ఓనమాలలో ఒద్దికైన నా తెలుగు
అమ్మ ప్రేమలా, ఆవకాయలా
ఇంగువ పోపులా, ఈలపాటలా
ఉలవచారులా,ఊయలాటలా
ఋతురాగంలా
ఎంకి సొంపులా, ఏటి గలగలలా
ఐమూలలా ఒద్దికగు ఓనమాల ఔదుంబరం
అంతఃకరణ ఉత్తుంగ తరంగం – నా తెలుగు.
కమ్మగా – ఖందసారి పలుకులా
శ్రీ గంధపు ఘమాయింపులా
చక్కంగా – ఛందోభద్దంగా
జలజల మను ఝరీ తరంగంలా
రసజ్ఞుల కళల -కలాల పెన్నిధి – నా తెలుగు.
టపాసుల ఠపఠపలా,డప్పుల ఢమఢమలా
నిక్వణిత వీణాతరంగంలా,
తారా పథంలా, దక్షవాటిక ధునిలా
నాగమల్లి పూలలా, నిండు ఫల్గుణంలా
బంతి చెండులా, భద్రగిరి ధామంలా
మామిడి తోరణంలా ఇంటింట వెలుగు – నా తెలుగు.
యాసల రంగవల్లికలా, లయబద్ద వసంతగీతికలా
శంఖారావంలా, షడ్రుచుల సమాగంలా
హేమంత తళతళలా
అక్షతమౌ చెఱకు పానకము – నా తెలుగు.
Also Read : తేట తెలుగు – తేనె చినుకు