నేను సైతం
నేల నుదురు పై నాగలి
కలముతో గీతలు గీస్తాడు.
మన తలరాతను రాసేది
బ్రహ్మదేవుడేకావచ్చు.
మట్టి రాతను మార్చేది
మాత్రం అవని దేవుడు రైతే
ఈ నెల గర్భాపొరల్లో
విత్తనమనేడి పిండాన్ని నాటి
సృష్టి కార్యం తలపెడతాడు.
తల్లి కడుపు తీపి శిశువు తీరుగా
భూతల్లి బిడ్డల
రక్షకుడై కాపుకాస్తాడు..
నారుమడి నుండి పంట చేతికచ్చేదాక
మంత్రసాని వ్యవసాయపు మర్మములెన్నో
పంటలపై వాడుతుంటాడు.
పొలం గట్టే ఆసనమై మేను వాలుస్తాడు.
ఇంద్రభవనమనెడి మంచె పై కావలికాస్తాడు.
అతివృష్టి,అనావృష్టి మధ్యలో పయనిస్తూ
ప్రకృతి వైపరీత్యాల సుడిగుండాల్లో
ఎవుసాయపు నావను నడుపుతుంటాడు
చెదరని బెదరని గుండెతో చివరి వరకు పోరాడుతాడు
లోకం ఆకలి తీర్చ పోరాడే సైనికుడు హాలికుడు
యుద్ధంలో ఓడిన నాడు ఒంటరి
సైనికుడై అసువులు బాసిన దేహాలెన్నో
పొలంతల్లి ఒడిలో వరికుప్పల పాన్పు పై
ఒదిగిన సైనికులెందరో
నేల రాతను గీసిన రైతన్నకు
భూరక్కసుల గీతలను తెలుసుకోలేకపోయిండు.
పుట్టకముందే జమీందారుగా రాసుకున్న
రాతల్లో మట్టి పై
ఆనవాళ్ల గీతలను చెరిపి
కౌలుదారున్ని చేసిండ్రు
పొత్తి కడుపులో ఎవుసాయపు
మాటలిన్న అభిమాన్యులు
పద్మవ్యూహపు చిక్కులు తెలీక
చిక్కుకున్న సన్నాకారి రైతన్నలు
ఎన్నో కష్టాలని ఆకలింపు చేసుకున్నడు కాబట్టే
జనుల ఆకలి తీర్చే అన్నదాతైనాడు.
మట్టిలోని ధాన్యాన్ని కోరుతున్న విశ్వం
మట్టి మనిషి ధైన్యాన్ని కానలేక పోతుంది.
బ్రహ్మ రాసిన విధిని మార్చే
మనిషి చేతిలో నిత్యం ఓడుతున్నా
మట్టినే నమ్మిన రైతుకోసం
రైతు పక్షాన నిలుస్తాను నేను సైతం
Also Read : కవి కలం