Family Relationship : బంధం

బంధం

 

బంధం

పద్మిని, రమణలకు పెళ్ళయి ఐదు సంవత్సరాలయింది. ఈ అయిదు సంవత్సరాలు క్షణాల్లా గడచి పోయాయి. వారి మధ్య మూడో వ్యక్తి మూడేళ్ళ ముద్దుల కొడుకు సాకేత్, తన ముద్దు ముద్దు మాటలతో వారి మధ్య సున్నితమైన ప్రేమానురాగాలు అల్లుకున్నాయి.

హాయిగా ఆనందంగా సాగిపోతున్న ఆ సంసారంలో ఉన్నట్టుండి పెను తుఫాన్ చెలరేగింది. తాత రఘురామయ్య అంటే సాకేత్ కి వల్లమాలిన ప్రేమ. తల్లిదండ్రుల దగ్గర లేని చొరవ తాతయ్యల దగ్గరుంటుంది కాబట్టి. అమ్మానాన్నల నడుమ సాకేత్ గడిపే సమయం తక్కువ. ఎందుకంటే, ఇద్దరూ ఉద్యోగస్థులు కావడం వలన.

ఎన్ని బంధాలున్నా తాతతో ఉండే బంధం ప్రత్యేకమైనది. ఎందుకంటే వారు మన సంస్కృతీ సాంప్రదాయాలను, విలువలను తెలియజెప్పి, తమ జీవితానుభవంతో మనిషిగా ఎలా మసలుకోవాలో చెబుతారు. వచ్చీరాని ముద్దు ముద్దు మాటలతో తాతకు ఎక్కడలేని శక్తిని ఇవ్వగలుగుతాడు మనవడు.

తాత, మనవడు మధ్య అనురాగబంధాన్ని చూసిన పద్మిని తట్టుకోలేకపోయింది. ఎక్కడ కొడుకు తనకు దూరం అవుతాడోనని మదనపడసాగింది. ఆమె ముఖంలో వున్న ప్రశాంతత స్థానంలో కోపం చోటుచేసుకుంది. రాను రాను తాతే సర్వస్వం అనే విధంగా సాకేత్ ప్రవర్తించడం ఆమె జీర్ణించుకోలేక పోయింది.

‘ఈ ముసలాయన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. మనకు మన కొడుకును దూరం చేస్తున్నాడు’ అని వేరు కాపురం పెట్టడానికి రమణ పైన ఒత్తడి పెంచింది. రమణకు భార్య మాటే వేదం.ఆమె చిప్పినట్టు వినకపోతే ‘చస్తానని’ బెదిరిస్తుంది. ఫలితంగా రఘురామయ్యను ఒంటరివాడ్ని చేసి వేరు కాపురం పెట్టారు. ఎంతో అన్యోన్యంగా వున్న తాత-మనవాడ్ని వేరు చేశారు.

తాత మనవడు బంధం శాశ్వతమే కానీ, వాడితో కలిసుండే అవకాశం శాశ్వతం కాదని రఘురామయ్య తెలుసుకున్నాడు. పక్కమీద వాలినా నిద్ర రావడం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచనలెన్నో కందిరీగల్లా అతన్ని చుట్టుముట్టాయి.

పెద్దలకు ఇచ్చే మర్యాద ఇదా? ఆక్రోశించింది మనస్సు, గుండె చెరువయ్యింది.ఆయన కళ్ళల్లో నీళ్లు తెరలు కట్టాయి.పెద్దలంటే గౌరవం లేదు. కుటుంబసభ్యులను ప్రేమగా పలకరించాలనే ఇంకిత జ్ఞానం లేదు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్న కొడుకుల కథలు ఈ రోజుల్లో సర్వసామాన్యంగా వినిపిస్తున్నాయి. పెళ్లికాక ముందు పులిగా ఉండే కొడుకు, భార్య రాగానే పిల్లిలా మారిపోయాడు. భార్య ముందు నోరెత్తటం మానేసి, బుద్దిగా ఆమె చెప్పేది వినటం నేర్చుకున్నాడు.

