోగి బ్రాహ్మణుడు, కౌండిన్యస గోత్రుడు. తండ్రి కేసన మంత్రి, తల్లి లక్కమాంబ.ఇతని అన్న తిప్పన.ఇతని గురువు ఇవటూరి సోమనాథుడు.

ఇతని ఇతర రచనలు

1) వీరభధ్రవిజయము
2)భోగనీదండకము
3) నారాయణ శతకము

పోతన కవిత్వంలో భక్తి, మాధుర్యం, తెలుగుతనం, పాండిత్యం, వినయం కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది అతిశయోక్తి కాదు.పోతన గారి గురించి నాదైన పద్యం లో ఇలా చెప్పవచ్చు.

శ్రీ పోతనామాత్యుడు.

“ముక్తిని బొందగోరెడు ముముక్షువు లందరి మేలుగోరుచున్
భక్తి రసాత్మ కంబయిన భాగవతంబును తెన్గు జేసి స
ద్భక్తుడు పోతరాజు పదబంధము లన్ మకరందమద్ది సు
వ్యక్తము జేసె శ్రీహరిని భక్త జనావళి ప్రస్తుతింపగా !!!”

భాగవతం అనగానే ఎన్నెన్నో భక్తిప్రపూరితమైన గాథలు గుర్తుకు వస్తాయి.గజేంద్రమోక్షం,ప్రహ్లాద చరిత్ర,వామనచరిత్ర,అంబరీషోపాఖ్యానము,అజమిళోపాఖ్యానము,నరకాసురసంహారము,రుక్మిణీ కల్యాణం.వీటన్నింటికీ ఒకే ఒక మూలసూత్రం వాసుదేవతత్వం.

ఈ పోతనామాత్యుని భాగవతం లోని పద్యాలన్ని భక్తిరసప్రపూరితములే .అన్ని మకరందసమ్మిళిత పద బంధ సముచ్ఛాయాలే.అంత్యప్రాసలతో పాఠకుల హృదయాలు దోచుకునేవే.ఈ భాగవతంలోని కొన్ని ప్రసిద్ధమైన ,భక్తిరసప్లావితమైన పద్యాలను ఏఱి తన దైన మనోహరమైన శైలిలో వాటిని విశ్లేషిస్తూ పాఠకులకు ఈ “మందార మకరందాలు” (My Favorite Telugu Book Review) అన్న పుస్తాకాన్ని అంద జేసి భాగవతం పై మక్కువను కలిగేట్లు చేసారు డా.సి నారాయణ రెడ్డి గారు.

“మందార మకరందాలు”

పుస్తకాన్ని (My Favorite Telugu Book Review) మొదట ‘యువభారతి’ సాహితీ సాంస్కృతిక సంస్థ హైదరాబాదు వారు అక్టోబర్ 1973 లో ప్రచురించారు.
డా. జి.వి.సుబ్రహ్మణ్యం సౌరభం అనే పీఠిక ద్వారా వెలబడి అనతికాలంలోనే పాఠకుల హృదయాలను దోచుకొంది.
మరల ఇదే పుస్తకం సాహిత్య ప్రేమికుడైన తెలంగాణ ముఖ్య మంత్రి గౌ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సందేశం తో తెలంగాణ సాహిత్య అకాడమి వారు ప్రపంచ తెలుగు మహాసభల సందర్బాన్ని పురస్కరించుకొని 2017 ప్రచురించారు.

ఈ పుస్తకం మరొకసారి విశేషప్రజాదరణ పొందింది.ఈపుస్తకం లోకి వెళ్ళేముందు ఇటీవల వరకు మనలోనే ఉండి అనేకానేక రచనలు చేసి తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకొన్న జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన డా. నారాయణ రెడ్డి గారిని గురించి కొంత తెలుసుకొందాం.

డా. సి నారాయణ రెడ్డి- గురించి సంక్షిప్తంగా

తెలుగు సాహిత్య వినీలాకాశంలో నవ్యకవితా వెలుగులను చిందించిన కవీంద్రుడు డా.నారాయణరెడ్డి గారు.ఇటీవల వరకు మన మధ్యనే ఉండి ,మన తెలుగు నేలపై నడయాడిన నవ్యగేయ మహాకవి.అచ్చమైన పల్లీయవాతావరణానికి ఆదర్శప్రాయమైన హనుమాజిపేటలో(ప్రస్తుతం ఇది రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉంది) శ్రీ మతి బుచ్చమ్మ, మల్లారెడ్డి దంపతులకు తేది 29 వ జులై 1931 నాడు జన్మించారు డా. నారాయణ రెడ్డిగారు.

