వైకుంఠపాళీ
ఉదయం లేచింది మొదలు అనుక్షణం
అనుదినం పొట్ట కూటికోసం పరుగెడుతూ
ఏ రోజుకారోజు పని దొరికితే చాలు అనుకుంటూ
ఆ సంపాదనతో ఈ పూట గడిస్తే చాలు అనుకుంటూ
ఎన్నో హృదయాల ఆరాటం,పోరాటం.
వైకుంఠపాళీ ఆటలో సర్పాలు నోట్లో పడుతూ, తప్పించుకున్నట్లుగా
జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు,కష్టాలలో నలిగిపోతూ
సుడిగుండాలలో చిక్కుకుంటూ, సమస్యల వలయంలో పడిపోతూ
బంధాల మధ్యలో నలిగిపోతూ, బరువు,బాధ్యతలుమోస్తూ
ఆశ,నిరాశ,నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ
జీవన సమరం సాగిస్తున్నారు.
సముద్రంలోని కెరటం లేచి పడుతున్నట్లుగా
చకోర పక్షి వర్షం కోసం ఎదురు చూస్తున్నట్లుగా
మోడు వారిన చెట్లు చిగురిస్తున్నట్లుగా
ప్రయత్నలోపం లేకుండా మానవుడు కూడా జీవిత సాగరాన్ని ఈదుతున్నాడు
ఆశలు లేని జీవితం ప్రాణం లేని దేహం వంటిది అన్నట్లుగా
మానవుడు కూడా ఆశల సౌధంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, దిగుతూ
విజయాలు,పరాజయాలు చవి చూస్తూ
నీతి,నిజాయితీ, నిస్వార్థంతో పనిచేస్తూ
ఎన్నో శిఖరాలు అధిరోహిస్తూ జీవన పోరాటం సాగిస్తున్నాడు.
చివరికి జీవిత పరమార్థం ఏమిటో తెలియక తికమక పడుతూ
విధాత చేతి లో కీలు బొమ్మలాగా ఆడడమే తప్ప చేసేదేమీ లేదని సరిపెట్టుకుంటూ
మనిషి మనుగడ ఉన్నంత కాలం సాగించడమే ఈ జీవన సమరం
Also Read : బ్రతుకే ఒక సమరం