My Dream : నాదొక కల

నాదొక కల

 

నాదొక కల

వాక్యాలను విడిచి కవిత్వంగా మలిచి
పదబంధాలు అందంగా సరికొత్తగా సృష్టించి
మనో ఫలకం పైన గీసుకొని
మనోనేత్రంతో వీక్షించి కవిత్వం రాయాలని

మేధస్సు గర్భము నుండి
అక్షర అంకురాలను మొలిపించి
సలక్షణమైన కాగితపు నేలపై
విలక్షణమైన కవిత పంట పండించాలని

గుప్పెడు అక్షరాలను గుప్పిట్లో పెట్టుకొని
ఉవ్వెత్తున ఎగిసే అలలు పట్టుకొని
ముత్యపు పంటను సాగు చేసి
మురిపెంగా అక్షర సేద్యం చెయ్యాలని

రాత్రి వచ్చిన స్వప్నాన్ని
అక్షర రూపంలో సాకారం చేసుకొని
ఆత్మానందాన్ని నిత్యం పొందుతూ
వాస్తవాల కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలని

సృజనాత్మకతకు మెరుగులు దిద్ది
చెప్పాలనుకున్న దానికి ఒక రూపం అద్ది
భావాన్ని అక్షర శిల్పంగా మలిచి
ఆలోచన రేకెత్తించే ప్రశ్నకు జవాబుగా నిలవాలని

కళ్ళు ఆస్వాదించిన అందాన్ని
అపురూప వర్ణ చిత్రంగా తెరకెక్కించి
అక్షర విన్యాసాల లావణ్యం కల్పించి
అనుభవించిన ఆనందాన్ని పంచాలని

చెవులు విన్న వీనుల విందులు
ఆస్వాదించిన అపురూప గాథలు
సప్తస్వరాలు సోయగాలతో కలిపి
అక్షరాల లయబద్ధపు సవ్వడులు వినిపించాలని.

నాదొక తత్వం అందులో ప్రతిబింబించి
నా కవిత్వపు సొగసులతో కనిపించి
నా నామం అక్షరపు తోటలో సుస్థిరంగా నిలిచి
నా జన్మ సార్థకం చేసుకోవాలని చిన్న ఆశ

Also Read : సగటు మనిషి జీవితం 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!