Favorite Telugu Writer : నచ్చిన తెలుగు రచయిత

నచ్చిన తెలుగు రచయిత

 

గుర్రం జాషువా

ఆ రోజుల్లో కాలం నడుస్తున్న దారులలో మతం మరణ మృదంగం వాయిస్తూంటే,కులం కంచు సంకెళ్ళతో కరాళ నృత్యం చేస్తూంటే, ఆ సమాజ దాష్టీకానికి బలి అయిన వెలివాడల వీధిలో ఉదయించాడు ఓ సూర్యుడు.

అంటరానితనం ముసుగు కప్పి అంధకారంలోకి నెట్టిబడిన అణగారిన వర్గాల జీవితాల్లో అక్షర వెలుగులు నింపి నవయుగానికి నాంది పలికిన దిగ్విజయ ధీరోత్తముడు.

ఎదుర్కున్న అవమానాలను ఎదిరించి భావకవిత్వ పునాదులపై సామాజిక కవిత్వం గోడలు నిర్మించి అస్పృశ్యత అంటరానితనపు వర్గాల కోసం ఆక్షర ఆశయ సౌధాలను నిర్మించిన నవయుగ కవితా చక్రవర్తి.

ముట్టుకుంటే మైలపడతారనే సమాజ మానసిక వైకల్యాన్ని జయించి అగ్రవర్ణాల నుండి పాదాలకు గండపెండేరం తొడిగించుకున్న ఘనకీర్తిధనుడు.
అతడే సామాజిక రుగ్మతలను రూపుమాపి సమాజం కోసం వైవిధ్యమైన సరళ సాహిత్యాన్ని అందించి, నిమ్నవర్గాల కోసం నిరంతరం పాటుపడి, కవికోకిలగా, నవయుగ కవితా చక్రవర్తిగా ఎదిగిన తెలుగు సాహిత్య శిఖరం గుర్రం జాషువా.

తెలుగు సాహిత్యంలో విలక్షణ పంథాను సృష్టించిన గుర్రం జాషువా 1895, సెప్టెంబర్ 28 న గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకోవడం అందులో తన తల్లి నిమ్న వర్గంకు చెందిన వారు కావడంతో బాల్యంలోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.

తోటి పిల్లలతో ఆడుకోనిచ్చేవారు కాదు. చిన్నచూపుతో చూసేవారు. ఈ పరిస్థితుల ప్రభావం జాషువా పై బలంగా పడింది.గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఒంటరిగా సాగిన బాల్యం బడికెళ్ళాక అసలు కష్టాలు మొదలయ్యాయి. చదువు మీద ఆసక్తి ఉన్నను ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు.అయిన జాషువా లోని చదువు పై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.

అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడేవాడు వాళ్ళను ఎదిరించేవాడు 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. ఉన్నత చదువు పూర్తయ్యాక మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915 లో అక్కడ సినిమా వాచకుడిగా ఒక సంవత్సరం పనిచేశారు.

టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని.కొంతకాలం సత్యవోలు గున్నేశ్వరరావుగారి ‘ చింతామణి నాటక మండలి ‘ లో నాటకకర్తగా పనిచేశారు. తరువాత గుంటూరులోని లూథరన్ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసాడు.

‘ ఉభయ భాషా ప్రవీణ ‘ పట్టం పుచ్చుకొన్న జాషువా గారు 1928-42 మధ్య గుంటూరు జిల్లా బోర్డు పాఠశాలల్లో తెలుగు పండిత పదవి సాగించారు .1942-45 మధ్య బ్రిటీష్ ప్రభుత్వ యాజమన్యంలో భారత ప్రభుత్వం నెలకొల్పిన జాతీయ యుద్ధ ప్రచారక సంఘంలో ప్రచారకులుగా పనిచేశారు. 1957 నుండి రెండు సంవత్సరాల పాటు మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.

