బంగారు మూటే
ఔషదీయుక్తమైన మొక్కలు ఎన్నో
వాటిని సరైన మోతాదులో తీసుకుని
రంగరించి కాచి, ఒడపోస్తేనే అవుతుంది
అనారోగ్యాన్ని బాగుచేసే ఔషధం
ఎన్నో కష్టాలు, మరెన్నో ఆవేదనలు
అంతే సమంగా అనుభూతులు
కలగలిపి అనుభవించిన జీవితాన్ని
నుదుటి మడతల్లో దాచినది పెద్దరికం
వెక్కిరింతల పాలు చేయకుండా
ఆ పెద్దరికానికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తే
ఆ తరం నుంచి ఈ తరం వరకూ
వేస్తుంది తెగిపడని వారధి
మంచి చెడులను సమన్వయ పరుస్తూ
గాజు కన్నుల్లో దాగిన గమకాలకు
రూపాన్ని ఇస్తూ, దారి వేస్తారు పెద్దవారు
పిన్నల అడుగులు తడబడని రాజబాటగా
వటవృక్షమై పెద్దరికం ఇచ్చే నీడ
ఏడేడు తరాలకు విస్తరించే కాంతి వలయం
ఆ బోసినోట వొచ్చిన మాట ఎప్పుడూ
వజ్రాలను పొదువుకున్న బంగారు మూటే
Also Read : మనో మకుటం