Modati Adugu : మెుదటి అడుగు
మెుదటి అడుగు
మెుదటి అడుగు
ఉదయం వైపు నడక బాగుంటుంది
కొన్ని చీకట్ల నిట్టూర్పుల్ని మౌనంగా భరిస్తూ
గడిపిన రాత్రి నిశ్చలతకు ఓ సంబరపు కదలికలా
వేసే మొదటి అడుగు,ఉదయం వైపు నడక బాగుంటుంది.
కొన్ని పరితాపాల్ని,
కొన్ని అనుపాతాల్ని పేనుకుంటూ
కొన్ని వాగ్యుద్ధాలను, కొన్ని మదింపులను, సమర్థింపులను దాటుకుంటూ
వేసే ప్రతి అడుగూ ఆచితూచి ,ఉదయం వైపు నడక బాగుంటుంది.
కొన్ని శిథిలాల్ని, మగ్గిన మసక ఆలోచనల వాసనల్ని,
సిద్ధాంతాల మీద వేలాడే గబ్బిలాల్ని బెదరగొడుతూ
సాగే ఉత్సాహపు ఉదయం వైపు నడక బాగుంటుంది.
కొన్ని ముగిసిన కథల మీది నుంచి వెగటు కంపుకొట్టే
ఖాళీ సందుల్ని పూడ్చుకుంటూ
వెళ్లే పరిమళంలా,ఉదయం వైపు నడక బాగుంటుంది.
కాళ్లు బరువై పోయి
కళ్ళు నదులయ్యాక కూడా
అరచేతుల అదృష్టపు గీతలకై కలలుకంటూ నడిచే
ఉదయం వైపు నడక
ఓ ఆశయమవుతుంది
Also Read : మన తెలుగు