Emotional Story : ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న అమృతకి ఉదయం జరిగిన సంఘటనే కళ్ల ముందు కదులుతూ కలవరపెడుతుంది.ఆమెలోని ఆవేదన కన్నీళ్లలా మారి బయటకు వస్తున్నాయి. మనసంతా భారంగా బాధగా ఉంది. ఏంచేయాలో ఎలా రేపటిని ఎదుర్కోవాలో అర్ధంకాక సోఫాకి చేరబడి కన్నులు మూసుకుంది.
అమ్మ చేతి స్పర్శ ఇచ్చిన స్వాంతనతో కళ్ళు తెరిచిన అమృతను చూసి ఎదో జరిగిందని గ్రహించిన అమృత తల్లి కాత్యాయనీ అమృతను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. కమ్మని కాఫీని ఇచ్చి అమృత కుదుటపడి కాఫీ తాగేవరకు ఎదురుచూసిన తల్లిని చూసి ఆమెకు జరిగింది చెప్పాలని అనుకుంటుంటే ఉదయం జరిగిందంతా ఆమె కళ్ళ ముందు కనిపించింది.
ఉదయమే లేచి రోజు కంటే తొందరగా రెడీ అవుతున్న కూతురిని చూసి ఏంటి ఈరోజు తొందరపడుతున్నావ్? ప్రత్యేకంగా కూడా రెడీ అయ్యావ్? ఏంటి సంగతి? అని ప్రశ్నించింది.అయ్యో అమ్మ మర్చిపోయావా!ఈరోజు రిపబ్లిక్ డే కదా! స్కూల్లో జెండా వందనం ఉంటుంది. తొందరగా వెళ్ళాలి అని చెప్తుంది. త్వరగా టిఫిన్ తిని ముందు రోజు తెచ్చుకున్న సామాన్లతో బడికి చేరింది. మిగతా ఉపాధ్యాయుల సహకారంతో జెండా కట్టింది. పిల్లలు ఒక్కొక్కరుగా అందరూ వచ్చేసారు.
పాఠశాల కమిటీ సభ్యులు కూడా రావడంతో వారిని ఆహ్వానించి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి జెండాను ఎగరవేసింది. పిల్లలు చక్కని పాటలు పాడి అలరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెట్టిన వివిధ పోటీలలో గెలుపొందిన వారికీ బహుమతులు ఇచ్చారు. వచ్చిన పెద్దవారికి, పిల్లలకి స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచి పెట్టారు. ఒక సంతోషకరమైనా వాతావరణంలో కార్యక్రమం పూర్తయింది.
అందరూ వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో గ్రామ సర్పంచ్ రాయుడుగారు మంది మర్భాలంతో కారులో దిగారు. వచ్చి రావడమే అమృతను ఉద్దేశించి ఏమమ్మా జెండా వందనానికి మమ్మల్ని ఆహ్వానించలేదు? జెండాను ఎగరవేసే హక్కు నాది కదా! మిగిలిన పాఠశాలల్లో నేనే ఎగరవేశాను. ఇక్కడ నువ్వు కొత్త నియమాలు పెట్టి కార్యక్రమం చేస్తున్నావా? గ్రామ సర్పంచుకు నువ్వు ఇచ్చే గౌరవం మర్యాద ఇదేనా అంటూ మాటల దాడి మొదలుపెట్టాడు. అమృత ఇది ఊహించలేదు.
ఎంతో గౌరవింపబడుతున్న చోట ఆమెకు ఇలా జరగడం మింగుడు పడకపోయినా అమ్మ నేర్పిన సంస్కారం, చదువు నేర్పిన విజ్ఞతతో దయచేసి విషయం ఏమిటో లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం రండి వచ్చి స్కూలులో కూర్చోండి అని ఆహ్వానించింది. అయితే రాయుడుగారి అనుచరులు కార్యక్రమానికి పిలవకుండా ఇప్పుడు గౌరవం ఎందుకమ్మా అంటూ ఎగతాళి చేశారు.
