అమ్మతనం
నిశ్శబ్దాన్ని చేధించు యోధుడవై
విజయ దుందుభి మ్రోగించు ధీరుడవై
చరిత్ర నీ కోసం ఎదురు చూస్తుంది
నీ ప్రస్థానాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని
కన్నీటిని తుడిచేసే చేతులు నీవేనని
పేదల ఆకలి తీర్చే కర్షకుడు నీవేనని
చీకటి జీవితాల్లో చిరు దివ్వెలు వెలిగించేది నీవేనని
అన్యాయాన్ని ఎదిరించే పిలుపు
నీ స్వరం నుండి రావాలని.
బానిసత్వ సృంకలాలు చేదించే
కార్యసాధకుడవు నీవే కావాలని
అదిగో తొలి వేకువ కిరణం తొంగి చూస్తుంది
నవ చైతన్యం నింపుకున్న పల్లెల్లో
దాహార్తి లేని నిరుపేదల నివాసాలకోసం
కన్నెతనంలో అమ్మతనం చూసే
నాగరిక లోకం కోసం
తొలి అడుగు నీతోనే ప్రారంభం కావాలని
అది అందరికీ మార్గదర్శమవ్వాలని
వెనుతిరిగి చూడకు
గతం వ్రాసిన చరిత్ర మనకొద్దు
సరికొత్త చారిత్రిక ఘట్టం మొదలైయింది
స్వేచ్ఛా బీజాలు చల్లుకుంటూ సాగిపో
బోసి నవ్వుల దీవెనలు అందుకుంటూ
Also Read : బ్రతుకు నిత్య సమరం