Moral story of Bhagavad Geetha : పరమార్థం

పరమార్థం

 

పరమార్థం

ఒక మధ్య తరగతి కుటుంబం.అందులో నాన్నగారు రాఘవయ్య, అమ్మ రమణమ్మ. నాన్నగారు రిటైర్డ్ ఆఫీసరు గవర్నమెంట్ ఆఫీసు నుండి వారికిద్దరు సంతానం. ఒక కొడుకు, ఒక కూతురు ఇద్దరి వివాహాలు వారికున్నంతలో ఆర్భాటంగానే చేసారు.
కోడలు కాస్త ‘ఉన్న’ కుటుంబం నుండే వచ్చింది. కూతుర్ని మధ్య తరగతి కుటుంబంలో పడింది.కొడుకు కోడలు ఈ మధ్యనే అమెరికా వెళ్లిపోయారు.అల్లుడి నివాసం హైదరాబాద్ లోనే.ఒక ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగి. ఇద్దరికీ ఇద్దరేసి సంతానం.అయితే కొడుకుకు ఇద్దరూ కొడుకులే,కూతురుకి ఇద్దరూ ఆడపిల్లలే. ఇదీ ఒక సగటు జంట సంసారం.

ఎపుడైనా కూతురు అల్లుడు పండగలకు రావడంతో హడావుడి,ఎన్నడైనా కొడుకు కోడలు అమెరికా నుండి వస్తే ఓ 3-4 వారాల హడావుడి. ఒకటి రెండు రోజులకి ఈ తల్లిదండ్రులు కూతురు దగ్గర ఉంది రావడం కూడా పరిపాటే.మిగతా టైంలలో ఫోన్లలో క్షేమ సమాచారాలు షరా మామూలే.

మన సంప్రదాయాలు, పద్ధతులు, ఆనవాయితీలు, పండుగలు మొదలైనవి ఉండబట్టి గాని ఒకరిళ్లకు ఒకరు వెళ్లడం కూడా మానేసుకుంటారేమో. కొడుకు ఇద్దరు పిల్లలు బడికెళ్లే వయసు వచ్చేసింది కనుక కోడలు జాబులో చేరాలనుకుంటోంది. అందుకు కాస్త సాయంగా, మొదట్లో కాస్త అలవాటు అయ్యేవరకు, ఓ 5,6 నెలల కోసమై రాఘవయ్య, రమణమ్మ గార్లను పిలవడం జరిగింది.

మొదటిసారిగా ఈ తల్లిదండ్రులు అమెరికా ప్రయాణమైనారు.ఇదీ ఒక ఒంటరి జంట (భర్త రిటైర్మెంట్ తర్వాత) .జీవితం,
ఎయిర్ పోర్ట్ నుండి నేరుగా తల్లిదండ్రులను ఇంటికి తీసుకుని వచ్చాడు కొడుకు. వారాంతపు సెలవు రోజుల్లో వచ్చేట్టుగా, ఇంట్లో అందరూ ఉండేట్టుగా చూసుకునే టికెట్స్ బుక్ చేయడం జరిగింది.

కొంచెం బెట్టు చేసినా మనుమలిద్దరూ మాలిమయ్యారు రెండ్రోజుల్లోనే, అదేనేమో రక్త సంబంధమంటే. సోమవారం నుండి ఈ “ ‘అత్తా, మామయ్యలు’ ఎలా ఉండాలి, ఏ ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయీ, ఎలా జాగ్రత్తగా వాడాలి” కోడలు ఆదివారమంతా చెబుతూనే ఉంది. పనులకు ఏ ఏ మషీన్లు ఎలా ఎలా వాడాలి అన్నీ దగ్గరుండి చూపించింది .ఇక పిల్లలు ఏ ఏ టైం లో వెళతారు, వస్తారు వీరి ఫుడ్ హాబిట్స్ ఏంటి చెప్పింది కోడలమ్మ.

ఓ వారం రోజులు గడిచాయి.కాస్త మర్యాదలతో, కాసిన్ని మాటలతో. రెండవ వారం మరి కాసిన్ని మాటలతో గడిచింది. ఈ వారం, ప్రక్కనే ఒక పార్టీ కి వెళ్లిరావడం, దగ్గరున్న గుడికి తీసుకెళ్లడంతో గడిచింది. ఉదయం ఆఫీస్, స్కూల్ లకు తయారై వెళ్లడం, సాయంత్రం నీరసంగా వచ్చి ఫ్రెష్ అప్ అయి, కాస్త ఏదైనా తిని, కంప్యూటర్, లాప్ టాప్, టీవీ, ఐ పాడ్ ల ముందే గడిచిపోతుంది.

