Moral Story of Bhagavad Gita : భగవద్గీత ను సంభోదిస్తూ ఒక నీతి కథ

భగవద్గీత ను సంభోదిస్తూ ఒక నీతి కథ

భగవద్గీత ను సంభోదిస్తూ ఒక నీతి కథ 
సాయంకాలం సమయాన , పరంధామయ్య గారు తయారయి , చల్లని వాతావరణంలో , నడక కని బయటకు వెల్లబోతున్నాడు,
అది గమనించిన పిల్లలు , చరవాణులలో ఆటలాడటం ఆపేసి ,
“తాతయ్యా! తాతయ్యా!” అంటూ పిలిచారు పదేండ్ల మనుమడు రుగ్వేద్,  ఎనిమిదేండ్ల   మనుమరాలు యజుర్వేద.
“ఏంటమ్మా! ” అంటూ వెనక్కి తిరిగి వచ్చాడు పరంధామయ్య గారు
“తాతయ్యా! తాతయ్యా !
ఒక మంచి కథ చెప్పవా!”
అంటూ ప్రాదేయ పడ్తారు.
“సరేరా , చెబుతాను, కానీ ఒక షరతు ” అంటాడు
“ఏంటి తాతయ్యా!” అని ఒకే సారి అంటారు పిల్లలు
“మీరు కుదురుగా కూర్చుని ,శ్రద్ధగా వింటేనే చెబుతాను” అంటాడు
“ఓ.. సరే తాతయ్యా!”
కథ నారంభించాడు పరంధామయ్య గారు
“నేను ఇపుడు భగవద్గీత లోని ఒక చిన్న కథను చెబుతాను. ఎంతో ఆసక్తిగా ఉంటుంది”.
“ముందుగా భగవద్గీత గురించి క్లుప్తంగా చెబుతాను. సరేనా!”
“సరే తాతయ్యా!”
“మహాభారతం లోని , భీష్మపర్వం లోని 25 వ అధ్యాయం నుండి 42 వరకు గల 18 అధ్యాయాలను ‘భగవద్గీత’ అంటారు. ఈ 18 అధ్యాయాలనే యోగాలు అని కూడా అంటారు. దీనిని వేదవ్యాసుడు చెబుతుండగా , గణపతి దేవుడు సంస్కృతంలో రచిస్తాడు.
అర్జున విశాధయోగం ,సాంఖ్యాయోగం ,కర్మయోగం ,జ్ఞానయోగం ,కర్మసన్యాస యోగం… ఇలా 18 యోగాలు ఇందులో ఉన్నాయి.భగవద్గీత లో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి.”
“ఇక కథలోకి వద్దాం.
” ధృతరాష్ట్రుడు గాంధారికి నూరుమంది కుమారులు ,వీరినే కౌరవులు అని అంటారు. ఒక కూతురు . పాండురాజు కుంతీమాతకు ఐదుగురు కుమారులు, వీరిని పాండవులు అని అంటారు.
కౌరవులు పాండవులు అన్నదమ్ముల పిల్లలు అన్నట్లు.
ఒకసారి మయసభలో ధుర్యోధనుడు నీటిలో జారిపడగా , ద్రౌపది నవ్వుతుంది. దీనిని అవమానంగా భావిస్తాడు దుర్యోధనుడు. దానికి ప్రతీకారంగా , తన మేన మామ శకుని మాయపాచికలతో , జూదంలో ధర్మరాజు తో సహా , సర్వస్వాన్ని కొల్లగొట్టి , మయసభలో ,భీష్ముడు ,ద్రోణాచార్యుడు ,కర్ణుడు చూస్తుండగానే , దౌపది వస్త్రాభరణం చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడు చీరనందించి ద్రౌపదిని రక్షిస్తాడు.
జూద నియమాలనుసారం 12 సం.రాలు అరణ్యవాసం , ఒక సం.రం అజ్ఞాత వాసం గడుపుతారు పాండవులు.
“యజుర్వేదా , ఏమైనా విసుగుగా ఉందా!”
“ఏమి విసుగు లేదు తాతయ్యా! చాలా చక్కగా చెబుతున్నారు, చెప్పండి తాతయ్యా!”