వారు క్రమ కమం గా మొలకై,చిగురై,మొగ్గై విరబూసిన సౌగంధికా ప్రసూనమై కవితా పరీమళాలను, రసమధురిమలను తెలుగు నేల నాలుగు చెరుగులా పంచి , తెలుగు భాషా సౌరభాలను విశ్వవ్యాప్తంజేసిన విశ్వంబరుడు డా. నారాయణ రెడ్డి గారు.

దాశరథి గారి మాటల్లో ఆయన గారి కవిత్వం ఇలా ఉంటుంది.

పాలసంద్రం పొంగి నింగినంటినట్లు,
పండు వెన్నల నింగిని దిగి నేల వాలినట్లు”

నారాయణ రెడ్డి గారు ఒక వర్షించే మేఘం,గలగలా పారే జలపాతం, వికసించిన వసంతం, గళమెత్తే కోయిల,పురివిప్పే మయూరం, భాసించే సూర్యుడు, వెన్నలొలికించే చంద్రుడు..ఇన్ని అంశాలనుకలబోసి, అందులో కవితాంశాలను కలిపి భావాలను,శబ్దాలను చేర్చి కంప్యూటర్ కు ఇస్తే అది అందులో ప్రాణంపోసి ఒక నారాయణ రెడ్డి ని అందిస్తుంది.కవిత్వం లోనూ,జీవితంలోనూ మానవతను, చైతన్యాన్ని ,రసహృదయాన్ని పండించుకొన్న సాహితీమూర్తి .కవికుల తిలకుడు.ఆధునికాంధ్ర సాహిత్యంలో విభిన్నాంశాలకు సమన్వయం సాధించిన సాహిత్య శిఖరం.శ్రావ్యగళంతో రసహృదయాలను ఉర్రూతలూగించిన శబ్దరసధ్వని మర్మజ్ఞుడు.

డా.నారాయణ రెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి.ఆయన అనేకానేక పదవులను సమర్ధవంతంగా నిర్వహించి వాటికి వన్నెలద్దారు.ఆచార్య పదవి మొదలుకొని అధికార భాషాసంఘ అధ్యక్షుడు వరకు పలు పదవులను నిర్వహించారు.రాజ్యసభ సభ్యునిగా రాజసాన్నొలికించారు.

అయన ఎన్నో సాహిత్య సభలకు అధ్యక్షత వహించి ,విశిష్ట అతిథి గా పాల్గొని అత్యద్భుతమైన, అమృతోపమానమైన వ్యాఖ్యానాలు,ఉపన్యాసాలు చేసి రసహృదయాలను ఆనందడోలిల్లో ముంచెత్తిన మహా మనీషి.

సాహిత్య ప్రపంచంలో విభిన్న ప్రక్రియలను చేపట్టి నవ్వని పువ్వు నుండి నాగార్జునసాగరం వరకు కర్పూరవసంతరాయలు నుండి విశ్వంభర వరకు ఎన్నో పుస్తకాలు వ్రాసి సాహిత్య అకాడమీ పురస్కారాలనుండి జ్ఞానపీఠ్ అవార్డుల వరకు ఎన్నెన్నో పురస్కారాలను పొందిన తెలుగు వారి ముద్దు బిడ్డ నారాయణ రెడ్డి గారు.

మందారమకరందాలు – ఇక ఈపుస్తకంలోకి (My Favorite Telugu Book Review) వెళదాం

శ్రీ మదాంద్రమహా భాగవతం లోని మొదటి పద్యాన్నే వీరు ఈ పుస్తకంలో మొదట ప్రస్తావించారు.

“శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.”

మహానందాంగనా డింభకుడైన భాగవతనాయకున్ని ఆశిస్తున్నది లౌకికమైన సంపదలు కావు ఇంద్రియ విముక్తమైన కైవల్యాన్ని.ముముక్షువుల అందరి అంతిమలక్ష్యం కైవల్యమేకదా.డింభకుణ్ణి మనస్సులో అనుకొని, పద్యాన్ని ఆరంభకున్ తో ఆరంభించి
“సంరంభకున్” “స్తంభకున్” “కుంభకున్” అంటూ సమాసాంతంలో అంత్యప్రాసలు కూర్చి పద్యాన్ని అజరామరం చేసారని,బిందుపూర్వక “భ” కారాన్ని పునరుక్తం చేసి మహత్తరమైన నాదాన్ని పూరించి నాడని సినారె అంటూ ,పదం ,అర్థం పొందిన మధుర సమ్మేళనం ఈ పద్యం అని పేర్కొన్నారు.

