జన్మ జన్మలకు మరచి పోలేను
జీవితంపై ఆశలన్ని ఆవిరై ప్రాణ భయంతో
బిక్కు బిక్కు మంటు దిక్కులు చూస్తున్న
దిక్కుతోచని స్థితిలో దేవుడల్లే వచ్చి ఆదుకున్న
ఆపద్బాంధవుడు అతడు
విపత్కర పరిస్థితుల ఆపద కాలంలో
ఆప్తుడై కదిలొచ్చి నేనున్నానని భరోసా ఇచ్చిన
ఆత్మబంధువు అతడు
చిమ్మ చీకట్లు కమ్ముకుని
బ్రతుకుబాటలో ముళ్ళపొదల్లా
కమ్మేసి అణువణువు ఆర్తనాదాలు
మిన్నుముట్టిన వేళ
చల్లని చంద్రుడై సేద తీర్చిన
సిద్దుడు అతడు
అస్తిపాస్తులు లేకున్నా,బంధు బలగాలు లేకున్నా
మంచి మానవత్వపు అస్థిత్వం వుందన్న
ఒకే ఒక్క కారణంతో నన్ను కాపాడుతున్న
కారణ జన్ముడతడు
కులమతాల పిచ్చితో కాలిపోయే ఈ కాలంలో
అంటారనివాడిననే అంతరాలు చూడక
ఆదుకున్న అసమాన్యుడతడు
కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న
ప్రాణానికి ఊపిరి పొసే సంజీవని వృక్షంలా
సాక్షాత్కారించి రక్షించిన రక్షకుడతడు.
ఇంతమంది జనమందరిలో
తాను ఒక్కడే తన ఉదాత్త గుణానికి
సాటి రాడు ఏ ఒక్కరు జీవితమంతా వెతికినా
దొరకడు ఇటువంటి ఉత్తమోత్తముడు
మర్చిపోను ఎన్నడు
కష్టాల్లో తోడున్న ఈ మహానుభావుడిని
నా జీవితాన్ని నిలబెట్టిన ఆపద్బాంధవుడిని
ఎన్ని జన్మలు ఎత్తిన మరచిపోలేను
Also Read : తెలుసుకో ఓ మనసా