A lesson learned from experience : అనుభవంతో నేర్చుకున్న ఒక గుణపాఠం

అనుభవంతో నేర్చుకున్న ఒక గుణపాఠం

 

కాఫీ పెట్టే విద్య

అవి నేను ఎం ఆ చేసిన తరువాత పరిశోధన చేస్తున్న రోజులు. మా అమ్మమ్మ గారింట ఏదో కార్యక్రమం, అందరం కలిశాము. అప్పటికి మా తాతగారింట విశ్వవిద్యాలయంలో చదువుతున్న మనుమరాలిని నేనే. చిన్న వాళ్ళందరూ నా చుట్టూ చేరి నేనో గొప్ప కథా నాయికలాగా విశ్వవిద్యాలయ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. 22-23 సంవత్సరాల వయసులో ఆనందంతో పల్లకీ ఎక్కేశాను

తెల్లవారింది ముందురోజు రాత్రి వంటమనిషి కాఫీ డికాషను చేసి వెళ్ళింది. అందరికంటే ముందే లేచాను. పెద్దపిల్లనే కదా కాఫీ కలపటం ఎంత పని అని మా దొడ్డమ్మ కాఫీ కలిపి అందరికీ ఇవ్వమని నాకు చెప్పింది. అప్పుడే పితికి తెచ్చిన రెండు లీటర్ల పాలు చక్కగా కాచాను. పక్కనే పెద్ద గిన్నేలో ఉన్న డికాషనులో పొసేశాను.

ఎంత కలిపినా కాఫీ రంగురాదే! పైగా క్రింద బరువుగా గరిటకు ఏదో తగులుతోంది. కొద్దిగా బయటకు తీసి చూసాను కదా , కాఫీ పొడి. డికాషను క్రింద పొడి ఉంటుందా, పొడి పైన, డికాషను క్రింద ఉండాలి కదా, ఇప్పుడు ఎలా! ఆ వూళ్ళో హైదరాబాదులో లాగా ఎప్పుడంటే అప్పుడు పాల పేకెట్లు దొరకవు. దొడ్లో పాడి ఉంటె సరే .లేకుంటే పక్క ఊరు వెళ్లి తేవాలి. ఉదయమే ఎవరు వెళ్లి తెస్తారు? నాకు కాళ్ళల్లో ఒణుకు వస్తోంది.

పెద్దలు ఒక్కొక్కరు లేస్తున్నారు. ముఖాలు కడిగి అమ్మాయ్ కాఫీ అని పిలుస్తున్నారు. ఎన్నిసార్లు పిలిచినా నేను కాఫీతో రాకపోయేసరికి , దొడ్డమ్మ వంటింట్లోకి వచ్చింది.

గిన్నె చూపించి కన్నీళ్ళు పెట్టుకున్నాను. కాఫీ గత ప్రాణి, ఆవిడ మండి పడింది. ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఎగిరి పడ్డారు.” ఏమే భానూ పిల్లకి కాఫీ పెట్టడమన్నా నేర్పలేదే” అని అమ్మ మీద అరిచారు.

నాకు ఏమి చెయ్యాలో తెలియలేదు. పొద్దున్నే కాఫీ అలవాటు ఉన్న వారందరినీ ఎంత ఇబ్బంది పెట్టాను.కాఫీ కలపటానికి ఫిల్టరు డికాషను తప్ప మరో విధం ఉంటుంది అని నాకు తెలియదు. తెలుసుకోక పోవటం నాదే తప్పు కదా! అందరికి తప్పై పోయిందని చెప్పి పేరు పేరునా క్షమాపణ అడిగాను. ఒక అరగంటలో ఆ తుఫాను సర్దుకుంది.

“పిల్లలే పోనీలే” అని క్షమించేశారు. ఇప్పటికి దొడ్డమ్మ ఎప్పుడు కలిసినా ఆ సంఘటన గుర్తుచేసి నన్ను ఉడికిస్తుంది. మనకు తెలిసిందే వేదమని భావించరాదని, ప్రతి చిన్న విషయం లోనూ నేర్చుకోవలసిన , తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయని ఆరోజు నేను తెలుసుకున్నాను.

 

Also Read : భగవద్గీత ను సంభోదిస్తూ ఒక నీతి కథ

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!