My Favorite Book Review : ‘మంజరి’ నవల’ కనిపించని సూర్యుడు’ పై నా సమీక్ష

నాకు బాగా నచ్చిన పుస్తకపు సమీక్ష

 

‘మంజరి’ నవల’ కనిపించని సూర్యుడు’ పై నా సమీక్ష

ఒక నవల పాఠకుడ్ని మెప్పించాలంటే, రచయిత ఎన్నుకున్న వస్తువు,ఆ నవల యొక్క ఎత్తుగడ, రచనా శైలి, అసాధారణమైన ముగింపు,మరీ ముఖ్యంగా చెప్పాలంటే రచనలో నవ్యత కచ్చితంగా ఉండాలి. అప్పుడే పాఠకుడు నవలను చివరిదాకా చదివి ఆనందపడతాడు,అనుభూతి చెందుతాడు,ఆలోచనల్లో పడతాడు.ఆలోచింపజేసే నవలెప్పుడూ పాఠకుడి మనసులో చెరగని ముద్రను వేస్తాయి.

అలాంటి ఒక ఆలోచింపజేసే నవలే డిసెంబర్ 2005 చతుర మాసపత్రికలో వచ్చిన ‘మంజరి’ గారి ‘కనిపించని సూర్యుడు’ నవల.వాస్తవానికి ఈ నవల స్వాతంత్రోద్యమం నేపథ్యంగా సాగుతుంది.

ఇందులో నాగరిక సమాజానికి, మైదాన ప్రాంతానికి దూరంగా కన్నతల్లిలాంటి అడవినే నమ్ముకుని జీవనం సాగించే కోందుజాతి గిరిజనుల గురించి,వారి నీతి నిజాయితీలు,ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు,జీవన విధానాన్ని గురించి విపులంగా వివరిస్తారు రచయిత.

అమాయకులైన ఈ కోందుజాతి గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి అమానుషంగా ఎలా ప్రవర్తించేవారో చదువుతూంటే హృదయం ద్రవించి పోకమానదు.

అలాంటి పరిస్థితులలో వారి జీవితాల్లో ముసురుకున్న పెత్తనపు చీకట్లను పారద్రోలి వెలుగు సూర్యుడై కాంతులు నింపడానికి కంకణం కట్టుకున్న,వారి గుండెల్లో కొన్ని తరాలవరకు ఆరాధ్యుడై నిలిచిన ఒక బ్రిటిష్ అధికారి వ్యక్తిత్వ వివరాలను రచయిత అక్షరీకరిఃచిన విధానం చదువరుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఇక నవలలోకి వెళ్తే, గ్రామానికి పెద్ద జామిరి కోదు.అతను ఆ గ్రామానికి సావోతాగా వ్యవహరిస్తాడు.ఆ జాతికి కొన్ని అలవాట్లు, కట్టుబాట్లు ఉండటం వలన గ్రామంలో సావోతా చెప్పినదే శాసనం.అతని మాటకు గ్రామస్థులంతా కట్టుబడి ఉంటారు. అయితే గ్రామానికి ఫారెస్ట్ రేంజర్ (ఫారా‌స్టి) వస్తున్నాడనడానికి సూచికగా మిరపకాయ టపా వచ్చినప్పుడల్లా గ్రామం యావత్తూ భయంతో వణికిపోతుంది.

అధికారిని డోలీలో తీసుకురావడానికి ఎంతో కష్టాన్ని,శ్రమని అనుభవిస్తారు వాళ్ళు.గ్రామానికొచ్చిన ఫారెస్ట్ కి కోపం రాకుండా సేవలు చేయడానికి నానా అవస్థలు పడతారు.కానీ పట్నం నుంచి వచ్చిన అధికారులు కోందుజాతిని పశువులకంటే హీనంగా చూడడం,తమని సేవించడానికే భగవంతుడు వారిని సృష్టించినట్లు వారు భావించడం కోందుల పట్ల జాలిని కలుగజేస్తుంది.

ఇలాంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలోని వ్యవహారాలు చూసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని నియమిస్తుంది.అక్కడ కోందులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోతాడతడు.

వారి కష్టాలను తన క‌ష్టాలుగా భావించి, వారివైపు నిలబడతాడు.ఆ అమాయకల కోందు పట్ల సానుభూతితో సహాయపడి కోందు గుండెల్లో దేవునిగా కొలవబడతాడు సాండర్స్.కోందుజాతి చేత ప్రేమగా ‘ఫాదరీ బాబు’ అని పిలిపించుకోవడం సాండర్స్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.

కోందు బ్రతుకులు ఫారెస్ట్ అధికారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది.అడవిలోకి దొరలు వచ్చినపుడు లేడి మాంసం,దుప్పి మాంసం కావాలి.దొరసానికి పుట్టతేనె, నెమలి పిట్టలు తెచ్చివ్వాలి.వాళ్ళక్కడకు వచ్చినపుడు కోదులకు సంకటస్థితే.

ఫారెస్ట్ వాళ్ళుగానీ, పోలీసువాళ్ళుగానీ వచ్చేముందు గ్రామానికి మిరపకాయ టపా వస్తుంది.గ్రామస్థులు వెళ్ళి వారిని డోలీలో తీసుకురావాలి.చాలా కష్టసాధ్యమైన పనే అయినా,అనాదిగా వస్తున్న అక్కడి అమానుషమది.దాన్ని అతిక్రమిస్తే పర్యవసానం వాళ్ళకు తెలుసు.అక్కడి భూమిపైన, చెట్లపైన,వేటపైన లేనిపోని లెక్కలు చూపి శిస్తు పేరుతో నానాహింసలు పెడతారు.

అక్కడున్నంత కాలం అమాయకులైన కోందుల జీవితాల్లో చైతన్యం తెచ్చేందుకు,డోలీ వ్యవస్థను రద్దుచేసి,వాళ్ళకు బాసటగా నిలబడటంలో కృషిచేసిన బ్రిటిష్ అధికారి సాండర్స్ భారతదేశానికి స్వాతంత్రం రావడంతో తిరిగి స్వదేశానికి పంపేయబడతాడు.

కోందుల జీవితాల్లో చీకటిని తరిమి వెలుగులు కోసం తాపత్రయపడిన సాండర్స్ అనే అధికారి మళ్ళీ కనిపించకపోయినా ఎన్నటికీ మరువదు ఆ జాతి. కోందుజాతి గుండెల్లో సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి ఎప్పుడూ సూర్యుడై వెలుగుతూనేవుంటాడు.

‘తమని ప్రేమించిన వాడిని, తమకోసం తపించినవాడిని సమాజం ఎన్నటికీ మరువదు.అది నాగరికమైనా, అనాగరికమైనా సరే.’ అన్న ముగింపు వాక్యాలు నవల ముగింపుకు వన్నెతెచ్చాయి.

‘కనిపించని సూర్యుడు’ నవలను రచయిత ఒక జాతికి సంబంధించిన సమాచారంతో చివరిదాకా అద్భుతంగా అక్షరబద్ధం చేసిన విధానం చదువరులకు ఆకట్టుకుంటుంది.అందుకే రచయిత ‘మంజరి’ గారు అభినందనీయులు.

 

Also Read : తెలుగు జానపద గేయం- వివరణ

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!