Children Stories : మార్పు

మార్పు

 

మార్పు

“తాతయ్య,నాకొక కథ చెప్పవూ,” అంటూ గారంగా అడిగాడు బంటి వాళ్ళ తాతయ్యను.

“మాథ్స్ హోమ్ వర్క్ ఉందని అన్నావుగా బంటి!మొదట అది ఫినిష్ చెయ్..ఆ తర్వాతే కథ “అన్నాడు తాతయ్య నిక్కచ్చిగా.

“నా ఫ్రెండ్ చేర్రిగాడు ఆల్రెడీ హోమ్ వర్క్ ఫినిష్ చేశాడట.వాడి దగ్గర్నుండి కాపీ చేసుకుంటాలే గానీ నువ్వు కథ చెప్పు తాతయ్య!”అన్నాడు కాస్త మొండిగా!

కరోనా పుణ్యమా అని పిల్లలంతా సోమరులుగా తయారయ్యారు.పాపం వాళ్ళనని ఏం లాభం ఎలాగూ కథ అడుగుతున్నాడు కాబట్టి,అదేదో సోమరితనం గురించే కథ అల్లి చెబితే పోలా అని మనసులో మదనపడిన తాతయ్య “సరే”!అంటూ కథ మొదలు పెట్టాడు.

” అనగనగా ఆనంది అనే చిన్న రాజ్యం ఉండేది. అనుకోకుండా ఒక రోజు ఆ రాజ్యానికి పెద్ద ఆపద వచ్చింది. పక్క దేశపు రాజు తమ పైన దండెత్తి వస్తున్నాడు అని వర్తమానం అందింది. కావలసినంత సైనిక బలం లేని ఆనంది రాజ్యం ఆ వార్త విని తల్లడిల్లిపోయింది.

ఇరవై నుండి నలభై ఏళ్ల లోపు ఉన్న ప్రతి పురుషుడు యుద్ధంలో పాల్గొనాలని రాజు చాటింపు వేయించాడు. అడవిని ఆ రాజ్యంలో నివసించే దిలీపుడనే పాతికేళ్ల సోమరిపోతుకు గుండెల్లో రాయి పడ్డట్టయ్యింది.

సైనికుల కంట పడకుండా అడవిలోకి వెళ్లి, ఒక పెద్ద చెట్టు తొర్రలో దాక్కున్నాడు.ఇంతలో గుర్రపు డెక్కల శబ్దం వినిపించి భయంతో ఇంకా లోపలికి వెళ్లే క్రమంలో విచిత్రంగా అందులో ఉన్న ఒక పెద్ద అగాధంలోకి పడిపోయాడు. అతని అరుపులు చెట్టు తొర్రను దాటి ఎవరికీ వినిపించలేదు.

యుద్ధానికి భయపడి పారిపోతే ఈ విధంగా చనిపోవాల్సింది వస్తుంది అని ఎంతో వగచి కళ్ళు మూసుకొని దేవుని తలుస్తూ ఉండిపోయాడు.అలా పడడం పడడం ఒక పెద్ద వలలో పడిపోయాడు.

కళ్ళు తెరిచి చూస్తే ఒక పెద్ద వింత జంతువు ఏదో తనను తినటానికి తన వైపు రావటం కనిపించింది. పారిపోవడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఇంతలో దేవుడు పంపినట్టుగా ఒక పక్షిలాంటి ఆకారం ఎక్కడినుండో వచ్చి అతన్ని కాళ్లతో ఎత్తుకెళ్లి పోయింది.

దిలీపుడు తనను మింగడానికి వచ్చిన వింత జంతువును పరకాయించి చూసాడు.అది ఒక పెద్ద సాలీడు!అంటే తాను పడ్డది వలలో కాదు, సాలే గూటిలో అని అర్థం కాగానే ఒక్కసారిగా మతిపోయింది దిలీపుడికి. తనను తీసుకెళుతుంది ఎవరా అని చూశాడు. అదో సీతాకోకచిలుక!

” మిత్రమా నా నోటి దగ్గర కూడు లాగేయడం మీకు భావ్యమా?” అంటూ అరిచింది సాలీడు.”తాను భూలోకం నుంచి వచ్చిన అతిథి! నీకు ఆహారం కాదు”అంటూ సీతాకోకచిలుక దిలీపున్ని ఒక సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి దింపింది.

ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ” ఓ సీతాకోకచిలుక! ఇదేమీ లోకం? మీరంతా మనుషుల కన్నా పెద్దగా ఉన్నారెంటి? మీకు మాట్లాడటం ఎలా సాధ్యపడింది?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు దిలీపుడు.

” ఇది మాయాలోకం ఇంతకుమించి మా లోకం గురించి మేము అన్యులకు చెప్పకూడదు” అంది సీతాకోకచిలుక.

” నువ్వు నా ప్రాణాలు ఎందుకు రక్షించావు? కనీసం అదైనా తెలుసుకోవచ్చా!” అని అడిగాడు దిలీపుడు.

” ఒకరికొకరు సహాయం చేయకుండా తప్పించుకు తిరగడానికి మేము మీలా మనుషులం కాదు కదా” అంటూ పగలబడి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సీతాకోకచిలుక.

తన పక్కనే గుంపులుగా పని చేసుకుంటున్న చీమలను చూశాడు దిలీపుడు. పలకరించ పోయాడు.” మా సమయాన్ని వృధా చేయకు “అంటూ కసురుకొని వెళ్లిపోయాయి అవి.

అంతలో ఒక పెద్ద సర్పము వాటి స్థావరాన్ని ఆక్రమించుకోబోయింది. వెంటనే ఆ చీమలన్నీ కలిసికట్టుగా దాని పై దాడి చేసి కొన్ని గంటల్లోనే దాని ప్రాణం తీశాయి.ఆశ్చర్యపోయిన దిలీపుడు “అంత పెద్ద సర్పాన్ని చూస్తే మీకు భయం వేయలేదా?” అని అడిగాడు.” పనులు తప్పించుకోవటానికి, పిరికితనంతో దాక్కోవడానికి మేము మనుషులం కాము” అంటూ వెక్కిరింతగా నవ్వుతూ అవి తమ పనుల్లో మునిగిపోయాయి.

సిగ్గుతో ప్రాణం పోయినంత పనయింది దిలీపునికి. ఎలాగోలా ఆ మాయలోకం నుండి బయటపడి, భూమి పైకి చేరుకున్నాడు. వెంటనే సైనిక విధుల్లో చేరి, తన వీరత్వాన్ని ప్రదర్శించి శత్రువులను తరిమికొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆ క్షణం నుండి సోమరితనాన్ని పూర్తిగా వదిలి పెట్టాడు దిలీపుడు.

కథ అయిపోయింది ఇప్పుడు చెప్పు ఈ కథ వల్ల నువ్వేం నేర్చుకున్నావ్?”అని బంటిని ప్రశ్నించాడు తాతయ్య.
“సూపర్ స్టోరీ తాతయ్య! ఐ లవ్డ్ ఇట్ లేజినెస్ ఎంత చెడ్డదో నాకు అర్థమయ్యింది.ఈ రోజు నుండి నా హోమ్ వర్క్ నేనే చేసుకుంటా, బై తాతయ్య!” అంటూ తన రూమ్ లోకి పరిగెత్తుతున్న మనమడిని చూసి తృప్తిగా నవ్వుకున్నాడు తాతయ్య!

Also Read : దూరపు కొండలు

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!