“వేదకల్పవృక్షవిగళితమై, శుక
ముఖసుధాద్రవమున మొనసి యున్న,
భాగవతపురాణఫలరసాస్వాదన
పదవిఁ గనుఁడు రసికభావవిదులు.”

భాగవత పురాణం ఎలా అవతరించిందో, ఎలా వ్యాపించిందో సుమధుర రూపకంగా పొదిగి చూపిన పద్యమిది.ఈ పద్యంలో శుకముఖం అనే సమాసాన్ని ఉపయోగించి,శుకయోగితో పాటు చిలుక తళుకులొలకడం అనే సరి కొత్తరుచులను చిలికించి భాగవత మూలశ్లోక ఫలాన్ని పరమ విధేయంగా తెలుగువారికందించారని అంటారు సినారె.

“మందార మకరంద మాధుర్యమునఁ దేలు-
  మధుపంబు వోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు-
  రాయంచ సనునె తరంగిణులకు?
లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు-
  కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురితచకోరక-
  మరుగునే సాంద్ర నీహారములకు?

అంబుజోదర దివ్యపాదారవింద
చింతనామృతపానవిశేషమత్త
చిత్త మేరీతి నితరంబుఁ జేరనేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?”

ఒక విషయాన్ని తీసుకొని అలంకార బలంతో వాక్య నిర్మాణ కౌశలంతో నొక్కి,నొక్కి చెప్పడం పోతన్నకు ఒంటపట్డిన గుణం.
ఈ పద్యం పాల్కురికి సోమన్న పద్య ప్రభావంతో పుట్టినా, ఈ పద్యం పొందిన ప్రచారం అద్భుతం.పోతన రచనా శక్తికి నిలువుటద్దంగా నిలిచింది.
ఇంతటి వశీకరణశక్తికి మూలకారణం మధురాక్షరాల సమ్మేళనమే.

మందార,మకరంద,మాధూర్య, మధుర, మదనములు.ఒక్క పాదంలోనే ఇన్ని మకారాల గుబాళింపు అని అంటారు.
ఈ కోవకు చెందిన పద్యాలు ఎన్నెన్నో ఉన్నాయి భాగవతంలో.

ఉదాహరణకు..

“కమలాక్షు నర్చించు కరములు కరములు”

“కంజాక్షునకుగాని కాయంబుకాయమే

“సంసార జీమూత సంఘంబు విచ్చునే”..

“చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.”

శివుని పూజించడం,హరిని కీర్తించడం, దయను సత్యాన్ని దర్మాలుగా భావించడం జన్మసాఫల్యానికి సాధనాలని పోతన విశ్వాసం.వ్యర్థున్ని ఈసడించడానికి వాడు తల్లి కడుపున చెడపుట్టినాడని, నేటికీ మనం వాడుతుంటాం.”కడుపు చేటు” అన్న నుడికారం పాఠకులగుండెల్లో సూటిగా దూసుకబోయే రామబాణం అని అంటారు మన సినారె.

“ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో
లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ
న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ
పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై.”

సూర్యుడొక్కడు,జీవులు పెక్కురు.భగవంతుడు ఒక్కడే,అతన్ని భావించే హృదయాలు అనేకం.సూర్యుడు కనిపించడం స్థూలదృష్టి, భగవంతుడు భాసించడం సూక్ష్మదృష్టి.తాత్విక విషయాన్ని అరటిపండొలచి నట్టుగా చెప్పాడని సినారె చెబుతారు.

“త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.”

భీష్ముని హృదయంలో చిత్రితమైన శ్రీ కృష్ణుని చిత్రమిది.ఈ పద్యానికి వన్నెతెచ్చిన ప్రయోగం ” వన్నెకాడు” అన్న తెలుగుపదం.”త్రిజగన్మోహన నీలకాంతి”,”ప్రాభాత నీరజబంధుప్రభము” “నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబు” వంటి సులలిత సంస్కృత సమాసాలతో తరగెత్తిన పద్యం లో “వన్నె కాడు” అన్న చిన్నిమాటను తేటగా పైకితేలిన నురుగు పువ్వుగా భావిస్తారు సినారె.

“ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు; సర్వముఁ దానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్.”

సర్వేశ్వరుని మూల తత్వం ఈ పద్యంలో ఎన్నో దళాలతో విప్పారింది.ఇందులోని “ఎవ్వడు” అవ్యక్తుడు. అవ్యక్తరూపున్ని వ్యక్తపరచడానికి ఎవ్వడు అనే మాట ఎన్నో విభక్తులతో రూపుదిద్దుకుంది. అదే ఈపద్యం లోని విశిష్టత.

“కలడందురుదీనులయెడ
కలడందురుపరమయోగిగణములపాలన్
కలడందురన్నిదిశలను
కలడుకలండనెడువాడుకలడోలేడో”

ఒక్క గజేంద్రుడే కాదు.ఈలోకంలో కోటానుకోట్ల మంది అప్పుడూ,ఇప్పుడూ ఈపెనుగులాటతోనే సతమతమౌతున్నారు పరమాత్మ అస్థిత్వాన్ని నిరాకరించలేక నిశ్చయించలేక.
పరమ గంభీరమైన ఈ బ్రహ్మ జిజ్ఞాసను చిన్నచిన్న మాటలలో ఎత్తిచూపి పామరులకు కూడా పరమాత్మ తత్వాన్ని అందజేసాడని పోతన్నను కీర్తిస్తారు సినారె.

“లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ డస్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంరక్షింపు భద్రాత్మకా!”

భగవదనుగ్రహానికి శరణాగతి తప్ప మరొక మార్గంలేదని నిశ్చయించుకుని పరమాత్మ సాక్షాత్కారం పొందాడు మొసలి కోరలవంటి భవ బంధాలనుండి విముక్తుడైనాడు గజేంద్రుడు.

ఈ పద్యం కూడా తెలుగు ప్రజలు అనేక సందర్భాలలో వాడుకుంటున్నదే.

“అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము “పాహిపాహి” యనఁ గుయ్యాలించి సంరంభియై.”

గజేంద్రుడు మొరపెట్టుకునే సమయంలో ఆ దేవదేవుడు ఏ స్థితిలో ఉన్నాడో వర్ణించడం ఈ పద్యం లోని చిత్రం. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ మహావిష్ణువు ఆ సమయాన రమాసాంగత్యములో తేలియాడుతున్నాడు.మూడు ముక్కల్లో చెప్పక రసకేళీ పరవశుడైన ఆ మాధవుని స్థితికి ఒక చలనచిత్రాన్ని రూపొందించాడు.అలవైకుంఠపురము,ఆపురంలో అంతఃపురం,అందులో ప్రధానసౌధం.సమీపంలో అమృతసరోవరం.అక్కడ చంద్రకాంత వేదికపై కలువల పాన్పు,ఆపాన్పుపై క్రీడిస్తున్న నారాయణుడు. ఇదీ పోతనగారి చిత్రతోరణం.ఎక్కడో గజేంద్రుడు ఆక్రందిస్తుంటే ఇక్కడ రసపారవశ్యంలో ఉన్న స్వామి సంరంభించడం సామాన్యమైన విషయం కాదు.జీవాత్మ పరమాత్మల మధ్యనున్న అంతులేని అఘాతాన్ని,అపార వ్యత్యాసాన్ని ఎంతో మెలకువతో చిత్రించాడు.ఆర్తుని మొరవిని ఒక్కమాటలో చిత్రించాడు పోతన. అదే ‘ఆపన్న ప్రసన్నుండు’ అనేది.గజేంద్రుని కరుణావస్థకు, ఉపేంద్రుని శృంగార స్థితికి ఆర్తి ఒక సేతువైంది. ఈపద్యం లోని కొసమెరుపు ఇదే అంటాడు వ్యాఖ్యాత.

“సిరికిం జెప్పఁడు; శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపఁ; డే
పరివారంబునుఁ జీరఁ; డభ్రగపతిం బన్నింపఁ; డాకర్ణికాం
తర ధమ్మిల్లముఁ జక్క నొత్తఁడు; వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.”