కానీ ఇది పిల్లలున్న ఇల్లులా ఉందా?వాళ్ళ హోంవర్క్, వాళ్ళ సిస్టమాటిక్ పనులు, భోజనాలు చూస్తుంటే ఈ నిశ్శబ్ద గంభీర వాతావరణంలో ఇక మనలేమనిపించింది ఆ తల్లిదండ్రులకి. సాయంత్రాలైనా యంత్రాలలాగనా? కొడుకు ఒళ్ళో లాప్ టాప్, ఎదురుగా టీవీతో, కోడలు తన గదిలో గడపడం!

ఇక భోజనాల దగ్గరైనా ఏదైనా అల్లరి..మాటా..ఊహూ! ఈ ఈ పనుల్లో ఈ నలుగురూ పీ.హెచ్.డీ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఉదయాలు వీళ్ళు వెళ్ళిపోయాక ‘నాయనమ్మ, తాతయ్యలే” ఏం మాట్లాడాలనుకున్నా.

మనుమలు ప్రేమగా దగ్గరికి రావాలన్నా కోడలి నియంత్రణ. హోమ్ వర్క్, నెక్స్ట్ క్లాస్ ప్రేపరషన్ అని ముఖాలు చిన్నబుచ్చుకొనేవారు. ఏమైనా పిండివంటలు, స్వీట్స్ చేసి నాయనమ్మ వారికీ దగ్గరవాలనుకుంది,చేసినవన్నీ విడివిడిగా ఇద్దరి కొడుకులకూ సర్ది., టైం ప్రకారం తినమంది కోడలమ్మ మళ్ళీ నిశ్శబ్దం.

‘ఇలా అయితే ఇక 4-6 నెలలు ఎలా ఉండాలి?’ ఎలా ఉండాలన్న ప్రశ్న తలెత్తినది ఈ ‘నాయనమ్మ తాతయ్యల’ మెదడులలో శరీరానికి పనీ పాట తగ్గి , మనసుకు అందరిలో ఉన్నా ఒంటరితనంలా అనిపిస్తోంది. ఇక నాలుగో వారం సైట్ సీయింగ్ అని తిరిగి అలసట తప్ప ఆనందం అనిపించలేదు.

పిల్లలకు 1,2 వస్తువులు కొనిపించగలిగారు. వారికి – అదే ఆనందం. ఒంటరిగా ఉన్నా ఎంత ఆనందంగా పురివిప్పి ఆడుతుంది మనసు.
‘గత జ్ఞాపకాల’ ల్లో ముచ్చటిస్తూ జీవించడం మనకలవాటైనంతగా,ఎవరికీ అలవాటు కాదేమో, మన ‘తెలుగోడి’ ప్రకృతి, అలవాట్లు, సైకాలజీ.

ఓ ‘కంఫోర్ట్’ ఐన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎదుటివాడు కొత్తవాడైనా తమలో ‘కలుపుకునే’ మనస్తత్వం రక్తంలోనే ఉంటుంది. ఇండియాలో ఇరవయున్న పార్టీ ఎంత రణగొణ ధ్వనుల, సవ్వడులు మధ్య ఉంటుందో, ఫారిన్ లో 200 మంది అయినా సైలెంట్ గా, గంభీరంగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నగా వినిపిస్తుంటే జరుగుతుంది పార్టీ. అదీ ‘ఇమోషనల్’ ప్రేమాలైనా, ముచ్చట్లు, వేడుకలు, మరేవైనా! ఇదీ మన దేశ నైజం.

అలాంటిది ఈ ఫారిన్ అలవాట్లు, అంటీ ముట్టనట్టుగా ఉండడం, ఈ నిశ్శబ్దం, ఎలా అలవాటౌతున్నాయి ఈ తరానికి?? మన ‘అరిస్టోక్రాట్ బిహేవియర్” ‘అరిష్టానికే’ అని తెలియదా? వెనకటికి డబ్బు, చదువుల, పెళ్లిళ్ల ఇబ్బందులే ఉండేవి. ప్రేమాప్యాయతలకు ఏ కొదువా ఉండేది కాదు. ఇప్పుడు చదువులు, పెళ్లిళ్లు మొ ఈజీగా జరిగిపోయి, మాట, ప్రేమ కరువైపోయాయా? ఆడంబరాలు, సుఖాలు, డబ్బుతో విలయతాండవం చేస్తున్నాయా ?

సరే ఇక ఈ 4-6 నెలలు ఎలా గడుస్తాయో అనుకున్న జంట.ఈ కొత్త పరిస్థితికి అలవాటు పడ్డారు. ‘అంతా’ ఉన్నప్పుడు ‘ఫారిన్’ లా ఎవరి పనులల్లో వారు, ఇద్దరే మిగిలినప్పుడు ‘ఇండియా’ లా గల గలా అందరి గురించిన ముచ్చట్లతో,ఇండియా లో ఉన్న వారికి, కూతురికి, ఒకటి రెండు ఫోన్ల గురించిన సంభాషణలతో యిట్టె గడిచిపోయేది.

