Child Girl Story : సరసి

సరసి

 

సరసి

ఒకప్పుడు పచ్చని పొలాలతో కళకళలాడిన గ్రామం పోచారం. పట్టణాల పట్టుకు వలసపోయిన జనాలతో ఊరు వెలవెలాబోతుంది ఇప్పుడు. నేలంతా బీడు పడిపోయి ఉంటే, గట్ల వెంబడి  ఎండిపోతున్న వృక్షాలు రక్షణ ఇవ్వలేని సైనికుల్లా మోడులై ఉన్నాయి.

తండ్రి నుంచి సంక్రమించిన రెండు ఎకరాల పొలాన్ని, చిన్న పాకలాంటి ఇంటిని నమ్ముకుని బ్రతుకు ఈడుస్తున్నాడు సాయన్న. అతని భార్య యాది తెలివైనది. పొలంలో వేసే పంట మత్ర్లమే కాక చుట్టూ కూరగాయల మొక్కలు పెంచుతూ వాటికి కాసే కూరగాయలను బుట్టలో పెట్టుకుని అమ్ముకుంటూ వచ్చే డబ్బులతో ఇల్లు నడుపుతూ ఉండేది.

నీళ్ళ ఎద్దడి ఉంటే మాత్రం ఇక వారికి ఉపవాసాలే శరణ్యం అయ్యేవి. ముగ్గురు ఆడపిల్లలతో వారి జీవితం దుర్బరంగా ఉండేది.పెద్దకూతురు సరసి తల్లి పోలికలతోనే కాదు తెలివినీ పంచుకుని పుట్టింది. ఆ ఊరిలోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెపుతున్న మాస్టారితో తనకు కూడా చదువుకోవాలని ఉంది అని అయిదేళ్ళ వయసులోనే అడిగేసింది.

ఆ పిల్ల ఆరాటానికి ముచ్చట పడిన మాస్టారు సాయన్న దంపతులకు చదువుకోవడం వలన వచ్చే జ్ఞానం గురించి సవివరంగా చెపుతూ వారిని ఒప్పించి సరసిని బడిలో చేర్చుకున్నాడు.

ఆ అమ్మాయి చదువు బాధ్యత తనదే అని చెప్పారు.చురుకైన పిల్ల కావటం వలన ఒక సారి చెపితే చాలు ఏదైనా ఇట్టే పట్టేసుకుని నేర్చుకునేది. దానితో బడిలోని పంతుళ్లందరికి ఎంతో ప్రియమైనదిగా మారింది.

చూస్తూ ఉండగానే పదవతరగతికి వచ్చేసింది. చెల్లెళ్లను కూడా బడిలో చేర్పించింది. తన తరవాత చెల్లి కమలికి చదువాలంటే బద్దకం. ఇంటి పనులు చూసుకునేది. చదవనని కరాకండిగా చెప్పేసింది. చివరిది చిన్నది అయిన బాలికి అయిదేళ్లు.. ఇప్పుడిప్పుడే ఉత్సాహంగా బడికి వెళుతుంది.

ఆ గ్రామంలో ఉన్న కొద్దిపాటి రైతులు అందరూ కలిసి నీటి నిలువ కోసం బావి తవ్వుకున్నారు. వానలు ఎక్కువ పడినప్పుడు నీరు చేరి తరువాతి సమయంలో వారి అవసరానికి పనికి వస్తుంది నీరు.సాయన్న దంపతులు ఈ ఏడు వర్షాలు బాగా కురవడంతో మంచి దిగుబడి ఆశించి పంట వేశారు.

ఎప్పటిలాగానే యాది కూరగాయ మొక్కలు, మరి కొంత స్థలంలో బంతిపూల నారు వేసింది. బంతి మొక్కలు పంటతో పాటు ఏపుగా పెరిగి గుత్తులుగా పూవులు పూయసాగాయి.పచ్చని పైరు, పసుపు రంగులో ముద్దబంతి పూవులు, మరో ప్రక్క కోతకు వస్తున్న కూరగాయలు… తమ పొలాన్ని చూసుకుంటూ సంతోషించారు సాయన్న దంపతులు.

అన్నీ సక్రమంగా జరిగితే అది జీవితం ఎట్లాగ అవుతుంది? నిజమే కదూ! మనుష్యులు కష్టించి పని చేయగానే ఫలితం ఇచ్చేస్తే దేవుడిని ఎవరు పూజిస్తారు? ఉన్నట్టు ఉండి కడుపు నొప్పి అంటూ గిలగిల లాడిపోతున్న సాయన్నను దగ్గరలేని ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది యాది.

