శ్రీకారం
శివునికి త్రినేత్రంలా
కర్షకునికి హలంలా
కవికి కలంలా
గాయకునికి గళం అలా!
శివుడు త్రినేత్రం తెరిస్తే
దుష్టశిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది
కర్షకుడు హలంతో దున్ని
పసిడిపంటలు పండిస్తాడు
కవి కలంతో
చైతన్యపు కవితా సుమాలను పూయిస్తాడు
గాయకులు గళం విప్పి
సుస్వర రాగాలాపన చేస్తారు!
రవి గాంచనిది కవి గాంచును
కవి గాంచినది అక్షరబద్ధమై
పదబంధ కూర్పుతో కవితామాలికై
కవితాత్మక ఎత్తుగడలతో
అత్యద్భుత కావ్య ఖండికలై
సాహితివనంలో కవితా సుమమై విరబూయును
గాయపడిన మనసులకు లేపనాలై
గేయాలుగా ఆవిష్కృతమై
సుమధుర గళం నుంచి సుస్వరమై
పామరులను సైతంపరవశమోనర్చి
మూఢనమ్మకాలను మటుమాయమొనర్చి
చిమ్మ చీకట్లను చీల్చివేసి
విజ్ఞానపు వెలుగులను నలుదిశలా వ్యాప్తి చేసి
సమాజమనే ప్రమిదలో
మానవత్వమనే తైలం పోసి
సామాజిక న్యాయమనే దివ్వెను వెలిగించి
జనులందరిలో సామాజిక చైతన్యాన్ని రగిలించి
ఉవ్వెత్తున ఎగసిపడే ఉద్యమాలకు ఊపిరి పోస్తూ
అణగారిన వర్గాలను అక్కున చేర్చుకుని
సమసమాజ నిర్మాణానికి శ్రీకారం చుడుతూ
సమాజాన్ని ప్రగతిపదంలో పయనింప చేస్తున్నాయి కలాలు గళాలు
ఆధునిక సమాజ పురోగతికై
పునరంకితమౌతున్నారు కవులు గాయకులు.
Also Read : కలం గళమెత్తే