ఎపుడైనా కొడుకు ‘ఏమైనా కావాలా అమ్మా?’ అని అడగడం, పిల్లలు ఆదివారాలు కాస్త ఆటవిడుపు తో మెలగడం కూడా అలవాటయ్యాయి. ఇక ఇండియా తిరుగు ప్రయాణం! తేలికగా ఊపిరి పీల్చుకున్నాం! కోడలు ఎన్నో ‘గిఫ్ట్స్’ మాకూ, మా కూతురి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ..’సర్ది పెట్టానని’ చెప్పింది, అందరికీ ఇమ్మంది.

‘లైవ్లీ లైఫ్ వర్సెస్ మెకానికల్ లైఫ్’ కి తేడా తెలిసొచ్చింది. ఇండియా కొచ్చేసారు ఇరువురూ. ఇంటికొచ్చిన వారానికి అమ్మాయి తన ఇంటికి ఆహ్వానించింది, కొన్నిరోజులుండి పొమ్మని. చూసి చాలా రోజులయ్యిందని. ఇటు ప్రయాణమయ్యారిక. అమ్మాయి ఇల్లు చేరే సరికి మధ్యాన్నం భోజన సమయం.

భోజనాలు ముగించాక కొడుకు కోడలు పంపించిన ఖరీదైన గిఫ్ట్స్ తో మనుమరాళ్ళ ముచ్చట్లతో చాలా సంతోషంగా గడిచిపోయింది ఆ సాయంత్రం. అమ్మాయిది చిన్న ఇల్లు, చిన్న సంసారం. దగ్గరే ఉన్న బడిలో ఉపాధ్యాయిని. అంత పనీ అందరూ కలిసి చేసుకుంటారు.

అల్లుడుగారు మొహమాటపడకుండా వీరందరి ‘మీటింగ్’ లలో అప్పుడపుడు కలిసిపోయేవారు. డబ్బు విషయంలో పొదుపుగా సాగుతున్న సంసారం. కానీ మాట, ప్రేమ, ఇమోషన్స్ కి కొదువే లేదు. వారం యిట్టె గడచిపోయాక రేపు వెళ్ళిపోతారనగా అమ్మాయి చిన్నబుచ్చుకొని, ‘వారం రోజులు బయటికి ఎక్కడికీ తీసుకెళ్లలేకపోయాను. గుడికైనా వెళ్లి వద్దాం’ అని అందరినీ బయలుదేరదీసింది. దగ్గరే ఉంది గుడి. భగవద్గీతలోని ఒక శ్లోకార్ధం చెబుతున్నారు ఒక గురువుగారు తన ప్రవచనంలో.

“పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి,
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః”

” ఎన్నో సార్లు విన్న ఈ శ్లోకం దాని అర్థం, ‘భగవంతుడికి భక్తితో చిన్న ఫలము, పత్రము, పువ్వు, లేదా నీరు ఇదీ అనకుండా భక్తితో సమర్పిస్తే చాలని, ఆడంబరాలు అక్కర్లేదని ఇంతే అర్థం చేసుకున్నారు ఇన్నాళ్లు. కానీ ఇప్పుడు కొత్త అర్థం స్ఫురించింది రాఘవయ్య, రమణమ్మలకు.

‘తల్లిదండ్రులకు కావలసింది ఆడంబరాలు, డబ్బులు, గిఫ్ట్ లు పనులను సులభపరిచే పరికరాలు కావని ప్రేమ పూరిత మాట మంతి, స్పర్శ, ప్రేమ, కావాలని అమెరికా ట్రిప్ కు, అమ్మాయి ఇంటికీ ఈ కొత్త అర్థాన్ని అన్వయించుకున్నాక అర్థమైంది.

వీరికి,శ్రీ కృష్ణ భగవానుడు ‘గీత ‘ లో ఇంత గూడార్థం తో చెప్పాడా అని!!. నిజమే కదా ఇంత క్లియర్ గా చెప్పిన భగవంతునికే తను అడిగింది భక్తి తో ఇవ్వకుండా విశ్రాంతి, నిద్ర లేకుండా చేసే ఉక్కిరిబిక్కిరి ఆర్భాటాలతో ప్రశాంతత లోపించేట్టు చేస్తున్నారే ఇక ‘ఇది ఇవ్వండి ఇలా’ అని అడగని ఏ తల్లిదండ్రుల సంగతైనా, ఆ సంతానానికి ఇంకేం అర్థమవుతుంది.

 

Also Read : తెలుగు వాగ్గేయకారుడు

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!