పరీక్షలు చేసిన వైద్యులు పెద్దసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ఏమి పాలుపోక వాళ్ళ ఊరికి దగ్గరే అయిన పట్నం తీసుకుపోయి చూపించింది. అన్నీ పరీక్షలు చేసి చివరికి అతనికి లివర్ కాన్సర్ తేల్చి చెప్పారు డాక్టర్లు.కుప్పకూలిపోయింది యాది. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్న సంసారం.

ఆపరేషన్ చేయించాలంటే లక్షల్లో కర్చు. పెద్ద కూతురికి పదోతరగతి పరీక్షలు మరో రెండు వారాలలో.గుండె చెరువు గట్లు తెగిన వాగై కళ్లనుండి ప్రవహిస్తూనే ఉంది.విషయం తెలుసుకున్న పిల్లలు కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. ముందుగా తెరుకుంది పెద్దైన సరసి.

బడిలో స్కాలర్ షిప్ కింద వచ్చిన డబ్బులతో మామూలు సెల్ పోన్ కొనుక్కుంది ఆరునెలల క్రితం. స్నేహితుల మరియు మాస్టర్ల సహాయంతో ఆ ఫోన్ ఎలా ఉపయోగించుకోవాలో  క్షుణ్ణంగా తెలుసుకుంది.

కొత్త కొత్త ఆప్ లద్వారా సామాజిక మాధ్యమాల లో ఉండే సమూహాలలో చేరి విషయ సేకరణ చేసేది. అలాగే తండ్రికి తగిన చికిత్స చేయించటం కోసం ఏదైనా వీలు ఉంటుందా అని వెతికితే కొన్ని స్వచ్ఛంద సంస్థలచే నడుపబడుతున్న ఆసుపత్రుల వివరాలు సేకరించి వారి ఫోన్ నంబర్ సేవ్ చేసుకుని వాళ్ళతో మాట్లాడింది తండ్రి విషయం పూర్తిగా వివరిస్తూ.

ఒక ఆసుపత్రి వాళ్ళు సంపూర్ణంగా ఆపరేషన్ చేయించటానికి ముందుకు వచ్చారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది అని చెప్పారు. తమదగ్గర ఉన్న రేషన్ కార్డ్ ని  తండ్రి రిపోర్ట్స్ ని తీసుకుని తల్లితండ్రులతో పాటు తాను కూడా వెళ్ళి అక్కడి వాళ్ళతో అన్నీ మాట్లాడి  చికిత్స నిమిత్తం ఆ ఆసుపత్రిలో చేర్పించి, తల్లిని తోడుగా పెత్తి దైర్యం చెప్పి వచ్చింది సరసి.

తనకి పరీక్షల కారణంగా తాను ఉండలేకపోతున్నందుకు బాధగా ఉన్నా ఇటు పొలాన్ని కూడా చ్సుకోవాలి కదా అన్న ఆలోచనతో ఇంటి దగ్గర చెల్లి కోమలిని ఉంచి తాను పొలం లోనే చెట్టుకింద కూర్చుని చదువుకోవచ్చు అన్న ఆలోచనతో  పుస్తకాలను కూడా తెచ్చుకుంది.

అక్కడే కూర్చుని చదువుకుంటూ అన్నీ వైపులా పరికించి చూస్తుంది పండి పక్యమౌతున్న దాన్యపు గింజలను పక్షులు దాడి చేస్తాయని తను కాపలాగా ఉంది.

ఇంటి దగ్గర కమలి చెల్లెలిని చూసుకుంటూ వంటపని, ఇంటి పని చేస్తుంది.ఇటు పరీక్షలు అన్నీ చక్కగా రాసింది సరసి. అటు సాయన్నకు జరగవలసిన వైద్యం జరిగి, కొద్దిగా కోలుకుంటూ నెల రోజులకు ఇంటికి వచ్చారు సాయన్న దంపతులు.రావలసిన పరీక్షా ఫలితాలు వచ్చాయి. జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొందింది సరసి. ఆ ఊరిలోనే పండుగ వాతావరణం నెలకొంది.

కష్టాలు వచ్చాయి అని క్రుంగి పోకుండా తగిన సమయస్పూర్తితో వాటిని ఎదుర్కోగలిగితే ఎంతటి కష్టం అయినా చిన్నదిగానే కనిపిస్తుంది.ఆడపిల్ల అని కేవలం ఇంటిపనికే పరైమితం అనుకోవడం పొరపాటు.

బాల్యం నుండే వారిలోని ప్రతీభ వికసిస్తున్న కుసుమం వలె శోభితమౌతూ ఉంటుంది. పెద్దలు అది గమనించి వారికి చేయూతని ఇస్తే చాలు. ఆకాశాన్ని అందుకోగల శక్తిని పొందగలుగుతారు.అందుకు ఉదాహరణ మన సరసి.

Also Read : బంధం

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!