మొదటి అడుగు
జీవనయానమ్మునకు జననమెకద మొదటి అడుగు
అమ్మజూపు అనురాగమె జీవనమునకు మొదటి అడుగు
తడబడకను నడకనేర్పు తండ్రియెగద మొదటి అడుగు
గుణవంతుల జేయునట్టి గురు బోధయె మొదటి అడుగు
అక్షరాల ముందుండెడు “అ” నే కద మొదటి అడుగు
తరుమగ తిమిరమును రవికరణమె గదా మొదటి అడుగు
ఏ పయనమ్మునకైనను శ్రీ కారమె మొదటి అడుగు
ఏ కార్యమ్మునకైనను సత్సంకల్పమె మొదటి అడుగు
ఆలుమగల అనుబంధమె సృష్టి గతికి మొదటి అడుగు
ప్రకృతి పరిరక్షణయే ప్రజలకుండు మొదటి అడుగు
హాలికులకు అనుకూలపు తొలకరి పలకరింపె మొదటి అడుగు
ప్రజోపయోగ ప్రణాళికయె పాలకులకు మొదటి అడుగు
సర్వతో ముఖ ప్రగతికి సత్కర్మలె కదా మొదటి అడుగు
మానవ సేవయె గదా మాధవసేవకేయు మొదటి అడుగు
ముక్తి సాధనకు సద్భక్తియె గద మొదటి అడుగు
వేయకున్న మొదటి అడుగు చేరుటెట్లు చివరి వరకు
వేసే మన మొదటి అడుగె చేర్చును గదా గమ్యమునకు
ఆచి తూచి అడుగు వేయ అనుకున్నది సిద్ధించును
అనుకున్నది ప్రాపించిన ఆనందమె ఆనందము
Also Read : తొలికరి
