తేట తెలుగు – తేనె చినుకు
ఓంకార నాదమై మమకార బీజమై
మనసులనల్లుకున్న అజంతా భాష
భావాల మిళితమై బంధాల సాక్షమై
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా వినుతికెక్కిన భాష
అచ్చులు హల్లులతో అణువణువు అలరగా
సంధి సమాసాలతో తనువంతా మెరవగా
ఛందస్సు చందనమే మేనిపై పూతగా
అలంకార భూషణాలే కంఠాన కాంతులీనగా
అమ్మపాల అమృతమే దేహమై నిలవగా
గుమ్మపాల నురగలే ఉల్లమంత పొంగగా
కవిపుంగవుల కలములోన కవనమై దూరగా
పండితుల గళములో పద్యమై పారగా
తేట తెలుగు భాష తేనె చినుకు నా భాష
చాటువులే పాటవమై యాసలే ప్రాసలై
పదాలే పరవశించగా పాటలై ప్రవహించగా
వ్యాసమై వర్థిల్లగా కథలే వీనుల విందుగా
యాబదారు అక్షర సొగసుల సుందరకావ్యం
వేల యేండ్ల నా భాష వేనోళ్ళ నా తెలుగు భాష
మాతృభాష మకరందం మనమంతా గ్రోలగా
నేటి తరానికి వారసత్వంగా అందించగా
సజీవమై నా భాష విజయకేతనమెగరేయదా
Also Read : నా తెలుగు