అక్షరమే ఆయుధం
అజ్ఞానపు మట్టి పొరలు తొలిచే పదునైన పలుగులు
ప్రజాగళాలను పాలకులపై గురి పెట్టే పాశుపతాస్త్రాలు
నిరంకుశత్వంపై నిర్భయంగా ఎక్కుపెట్టే అంకుశాలు
సాహితీ మూలాలను పాడు చేసే కలుపు మొక్కల కుత్తుకలు కత్తిరించే గండ్ర కొడవళ్ళు
అంతర్యుద్ధ ఆలోచనా తరంగాల చురకత్తులు
చరిత్ర గనుల్లో దాగిన ఖనిజాలను వెలికితీయ గల దుర్భిణులు
సమాజ అసమానతలను రూపుమాపే మొండి కత్తులు
చీకటి రాత్రుల్లో వెలుగును చిందించే జ్వాలలు
ఆరిపోతున్న ఆశలకు,ఆశయాల ఇంధనాలు
మస్తిష్కంలోని మత్తును విచ్చేదన చేసే శరాలు
ప్రశ్నల కుంపటిలో కణకణ మండే అగ్నికణాలు
నాగరికత సమాజాన్ని నిలబెట్టిన మూల స్తంభాలు
కల్తీ మాటలను,కల్తీ చేతలను నిగ్గదీసే నిజానిజాలు
స్వార్థపు కంపును, ఆధిపత్యాల మురికిని ఎండగట్టే స్ఫూర్తి కిరణాలు.
మానవాళిని జాగృతి పరిచే నవ నవోన్మేష చైతన్య దీపికలు
Also Read : జీవన సమరం