”సరే నమ్మా!”
అజ్ఞాత వాసం పూర్తి అయ్యాక , పాండవుల రాజ్యాన్ని పాండవులకు ఇవ్వాలని , కృష్ణుడు ధృత రాష్ట్రుడికి ,భీష్ముడికి , దుర్యోధనాధులకు గుర్తు చేస్తాడు
”రుగ్వేద్,  మీకు పాండవుల పేర్లు తెలుసా!”
“ఓ, తెలుసు తాతయ్యా!
“ధర్మరాజు , భీముడు ,అర్జునుడు ,నకుల సహాదేవులు. మా టీచర్ చెప్పింది , తాతయ్యా!”
అంటూ గడ గడా చెప్పేస్తాడు రుగ్వేద్
“వెరీ గుడ్”
మల్లీ కథ చెప్ప నారంభించాడు ,పరంధామయ్య గారు
“అయితే కౌరవ శ్రేణులు , అరణ్యవాస ,అజ్ఞాత వాస సమయంలో పాండవులను ఎన్నో ఇక్కట్లకు గురిచేయడమే కాకుండా , జూదంలో తమ రాజ్యాన్ని కోల్పోయారని , మొండి వైఖరితో పాండవుల రాజ్యభాగాన్ని ససేమిరా ఇవ్వనంటారు “
చివరికి ఆ పోరు కురుక్షేత్ర యుద్దానికి దారి తీసింది.
కౌరవుల వైపు ధృతరాష్ట్రడు ,భీష్ముడు ,కర్ణుడు , ధ్రోణాచార్యుడు ,శకుని ధుర్యోధనుడు లాంటి అతిరథమహారధులు ఉన్నారు. అస్త్రశస్త్రాలు లక్షలాది సైన్యం ఉన్నారు.
పాండవుల వైపు కేవలం , ధర్మరాజుతో సహా పాండవులు , ఉప పాండవులు , కృష్ణుడు , అస్త్రశస్త్రాలు ,సైన్యం ఉన్నాయి.
యుద్ధభూమి లోకి ,ధర్మరాజు ,అర్జున పాండవాదులు వస్తారు. రథసారధిగా కృష్ణుడు వస్తాడు .
అర్జునుడు , ఎదురుగా ఉన్న సైన్యాన్ని తీక్షణంగా చూస్తాడు. భీష్మపితామహుడు ,కర్ణుడు ,ద్రోణుడు మొ.గు అతిరధ పరాక్రమవంతులున్నారు.
భయం ,వాత్సల్యంతో యుద్ధం చేయనని రథం దిగి పోతాడు.
కృష్ణుడు అర్జునడిని నిలువరిస్తాడు.
అప్పుడు అర్జునుడంటాడు , “వాసుదేవా! నాకు యుద్దం చేయాలని లేదు. నేను యుద్దం చేయను. ఆందోళనగా ఉంది. అటువైపు ఉన్న వారంతా పితామహులు , సోదరులు , గురువులు , బంధువులు.
వారిని హతమార్చిన తరువాత నాకేమైనా మనఃశ్శాంతి ఉంటుదా. ఇలా సాధించిన రాజ్యం నాకు వద్దు. అని విలపిస్తాడు , అధైర్యపడి పోతాడు.
“ఇప్పుడు నాకర్తవ్యం ఏమిటి? నాకు ఏమి తోచడం లేదు పరంధామా! ” అని ధీనంగా అంటాడు అర్జునుడు
అపుడు కృష్ణుడంటాడు ,
“పార్ధా! భయం అనేది పిరికి వాని లక్షణం. క్షత్రీయులకు భయం తగదు. భయం వలన పిరికితనము , కోపము , అవివేకము , మతిమరుపు ,మానసిక ధౌర్భల్యము కలుగుతుంది. భయం వలన శక్తి నశిస్తుంది , అధైర్యం ఆవహిస్తుంది. ఎలాంటి కార్యాన్ని సాధించ లేరు.
భయానికి బదులుగా నీమనసులో ధైర్యాన్ని ,శౌర్యాన్ని నింపు.