శిష్ట రక్షణ లో ఏదీ లెక్కించలేదు.సిరితో చెప్ప లేదు గరుడినికి చెప్పలేదు, సమరసామాగ్రిని సమకూర్చు కోలేదు.భక్తపోషణకు పరివారం అవసరమేముంది.ఆవిశ్వపతికి ఇవేవి పట్టలేదు. కాని ఆయనచేతిలోఉన్న చేలచెరగు మాటేమిటి? ఇదేమిటి అడిగితే వినేస్థితిలో లేడుకదా..అదే ఆర్తత్రాయణ పరాయణత్వం.

“అడిగెద నని కడువడిఁ జను;
నడిగినఁ దను మగుడ నుడుగఁ డని నడ యుడుగున్;
వెడవెడ సిడిముడి తడఁబడ
నడు గిడు; నడుగిడదు జడిమ నడు గిడునెడలన్.”

“అడగాలా వద్దా” అనే తడబాటును సూచించే పద్యమిది. ఇందులో అన్నీ లఘువులే.ఒకే అక్షరాన్ని తిరిగి తిరిగి ప్రయోగించి ఉద్దిష్ట భావానికి ఊతసాధించడం ఈ పద్యంలో పోతన చేసిన గారడీ తనమంటారు.

వామనుడు..

” ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై
నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై!”

“రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై
ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్.”

ఒకే పాదులో పుట్టినవి ఈ రెండు పద్యాలు. ఈ రెండిటిలో వామనుని విశ్వరూపమే వర్ణించబడింది.

మొదటి పద్యం లో గగన వీధినుండి సత్య లోకం దాకా వామనుడు పొందిన విరాద్రూపమే కనడుతుంది.ఇంతై’ అంతై,ఇంతై,అంతై,అంతై,అంతంతై, అన్న అచ్చతెలుగు పదాలను కొలమానాలుగా స్వీకరించి ఆ బ్రహ్మాండాంత సంవర్ధకుని స్వరూపాన్ని సమర్థవంతంగా వర్ణించాడు. కాని తృప్తి పడలేదు. నిదానంగా దృశ్య చిత్రప్రధానంగా త్రివిక్రమాకృతిని తీర్చిదిద్దినాడు.అంచెలంచలుగా భిన్నభిన్నావస్థలలో క్రమవర్ధనాన్ని రెండవ పద్యంలో ఆవిష్కరించాడు.అలా అంబరాలను దాటిపోతున్న వామనుడు అతనికి గొడుగుగా నిల్చిన సూర్యుడు,మరీమరీ పెరుగు చున్నాడు.అదే సూర్యబింబం శిరోమణిగా,కర్ణభూషణంగా,కంఠాభరణంగా,దండకడియంగా,కంకణంగా,మేఖలాఘంటికగా,చరణనూపురంగా,చివరకు పద పీఠికగా భాసించిందింది.బ్రహ్మాండమైన మైనొక దివ్య రూపాన్ని కనులముందుంచాడు.సాహిత్యం లో శిల్పానికి ఇది ఒక నిలువెత్తు రూపంగా నిలిచిపోయింది.

రుక్మిణీ కల్యాణం

నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్
మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె
ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ! హరిం బతిఁ జేయుమమ్మ! ని
న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”

నిన్నటి తరం వారు తెలుగు నాట కన్నెపిల్లలు భక్తి తాత్పర్యాలతో పాడుకున్న పద్యం ఇది.భక్తే ఇందులోని జీవశక్తి. ఆ యమ్మను అమ్మ,అమ్మ అని ఐదుసార్లు సంభోదించడం ఈపద్యం ప్రాచూర్యం పొందడానికి కారణం అంటాడు సినారె.

“ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై
భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం
ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్
సువిభూషాంబర ధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. “

అంత్యప్రాసలతో రుక్మణీ కృష్ణుల కల్యాణం అత్యంత మనోహరంగా చిత్రించాడు పోతన.ఆమె చేతోహారిణి,అతను హరి,ఈ జన్మలోనే కాదు, అతనిహృదయాన్ని హరించినది ఇందిరాసుందరిగా.రుక్మిణి కృష్ణుల అఖిల భునన కల్యాణంగా అభివర్ణిస్తూ ముగిస్తారు,డా ” సి.నారాయణ రెడ్డి గారు

భాగవతాన్ని ఇష్టపడే వారందరూ చదువ వలసిన పుస్తకం (My Favorite Telugu Book Review ) ఇది.

Also Read :  చిందేసిన చిరుజల్లు 

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!