శీర్షిక: పొదుగు కోసి పాలు తాగాలనుకుంటే
రామాపురం అనే గ్రామంలో రాధాకృష్ణ,ఆదిలక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి పెండ్లి అయిన చాలా కాలంపాటు పిల్లలు కలగలేదు. దంపతులు నోచని నోమూ, మొక్కని దైవమూ లేదు. అలా దైవమును ప్రసన్నం చేసుకోగా పెళ్లయిన పన్నెండు వసంతాలకు ఒక మగ సంతానం ప్రాప్తించింది. ఆ బిడ్డకు ఉమామహేశ్వర రావు అని నామకరణం చేశారు. లేక లేక పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ కావడంతో అల్లారుముద్దుగా పెంచసాగారు
కాలం గిర్రున తిరిగింది, తల్లిదండ్రులు చేసిన అతి గారాబం వలన ఉమామహేశ్వరరావుకి సోమరితనం, అవలక్షణాలు త్వరగానే అబ్బినాయి. తల్లిదండ్రులు బిడ్డ చేసిన తప్పులను ఎప్పటికప్పుడు వెనుకేసుకుని రాసాగారు. దానితో ఉమా జీవితం పూర్తిగా గాడి తప్పింది. తాతల నాటి ఆస్తి తరగడం ప్రారంభించింది. దురవ్యసనాలకు అలవాటు పడిన ఉమ ప్రతినిత్యం డబ్బులు తగలేయడంతో చేతినిండా డబ్బు గల సంసారం డబ్బు వెతుక్కోవాల్సిన పరిస్థితులు దాపురించినాయి
మద్యపానానికి బానిసైన కుమారుడు ఉమకు రోజులు గడవడం కష్టంగా మారింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆలోచన పక్కదారులు పట్టాయి. తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లును అమ్మమని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు, తల్లిదండ్రులు ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకునే ఇల్లును అమ్మడానికి ససేమిరా అన్నారు. ఇది ఉమకి కంటగింపుగా మారింది. ఎలాగైనా వారి అడ్డంకిని తప్పించడానికి పథకం వేసి అమలు చేశాడు.
తెల్లారేసరికి రక్తపుమడుగులో పడివున్న తల్లిదండ్రులను చూచి లేనిపోని ప్రేమను నటిస్తూ హడావుడి చేయసాగాడు ఉమ. ఇంతలో ఇరుగుపొరుగువారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు, రంగంలోకి దిగిన పోలీసులు కొద్ది క్షణాలలోనే కేసును ఛేదించారు. జరిగిన విషయం తెలుసుకున్న బంధువులు, ఇరుగుపొరుగు వారు హతాశలయ్యారు. అవలక్షణాలు మనిషిని ఎంతటి పాప కార్యానికైనా ఉసిగొల్పుతాయని అక్కడి వారు చెవులు కొరుక్కున్నారు
“పొదుగు కోసి పాలు త్రాగినట్లు” తెలివిగా తల్లిదండ్రులు తప్పించి ఆస్తిని వశపరచుకుని అనుభవిద్దామనే ఆశ అడియాస అయింది. కటకటాల వెనుక ఊచలు లెక్కించాల్సిన పరిస్థితులను కల్పించింది. సిగ్గుతో పశ్చాత్తాప పడాల్సిన పరిస్థితులు కల్పించింది. నిత్యం సమాజంలో ఏదో మూలన జరుగుతున్నా కథ లాంటిదే అయినా బంధువులు అందర్నీ నిశ్చేష్టులను చేసింది. జరిగిన సంఘటనకి చూసి బాధపడని వారు లేరు.
ఏది ఏమైనా సమాజంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ సమస్య మూలలను లోతుగా ఆలోచించి పరిష్కార మార్గాలను అన్వేషించాలి. పిల్లల్ని పెంచడంలో జాగ్రత్తలు వహించాలి
Also Read : తెలుగు సామెతను వివరిస్తూ కథ