చిన్నప్పుడు వినుకొండలో కొప్పరపు సుబ్బారావుగారి అవధానం విన్నాడు. అవధానం ముగిసిన తర్వాత కొందరు కవులు అవధానిని ప్రశంసిస్తూ పద్యాలు చదివారు. బాలజాషువా కూడా పద్యాలు వ్రాసుకొని, చదవటానికి వేదిక నెక్కాడు. ‘ అంటరాని వారు వేదిక ఎక్కడమా? పద్యాలు వ్రాయడమా? ‘ అని తరిమి వేయటం జాషువా ను ఎంతగానో కృంగదీసింది. దీంతో జాషువా అకుంఠిత దీక్షతో కావ్యరచనకు
పూనుకున్నాడు.

చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది.తన బాల్య స్నేహితుడు, తరువాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమంతు శాస్త్రి వద్ద మేఘసందేశం, రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు.

సాహిత్యం ఓనమాలు నేర్చుకున్నాక తన కలానికి ,తనలోని భావాలకు, తను చూసిన కుల, మత వాస్తవికతనూ అంటరానితనాన్నీ, అంధవిశ్వాసాలనూ, పేదరికాన్నీ, దోపిడీనీ, స్త్రీల పీడనాన్ని శక్తిమంతమైన కవిత్వంగా మలిచాడు. ప్రకృతి మీద, పిల్లల మీద, ప్రేమా, కరుణల వంటి విలువల మీద, కళల మీద, మానవ అశాశ్వతత్వం మీద, మరణం మీద ఇలా విభిన్న అంశాల మీద వైవిధ్యపూరితమైన కవిత్వం రాశాడు.

అన్ని తరహాల పాఠకులు ఆకర్షించే వస్తు విస్తృతి జాషువా సొంతం. అస్పృశ్యులు పండించే ధాన్యం ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కాని ఆ ధాన్యం పండించే కృషికులకు ఆలయ ప్రవేశం కూడా లేదు అంటూ తన అనుభవించిన ఆవేదనను సమాజం అవలంబించే సామాజిక రుగ్మతలపై ఘాటుగా స్పందించాడు.

నిచ్చెనమెట్ల కుల సమాజంతో మనుషుల్ని ఎక్కువ తక్కువలుగా విభజించి, పంచములకు ఆహారాన్నీ, ఆత్మగౌరవాన్నీ, మనిషితనాన్నీ నిరాకరించిన ఈ దేశం భయంకరమైనదని బాధతో ధర్మాగ్రహాన్ని వెలిబుచ్చాడు.దళితుల గురించి దేశమూ, దళితేతరులూ ఏమనుకుంటున్నారనేది కాదు, దేశాన్ని గురించీ, తమను నిత్యం పీడిస్తున్న కులాల పౌరుల గురించీ దళితులు ఏమని అనుకుంటున్నారనేది ఇక్కడ ముఖ్యంగా వ్యక్తం చేశాడు.

అందుకే ఈ వ్యవస్థ గురించి సంప్రదాయ కవులూ, మేధావులూ, నాయకులూ అల్లిన పవిత్ర భ్రమల్నీ,కట్టుకథల్నీ భగ్నంచేసి వాటి వెనకవున్న నిజాల్ని వెల్లడిచేయటంలోనే జాషువా ప్రత్యామ్నాయ దృక్కోణం ఉంది.

దళితుల్ని అంటరాని వాళ్లుగా కసరి కొడుతూ ఆకలితో అలమటింపజేసిన హైందవ సంస్కృతిని గాఢమైన కవితాభివ్యక్తిలో వర్ణించారు. కులవ్యవస్థ కారణంగా దేశాన్ని విమర్శించినప్పటికీ, తన దేశప్రేమను జాషువా దాచుకోలేదు. బుద్ధుడినీ, గాంధీనీ, అంబేడ్కర్నూ ప్రేమిస్తూ పద్యాలు రాశాడు. నేతాజీ, శివాజీల మీద కావ్యాలు రాశాడు.

