Question : ప్రశ్నించు

ప్రశ్నించు

 

ప్రశ్నించు

ముక్కు పచ్చలారని పసిదాని నుంచి

మూడుకాళ్ల ముసలిని కూడా వదలక
పశువాంఛను తీర్చుకునే మృగాల వేటతో
కుళ్లి కంపుకొడుతున్న ఈ సమాజంలో
మానవత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తావు?

నవమాసాలు చీకటి గర్భంలో మము మోసి
పురుటినొప్పుల బాధను పంటి బిగువన దాచి
జాతికి జన్మనిచ్చి మానవ జగతికి జననివైతే
అమ్మతనాన్ని అంగట్లో అమ్మకానికి పెట్టే
మగజాతి రాక్షసత్వాన్ని ఏమని ప్రశ్నిస్తావు?

నాన్న,చిన్నాన్న,అన్న,గురువు,స్నేహం
వావివరుసలు మరిచి కామాంధకారంతో

అతివలను చెరబట్టడమే మగతనమనుకునే
చేతకాని చేవలేని నపుంసక వారుసులైన
సంకరజాతి క్షణికానందాన్ని ఎలా ప్రశ్నిస్తావు?

పుట్టుక నుంచి చావుదాకా బతుకు నరకమై
తండ్రి, భర్త, కొడుకుల చేతుల్లో బానిసవై
వరకట్నపు విషకోరల్లో ఆహుతికమ్మని
ఈ శాపగ్రస్తమైన ఆడతనాన్నిచ్చిన సృష్టికర్తే
పురుషజాతి ప్రతిరూపమైతే ఇంకెవర్ని ప్రశ్నిస్తావు?

ఎముకుల గూడుపై మాంసపు ముద్దలా చూసి
తనకు పాలు పంచిన స్తనద్వయమని మరిచి
మాతృత్వపు మమకారాలను పిడికిట్లో నలిపేసి
తనకు ప్రాణం పోసిన పుణ్యస్థలాన్ని ఛిద్రంచేసి
జన్మస్థానాన్ని జయించాననుకునే మృగాన్ని ఇంకేం ప్రశ్నిస్తావు?

బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా బలిపశువుని చేసి
అబల,కోమలి అంటూ లేని పిరికితనాన్ని అంటగట్టి
నాలుగు గోడల మధ్య నలిగిపొమ్మనే కట్టుబాట్లు పెట్టి
నిను బానిసకొక బానిసను చేసి జగతి సృష్టిని ఆపాలనుకునే
మగజాతి పెత్తనాన్ని ‘నేను సైతం’ అంటూ బరిదూకి ప్రశ్నించు.

 

Also Read :  ఆయుధం

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!