జ్ఞాన జ్యోతి
తేనెల తేట లాంటిది నా తెలుగు
అమ్మ లోని కమ్మదనం నా వెలుగు
సొగసు లొలుకు నా భాష
కవుల పలుకై వినిపించే అక్షర ఘోష
శాసనాలలో ఊపిరి పోసుకొని
నన్నయ్య రచనతో నడక నేర్చుకొనే
ఆంధ్ర మహా భారతానికి శ్రీకారం చుట్టి
మహా రాజుల పోషణలో విర్రవీగేను
నవ్యమైన నా భాష తెలుగు
నానాటికి మెరుగు లెన్నో దిద్దుకొని
పద్యాలు గోదారిలా పరవళ్ళు తొక్కే
గద్యమై కృష్ణా నదిలా ఉవ్వెత్తున ఎగిసే
గేయమై సంగ్రామం సాగించే
పాటలై పసి హృదయాన్ని నిద్రపుచ్చే
వచన మై ప్రపంచమంతా విస్తరించే
ప్రతి నోట తెలుగు మాట పలికే
ప్రాచీన హోదాను పొందే నా తల్లి
మూడు జ్ఞానపీఠలను అలంకరించే
దేశభాషలందు మేటిగా నిలిచే
అజంతా భాషగా మన్ననలు పొందే..
పరాయి గడ్డ వాళ్ళు నీకోసం తప్పించిరి
నీ కీర్తి నలుదిశలా వ్యాపించేసిరి
అందమైన వర్ణమాలను అల్లుకొని
సాహితీ వీధుల్లో విజయకేతనం ఎగురవేసిరి
దశాబ్దాల చరిత్రకు తార్కాణం నా తెలుగు
ప్రాచీన కవుల కంటి వెలుగు నా తెలుగు
ఆధునిక కవులను అందలం ఎక్కించే తెలుగు
భాస్కరుని దివిటీ వలే వెలుగొందిన తెలుగు
కృష్ణరాయని భువన విజయపు గాధలు
కందుకూరి వీరేశలింగం జాడలు
గురజాడ వారి నిత్యనూతన ముత్యాలు
అందిపుచ్చుకొని మణిపూసలా వెలుగొందే
సంగీత సాహిత్య నృత్యాలలో
తెలుగు పదములు గజ్జెకట్టి నర్తించే
త్యాగయ్య గొంతులో అన్నమయ్య కీర్తనలలో
ప్రతి పలుకు తేనెల మకరందమై కురిసే..
అష్టావధానాలతో ప్రపంచమంతా తిరిగే
శతక పలుకులతో నీతుల వెన్నెల పూయించే
చలన చిత్ర చిత్ర గీతాల్లో మైమరిపించే
విప్లవ గీతాల్లో జ్ఞాన జ్యోతులై వెలిగించేను
Also Read : వెన్నెల వెలుగు