అప్పడు నీకు శక్తి వస్తుంది. వివేకం పెరుగుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. మంచి వ్యూహాలను రచిస్తావు. నీకు విజయం ప్రాప్తిస్తుంది. గొప్పవాడివిగా కీర్తింపబడుతావు”
అంటూ కృష్ణుడు హితభోద చేస్తాడు.
“యిక పోతే వారు నీ సోధర సమానులు కారు. కీర్తింపబడేటువంటి లక్షణాలు , వారిలో ఏ ఒక్కరిలో లేవు. శకుని మాయ పాచికలతో ధర్మరాజును ఓడించింది మరిచి పోయావా? దుశ్శానుడు ,ద్రౌపది వెంట్రుకలు పట్టుకుని లాక్కొస్తుంటే , ఏ ఒక్కరైనా అడ్డుకున్నారా?
నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తుంటే , చూస్తూ కూర్చున్నారే కానీ , ఏ ఒక్కరైనా అడ్డుచెప్పారా? మీ సంపదలను , మిమ్ములను జూదంలో గెలుచుకున్నపుడు , ఎవరైనా మాట మాట్లాడారా?
మిమ్ములను అరణ్యవాసం పంపించినపుడు , ఎవరైనా నిలువరించారా? చెప్పు అర్జునా!
మీతో యుద్ధకాంక్షతో యున్న వారు, యుద్దభూమిలో  వారెలా నీకు ఎలా ఆత్మీయులవుతారు? ఎలా బంధువులవుతారు? ఎలా సోదరులవుతారు?
“పార్ధా! యుద్ధభూమిలో ఉన్నపుడు , అవతలి వైపు వారిని శత్రువులు గానే భావించాలి గాని మిత్రులు గానో , సోధరులుగానో , బంధువులుగానో ఊహించుకోరాదు. నీ మనసునంతా గెలుపుపై లగ్నం చేయి. నీ శక్తియుక్తులను శత్రువుల ఓటమిపై దృష్టి నిలుపు. నీ వ్యూహాలను విజయం దిశగా రచించు. మిమ్ములను ఇక్కట్లపాలు చేసినవారిని యుద్ధభూమిలో ఓడించు.
యుద్దభూమిలో రాగం ,ఆప్యాయతలు ,మనిషిలోని శక్తిని,ఆలోచనలను , వివేకాన్ని నశింపజేస్తాయి. అధైర్యాన్ని కలిగిస్తాయి. ఓటమిపాలుచేస్తాయి. అపజయాన్ని కలుగజేస్తాయి.”
“అంతేకాదు , యుద్ధభూమిలో గెలుస్తే , నీకు విజయం ప్రాప్తిస్తుంది. గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందుతావు. యుద్ధభూమిలో మరణిస్తే వీరమరణం పొందుతావు”
“అర్జునా!  అజ్ఞానం ,అశ్రద్ధ , అపనమ్మకం అనే మూడు అవలక్షణాలు , మనిషి పతనానికి దారితీస్తాయి.
అదే జ్ఞానం ,శ్రద్ధ ,నమ్మకం అనే మూడు మంచి లక్షణాలు , మనిషిని విజయుడిని చేస్తాయి”
” కౌంతేయా! ఎప్పడైతే అధర్మం ,అసత్యం రాజ్యమేలుతుందో , ఎప్పుడైతే స్వార్ధం పెరిగి పోతుందో , ఎప్పుడైతే ప్రజలకు రక్షణ లేకుండా పోతుందో , అప్పుడు  ధుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు , ధర్మాన్ని సత్యాన్ని నిలుపుట కొరకు , స్వార్ధపరుల అనిచి వేయుటకు , ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను.
నేనే ఆత్మను ,నేనే పరమాత్మను , నేనే శివుడిని , బ్రహ్మను విష్ణువు ను. నేనే సరస్వతి , పార్వతి ,లక్ష్మిని. సర్వంతర్యామిని నేను.
ఇప్పుడు అధర్మాన్ని అంతమొందించాల్సిన సమయం ఆసన్నమైనది.
నీకు నేను అండగా ఉన్నాను. నీలో ఎంతో గొప్ప శక్తి ఉంది.