అయినా లోపలికి వచ్చి మాట్లాడేదేమిలేదు ఇక్కడే విషయం తేల్చు అంటూ ఏకవచనంతో మాట్లాడారు. అక్కడి వారంతా మౌనంగా జరిగేది చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా స్పందించి మాట్లాడలేదు. వారందరిని ఒకసారి చూసిన అమృత “సర్పంచ్ గారు గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేసే హక్కు ఆ కార్యాలయ ఉన్నత అధికారికి ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రజా ప్రతినిధులది.
అందుకే కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాతే మా పాఠశాల ఆవాస ప్రాంత జనాల మధ్య మాత్రమే చేయాలని నిర్ణయించి ఏ విధంగా చేసాం” అని వివరిస్తుంది. “అయితే ఈ విషయాలేవి తెలియకా నీకంటే పెద్దవారు కూడా నన్ను ఆహ్వానించి జెండా ఆవిష్కరణ చేయించారు “అని వెటకారంగా అన్నాడు. ప్రభుత్వం ఏంచెప్పిందో నాకు అనవసరం.
ఎప్పటి నుండో ఈ గ్రామం లోని ప్రతీ పాఠశాలలో జెండా వందనం సర్పంచ్లే చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తూ ఊరుకోను అంటూ అమృతకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వెనకాలి అనుచరగనం తలోక మాట అనుకుంటూ వెళ్లిపోయారు. అక్కడ ఉన్న పెద్దలు అతను అంతేలేమ్మా నువ్వు బాధపడకు అంటూ వెళ్లిపోయారు. ఇదేనమ్మ జరిగింది.
ఈరోజు నాకు జరిగిన అవమానం నాకు కాదమ్మా అక్షరానికి, విజ్ఞతకు జరిగినట్టుగా అనిపించింది. ఏమి తెలియక పోయిన,అక్షరం ముక్క రాకపోయినా పదవి ఉందన్న అహం తోనే అతను అలా ప్రవర్తించాడు. చదువుకు, చదువు నేర్పే గురువుకు ఇచ్చే గౌరవం ఇదేనామ్మా అంటూ తల్లీ ముందు తన ఆవేదనను చెప్పింది.
కూతురి బాధను, ఆవేదనను అర్ధం చేసుకున్న కాత్యాయని ఆమెను ఓదార్చి “ఈ రోజుల్లో అధికారం ఉంటే అహంకారం పెట్టని ఆభరణం లాంటిదమ్మా. పదవిలో ఉన్న అయిదు సంవత్సరాలు పూర్తిగా అజమాయిషీ చేయాలనుకుంటున్నారు. ఇలాంటివారిని ఉద్దేశించే అ ఆ లు రావు కానీ అగ్రతాంబూలం కావాలన్నాడట అనే నానుడి వచ్చింది. ఇలాంటి వారికి ఏమి తెలియక పోయినా అన్నిటిలో తామే ముందు ఉండాలని, అందరూ తమనే గౌరవించాలని ఆశిస్తారు. స్వార్ధం మాత్రమే ఉందమ్మా ఈరోజుల్లో. ఇలాంటి మాటలు పట్టించుకుని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు.
నువ్వు చేసిన పని సరైనది అయినపుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భాద అసలే వద్దు తల్లి అని కూతురుకి చెప్పింది. అమ్మ మాటలు అమృతకి ఎంతో ఊరట నిచ్చాయి. ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న తాను ఇంత చిన్న విషయానికి బాధపడకూడదని నిర్ణయించుకుంది. కష్టపడి పని చేసి ఇలాంటి వారి ముందే ఎదిగి ఉన్నతంగా, ఆదర్శంగా నిలవాలని తన భవిష్యత్కు ఈ సంఘటన పునాది కావాలని నిశ్చయించుకుంది. ఉత్సాహంతో లేచి రేపటికోసం కొత్త ఆశతో ఎదురుచూస్తుంది.
Also Read : అణుకువ