గంజైనా చాలు బిడ్డా
జీవన సమరంలో పోరాడి పోరాడి
ఆశల రెక్కలు విరిగి పోతున్నాయి
రెక్కాడితే గాని డొక్కాడని దీన స్థితిలో
నిత్య జీవన సమరం చేస్తు
సత్యానికి దూరమవుతున్నా
సమస్యల సుడిగుండాలు
దాటలేక అభద్రతాభావం పెరుగుతుంటే
మాట తప్పడం అలవాటై
నోటి విలువ తగ్గిపోయింది
కష్టాల మోత బరువు
కన్నీరు పెట్టిస్తుంటే
అభాసుపాలవుతున్న ప్రతిక్షణం
భాద్యత బరువవుతోంది
పేదతనం వేదన
పేగు బంధం వాదనతో
అలసి పోయింది
ఉన్నోడిని పోల్చుకొని
లేనోడు లేడిలా పరుగెత్తుతే
జరగబోయే నష్టం
మాయ కమ్మిన మనిషి మనసు
గ్రహించేది ఎన్నడు?
బ్రహ్మ రాసిన రాతను
మార్చాలని ఏమార్చే దొంగను
అవుతానంటే తండ్రిగా ఒప్పుకోను
కష్టమో నష్టమో
కాయో పండు ఉన్నదానితో
కష్టపడదాం
నియమం తప్పని
బ్రతుకును బ్రతుకుదాం
భ్రష్టు పట్టించే అబద్దాలు
మనకొద్దు మాయలోడిగా
మనుగడలో చెరుకు గడ తీపి వద్దు
కష్టపడే గుణంతో గంజైనా చాలు బిడ్డా
Also Read : ఎదురుచూపు