నీ లోని శక్తిని యుక్తిని ఉధృతం చెయ్యి. శౌర్యాన్ని ప్రదర్శించు. యుద్ధం ఆరంభించు. నీ శత్రువులపై అస్త్రశస్త్రాలు సంధించు. విజయం తధ్యం.”
“పార్ధా! ధర్మసంస్థాపనార్ధమే నేను అవతరించాను.  నేను నీ వెంటే ఉన్నాను. ధైర్యంగా పోరాడు. విజయం నీదే”
అంటూ అర్జునిలో , ధైర్యాన్ని , నమ్మకాన్ని ,ప్రేమాను రాగాలపై ద్వేషాన్ని రగిలిస్తాడు. శౌర్యాన్ని పెంపొందిస్తాడు.
చివరగా అర్జునుడు ,తమ విశ్వరూపాన్ని దర్శింపచేయమని కోరగా ,  తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు మధుసూధనుడు.
“అర్జునా! ఈ విశ్వమంతా నేనే ఆవరించి ఉన్నాను. ఆకాశం  , భూమి  , వాయువు ,అగ్ని , జలం  నేనే . ఈ సూర్యుడు , చంద్రుడు , గ్రహాలు ,నక్షత్రాలు ,
నేనే. విశ్వంలోని అణువణువు నేనే. “
అంటూ తన విశ్వరూపాన్ని చూపి ,
పార్ధా! నీలోని వాత్సల్యాన్ని , ప్రేమాను రాగాలను ,అజ్ఞానాంధకారాన్ని , అధైర్యాన్ని , అలసత్వాన్ని , అవివేకాన్ని విడనాడు.
గాండీవాన్ని ఎక్కుపెట్టి , శరాలను సంధించు . నీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీయి. ధైర్యంగా యుద్దమారంభించు” అని అంటాడు.
కృష్ణుడి విశ్వరూపాన్ని చూసి పార్ధుడు విస్తుపోతాడు. నరనరాల్లో రుధిరం పరవళ్ళుతొక్కుతుంది. రోమాలు నిక్కపొడుస్తాయి. ముఖం ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తుంది. వాసుదేవునిపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది.
వాసుదేవుని ,హితభోదనలను అవగతం చేసుకున్న అర్జునుడు ,తనలోనున్న శక్తిని కూడగట్టుకుని ,విజయంపై నమ్మకంతో , ధైర్యంగా , చక్కని వ్యూహరచనలతో , కృష్ణుడు రథసారథిగా రాగా , కౌరవులతో ,కౌరవ సైన్యంతో అలుపెరుగక , భీకర యుద్దం చేసి , వీరాధివీరులందరిని హతమార్చి, హస్తినాపురం చేరి , ప్రజలకు ధర్మ పాలన అందిస్తారు. ప్రజలు సుఖ సంతోషాలతో , ఆనందంగా జీవించేట్లుగా  సత్య పాలన సాగించారు.
“ఇది భగవద్గీత క్లుప్త సారాంశం  పిల్లలూ  , ఎలా ఉందిరా!” అంటు ముగిస్తాడు
“చాలా బాగుంది తాతయ్యా!
ఈ కథ వలన మాకు ఎన్నో మంచి విషయాలు తెలిశాయి తాతయ్యా!. మంచి పనులకు  పూనుకున్నపుడు , ధర్మం సత్యం నెలకొల్పాలనుకున్నపుడు , ఎవరో ఒకరు భగవంతుడి రూపంలో అండగా నిలుస్తారని , భయం వీడి , ధైర్యంగా ,మంచి వ్యూహాలతో పోరాడితే , దేనినైనా సులువుగా గెలువవచ్చని , యుద్ధభూమిలో , భవబంధాలను విడనాడి , పోరాటానికి దిగిన వారిని శత్రువులుగానే భావించి ,నమ్మకంతో ,ధైర్యంగా పోరాడితే విజయం తధ్యమని  చాలా బాగా చెప్పారు తాతయ్యా!”
“ధన్యవాదాలు తాతయ్యా!”
“సంతోషం రుగ్వేద్ ,యజుర్వేద”

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!