దేశ స్వాతంత్య్ర అవసరాన్ని ఆకాంక్షించాడు. దళితుల్ని అగ్రకులస్తులు పీడించటాన్ని విమర్శించి ఊరుకోకుండా దళితుల్లో సఖ్యత లేనితనాన్ని కూడా ఎద్దేవా చేశాడు. ఈనాటి దళిత రాజ్యాధికార భావనను ఆనాడు పలికించాడు.

కులమతాల విమర్శతోనూ వేదనతోనూ ఆగిపోకుండా స్త్రీల పీడననూ ఎత్తిచూపాడు.శ్మశానం మీద రాసిన పద్యాలతో మానవ జీవితాన్నీ, మరణాన్నీ తాత్వీకరించాడు. ఇక్కడ అస్పృశ్యత సంచరించుటకు అవకాశం లేదు లాంటి బలమైన భావాల్ని శ్మశానానికి ఆపాదించాడు. ఇంత గంభీర కవిత్వం రాస్తూనే, మరొకపక్క జీవితంలోని అందాల్నీ, ప్రకృతి సౌందర్యాన్నీ కవిత్వంలో సున్నితంగా ప్రతిభావంతంగా గిజిగాడు రచనలో పండించాడు.

ఈ విధంగా విభిన్నత నుంచి విశ్వజనీనతను చేరుకున్న కవిత్వం రాయడం ద్వారా ‘విశ్వ నరుడ్ని నేను’ అని సగర్వంగా ప్రకటించుకోగలిగాడు. ‘గబ్బిలం’, ‘పిరదౌసి’, ‘అనాథ’, ‘నేతాజీ’, ‘క్రీస్తు చరిత్ర’ ‘ముసాఫరులు’తో సహా 38 కవిత్వ గ్రంథాలను అందించాడు. ఇవి కాక వ్యాసాలూ, జాబులూ తదితర రచనలూ చేశాడు.

ఇతని రచనలు దీనుల పట్ల, సంఘం అణచివేసిన వారి పట్ల అపారమైన సానుభూతితో సాగాయి. జాషువా గారు సంఘ సంస్కరణ ఆయన కావ్య లక్ష్యం, ఆకలిని శోకాన్ని నిర్మూలించాలన్నదే ఆయన ధ్యేయం, అంధ విశ్వాసాలను, మత విద్వేషాలను తీవ్రంగా నిరసించారు. చిత్తశుద్దిలేని పెత్తందార్లను, గుత్తస్వాములను నిలదీసి తన కలంతోనే ప్రశ్నించాడు.

తెలుగు సాహిత్యంతో సమాజం నిమ్న వర్గాల పట్ల అవలంబించిస్తూన్న నడకను, నడవడికను కాచి వడపోచిన జాషువాకుతన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు 1964లో తను రచించిన క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.

1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. 1970లో భారత ప్రభుత్వం మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ పురస్కారం
లభించింది.

తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు. పలు పురస్కారాలతో పాటు కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ – నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధిగాంచాడు.

వెలుగుల లోకం లోకి కళ్ళు తెరవగానే అవమానాలే ఆహ్వానం పలికాయి.ఎదురైన అవమానాల ఆవేదన నుండే ఆలోచనలు ఉద్భవించాయి. ఆ ఆలోచనలే చరిత్రను తిరగరాసాయి.

అణగారిన జాతుల ఆవేదనను, అనుభవించే కరడుగట్టిన దారుణాలను అక్షరాలతో ఎండగట్టాడు.సమకాలీన కవిత్వ భావ కవిత్వ రీతిని బహిష్కరించి సామాజిక ప్రయోజన కవిత్వాన్ని చీకటి జీవితాలపై ఆవిష్కరించిన అక్షర సూర్యుడు.ఆనాడే ప్రసరించిన అక్షర కిరణాలు నేటికి కుడా ఎంతోమంది జీవితాల్లో నిరంతరం కొత్త వెలుగులు ప్రకాశిస్తూనే ఉంటాయి.ఆ వెలుగులలో మహానీయుడు గుర్రం జాషువాకి ప్రణామాలతో.

Also Read : మిమ్మల్ని ప్రభావితం చేసిన సినీ నటుడు/నటి

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!