జీవన సమరం
పుడమిపై పుట్టిన ప్రతిజీవి బ్రతుకున
సాగించే సమరమే జీవన సమరం,
కూడు, గూడు, గుడ్డ సముపార్జనకు వృత్తి, ఉద్యోగాలు, కాయకష్టాలు చేస్తు రేయనక, పగలనక ప్రాకులాడె జీవితాలు.
అజ్ఞానపు ఆ రోజులు ఆది మానవుడి అవస్థలు
విజ్ఞానం వికసించి విశ్వమంత ఎత్తుకెదగ
ఈనాడు బడుగు, బలహీన వర్గాల జీవనం దుర్లభం
రెక్కడితేగాని డొక్కాడని బ్రతుకులు
నిరక్షరాస్యత, ప్రకృతి ప్రసాదితాలనే ఆహార ఆవాసాలుగ చేసుకొని
అడవి సంపదలు అందినంత ఉన్నా, దళారుల చేతిలో దగాలు పడుతూ
దారీతెన్నూ కానరాని వ్యర్థ జీవితాలు రోడ్డు, రవాణా సౌకర్యాలు
విద్య, వైద్య సౌకర్యాలు కరువు, మాతా, శిశు మరణాలు మెండు తాగు నీటికోసం
తాటిచెట్లలోతు తాడు వేసి లాగి లాగి గుక్కెడు నీటిని గుమ్మనంగ మొసుకొంటు సాగే సమరం
ప్రసవానికి పదిమైళ్ళు పొట్ట పట్టి ప్రాణాలను పణం పెట్టి
ఈడ్చుకొంటు, నడుచుకొంటు నానా యాతనలు పడుతు
ప్రాణాలను గాలిలో దీపాలుగ రెపరెప లాడిస్తూ సాగే సమరం
విష పురుగుల నడుమ జీవత్సోవ జీవితాలు
మిణుగురుల వెలుగులో మిణుకు మిణుకు జీవితాలు
జనన మరణాల మధ్య జన జీవన జైత్రయాత్ర జీవన సమరం.