తన గురించి తాను పట్టించుకోకుండా తన వారసుల సంతోషం కోసం కష్టపడి సంపాదించాడు రఘురామయ్య. సకలభోగాలు తన వారసులకు అందించి తను మాత్రం సాధారణ జీవితం గడపసాగాడు.

చిన్నప్పుడు కన్నకొడుకుతో ఆడుకుని, వాడు అడుగులు వేస్తే ఆనందించే తను,ఈ వయసులో తన కొడుకు చేయూత ఇవ్వనంటున్నాడు.కన్నకొడుకు సహకరించకపోయినా దిగులు పడకూడదనుకున్నాడు.

అయితే తన ప్రాణమైన మనవడు దూరం కావడంతో ఇబ్బంది పడసాగాడు. ప్రతి నిమిషం వాడి గురించే ఆలోచిస్తూ, వాడి గురించే ఆదుర్ధాపడుతూ మానసికంగా క్రుంగసాగాడు.వాడ్ని చూడకుండా ఉండలేక ఓ రోజు కొడుకు ఇంటికెళ్ళాడు.

“అమ్మా! లోనికి రావచ్చా?” నీళ్ళు నిండిన కళ్ళతో రఘురామయ్య అడగడంతో, దారికి అడ్డుగా ఉన్న పద్మిని పక్కకు తప్పుకుని లోపలికి రానిచ్చింది. రఘురామయ్య లోపలికి రాగానే ఆయన కాళ్లమీద పడి ఏడ్చేసింది పద్మిని.

ఎడబాటు కారణంగా కలిగిన భావోద్రేకమో లేదా మరింకేమైనా కారణం ఉందో రఘురామయ్యకు అర్థం కావడం లేదు.మనసులో భారం తగ్గేదాకా ఏడ్వసాగింది. రఘురామయ్యకు అర్థం కాకపోవడంతో బెడ్రూలో పడుకునివున్న మనవడి దగ్గరకి వెళ్ళాడు.

సాకేత్ అస్థిపంజరంలా మూసిన కళ్ళు మూసినట్లే బెడ్ మీద పడి ఉన్నాడు. ఆ స్థితిలో మానవాడ్ని చూసిన రఘురామయ్యకు దుఃఖం ముంచుకొచ్చింది. ‘సాకేత్, నాన్న సాకేత్’ అంటూ పిలుస్తుంటే, కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.

తాత పిలుపు విన్న సాకేత్ మెల్లగా కళ్ళు తెరిచాడు.ఎదురుగా తనకిష్టమైన తాతను చూడగానే పెదవులపైన చిరునవ్వు మెరిసింది. ఎక్కడలేని శక్తిని తెచ్చుకుని తాతను అల్లుకుపోయాడు.దుఃఖం ఎగతన్నుకొచ్చి చాలాసేపు ఏడుస్తూ తాతను వదలలేదు.

ఆ గదిలో కొద్దిసేపు నిశ్శబ్ధం అలుముకుంది. ఆ గదిలో మనుషులు ఉన్నా, మనసువిప్పి మాట్లాడుకోవటానికి ఏవో తెరలు అడ్డు పడుతున్నాయి. “నాన్న! సాకేత్ ఇలా కావడానికి పద్మిని తొందరపాటే కారణం.

మనోవ్యాధికి మందులేదని సాకేత్ విషయంలో రుజువయింది. మమ్మల్ని క్షమించండి నాన్న! ఈరోజే మనింటికి వెళ్దాం” తన మనసులోని ఆవేదనను తెలియజేశాడు రమణ. కొడుకు, కోడలులో వచ్చిన మార్పుకు సంతోషించాడు రఘురామయ్య. వారం రోజుల్లో పూర్తిగా కోలుకొని మామూలు మనిషి అయ్యాడు సాకేత్.

Also Read : నా జీవన యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!